31, అక్టోబర్ 2023, మంగళవారం

నవగ్రహా పురాణం🪐* . *70వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *70వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*చంద్రగ్రహ చరిత్ర - 8*


దక్షప్రజాపతి ఇంద్రుడి వైపు చూశాడు. *"ఇంద్రా ! నా శాపాన్ని పూర్తిగా ఉపసంహరించే ఇష్టం నాకు లేదు. సరస్వతీ నది సముద్రంలో కలిసే పావన సంగమ స్థానంలో స్నానం చేస్తూ ఉంటే క్షయ తగ్గుముఖం పడుతుంది. చంద్రుడి కళ వృద్ధి చెందుతుంది. ఆ స్నాన ప్రభావంతో చంద్రుడు పక్షం రోజులు వృద్ధి చెందుతాడు. పక్షం రోజులు క్షీణిస్తూ ఉంటాడు. భార్యలందరినీ సమదృష్టితో చూసే సత్ప్రవర్తన సరస్వతీ సంగమ స్నానం ద్వారా సిద్ధించే వృద్ధికి మూలంగా ఉంటుంది.”*


*"మాతామహా ! అంటే చంద్రుడు ఒక మాసంలో పక్షం రోజులు తన 'కళ' పరంగా క్రమంగా వృద్ధి చెందుతూ పరిపూర్ణమైన కళతో ఆనందంగా ఉంటాడు. రెండవ పక్షం రోజులూ కళ క్షీణిస్తూ ఉంటుంది ! అంతే కదు !"* అన్నాడు ఇంద్రుడు.


*"చక్కగా గ్రహించావు ! మాసంలో సగం రోజులు వృద్ధి చంద్రుడుగా , సగం రోజులు క్షీణ చంద్రుడుగా ఉంటాడు !"* దక్షుడు వివరించాడు. *"ప్రతీ అమావాస్య నాడూ ఆ తీర్థంలో స్నానం చేస్తూ ఉండాలి !"*


*"చక్కటి పరిష్కారం. ఇది ఉభయతారకం !"* నారదుడు మెచ్చుకున్నాడు. 


చంద్రుడిని అక్కడే వదిలి పెట్టి , ఇంద్రాదులు వెళ్ళిపోయారు. 


*“మామగారూ ! నన్ను క్షమించండి !"* చంద్రుడు దక్ష ప్రజాపతితో అన్నాడు.


*"క్షమించాను గనుకనే శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించాను. అమావాస్య , అమావాస్యకూ సరస్వతీ సాగర సంగమ స్థానంలో పవిత్ర స్నానం చేస్తూ , నీ కళలను వృద్ధి చేసుకుంటూ ఉండు. నీ సప్తవింశతి సతీమణులనూ సమానంగా ఆదరించు !”* దక్షుడు ప్రబోధించాడు.


చంద్రుడు అశ్వినీ , ఆమెలాగే తన మూలంగా క్షోభించిన ఆమె చెల్లెళ్ళనూ కలయజూస్తూ , గద్గద కంఠంతో క్షమాపణ అడిగాడు. చేసిన అపరాధానికి చింత వ్యక్తం చేసి , అత్తగారి ఆశీస్సులు అందుకున్నాడు. అందరి నుండి అనుమతి స్వీకరించి , సరస్వతీ సంగమ స్థానంలో స్నానం చేయడానికి వెళ్ళాడు.


పావన తీర్థంలో స్నానం చేయగానే చంద్రుడి శరీరాన్ని పీడిస్తూ వస్తున్న భయంకర వ్యాధి నిమ్మళించింది. ఆరోగ్యాన్ని పుంజుకుంటూ , వర్చస్సునూ , కళనూ పెంపొందించు కుంటూ పత్నులందరితోనూ అత్తవారింట కొంతకాలం విడిదిచేసి ఇరవై యేడుగురు చక్కని చుక్కలనూ వెంటబెట్టుకుని తన మందిరం చేరుకున్నాడు చంద్రుడు.


ఆనాటి నుండి పత్నులందరినీ సమదృష్టితో ఆదరిస్తూ - 'బహు సతీవ్రతుడి'గా పేరు పొందాడు. చంద్రుడు కళాపూర్ణుడైన క్షణం నుంచీ ఔషధులకూ , వృక్షసంతతికీ , సస్యాలకూ ప్రాణాలు లేచి వచ్చాయి.


