31, అక్టోబర్ 2023, మంగళవారం

ఆగిపోయిన శోకం..*

 *ఆగిపోయిన శోకం..*


2005, 06 ప్రాంతాల్లో మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద భక్తుల కొరకు పెద్దగా వసతి ఏర్పాట్లు ఉండేవి కాదు..స్వామి సమాధి మందిరం..ఆ మందిరానికి ముందు ఒక మంటపం మాత్రమే ఉండేవి..మందిరం చుట్టూరా ప్రదక్షిణ చేయడానికి నాలుగు, ఐదు అడుగుల మేర దారి లాగా ఉండేది..మిగిలిన ప్రదేశం అంతా పిచ్చి మొక్కలు మొలచి ఉండేవి..బాగా దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్ళు, లేదా గ్రహచేష్టలతో బాధపడే వాళ్ళు స్వామివారి మందిరం వద్దకు వచ్చి..మందిరానికి వెలుపల ఉన్న రేకుల షెడ్లలో ఉండేవాళ్ళు..ఆ సమయం లో బాధ్యతలు తీసుకున్న నాకు..ముందుగా భక్తులకు వసతి ఎలా చూపాలా అనే ఆలోచన ఉండేది..అయితే స్వామివారి కృప వల్ల ఒక్కొక్క వసతి ఏర్పడసాగింది..


ఆరోజుల్లో ఒకనాడు..ఒక భార్యాభర్తలు తమ పధ్నాలుగేళ్ల కూతురిని వెంటపెట్టుకొని స్వామివారి మందిరానికి వచ్చారు..ఆ దంపతుల ముఖం లో ఆందోళన కనబడుతోంది..వాళ్ళ కూతురు చిన్నగా ఏడుస్తోంది..అలా ఏడుస్తున్న కూతురిని పొదివి పట్టుకొని..స్వామివారి మందిరం చుట్టూరా ఒక ప్రదక్షిణ చేయించి..మంటపం లో పడుకోబెట్టారు..ఆ తరువాత