ప్రాణులకు ఆహారము , ఆరోగ్యం సంప్రాప్తించాయి. అన్ని లోకాలలోనూ ఆనందం వెళ్ళి విరిసింది.


చంద్ర మందిరం ఆనంద మందిరంగా మారింది.


*"ఇదీ చంద్రుడి చరిత్ర !"* కథనం ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద.


*"ఆలోచిస్తూ ఉంటే , చంద్రుడు సౌందర్యోపాసకుడనిపిస్తోంది. గురువుగారూ !".* విమలానందుడు నవ్వుతూ అన్నాడు. *“వివాహానికి ముందు తారా ప్రణయం , వివాహానంతరం రోహిణీ పక్షపాతం !"*


నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. *"స్థూల దృష్టికి కనిపించేది అదే ! ఇలాంటి విషయాలను సూక్ష్మంగా ఆలోచించాలి. అలా ఆలోచించేటప్పుడు ప్రస్తుతం మన ఆచారాలనూ , నియమ నిబంధనలనూ , కట్టుబాట్లనూ కొలబద్దలుగా తీసుకోరాదు. చంద్రుడు నవగ్రహాలలో ఒకడు. దైవస్వరూపు డాయన. దైవస్వరూపాల కార్యకలాపాలు లోకాల హితం కోసమే జరుగుతాయి. చంద్రుడు తారతో ప్రణయ యాత్ర సాగించాడు. దాని ఫలితంగా నవగ్రహాలలో మరొక గ్రహమైన బుధుడు ఆవిర్భవించాడు. ఇదే లోక హితం ! ఆ విషయంలో బృహస్పతి ఆలోచనా , స్పందనా సుస్పష్టమే. తన ధర్మపత్ని తార పాతివ్రత్యానికి భంగం కలిగిందని ఆయన అనుకోలేదు. స్త్రీ వ్యభిచార దోషం బహిష్టుతో ప్రక్షాళనమైపోతుందన్న నీతిని ప్రకటించిన శాసనకర్త ఆయన. తను అనుశాసన ధర్మానికి కట్టుబడే ప్రవర్తించాడు.”*


*"ఇక చంద్రుడి రోహిణీ పక్షపాతం - రోహిణిని ఇష్ట పత్నిగా నెత్తికెక్కించుకుని , ఇతర పత్నుల్ని కష్టపెట్టినందుకు ఆయన క్షయవ్యాధిని కొని తెచ్చుకున్నాడు. పర్యవసానంగా నెలలో పక్షం రోజులు వృద్ధి చంద్రుడుగా , పక్షం రోజులు క్షీణ చంద్రుడుగా ఉండాల్సి వచ్చింది. సృష్టిలో - ఈ విశ్వంలో సాగుతూ వస్తున్న చంద్రుడి వృద్ధి , క్షీణత వల్ల వాతావరణానికి మేలే జరిగింది కదా ! లోకాలకు హితమే జరిగింది కదా ! అదే విధంగా అంతరాళంలో నెలకొన్న చంద్రుడి వల్లా , ఆయన పత్నులైన అశ్వినీ , భరణీ మొదలైన ఇరవై ఏడు నక్షత్రాల వల్ల కూడా జరిగిందీ , జరుగుతుందీ లోకహితమే !"*


*"బాగుంది గురువుగారూ ! మీ విశ్లేషణ మాలో కలిగిన అనుమానాలను నివృత్తి చేసింది !"* శివానందుడు అన్నాడు.


*"సంతోషం , నాయనా ! ఇప్పుడు నవగ్రహాలలో మూడవ గ్రహమైన కుజుడి చరిత్ర శ్రవణం చేయండి !”* నిర్వికల్పానంద అన్నాడు. *"కుజుడు పరమశివుడి స్వేదబిందువు నుంచి ఆవిర్భవించాడనీ , భూదేవి ఆ బాలుడిని తన బిడ్డగా స్వీకరించిందనీ చెప్పుకున్నాం. కదా ! పరమేశ్వరుడు సూచించిన విధంగా , భూమాత కుజుణ్ణి కన్నబిడ్డలా చూసుకుంటోంది. కుజుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు...”*


*రేపటి నుండి కుజగ్రహ చరిత్ర చదువుకుందాము*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: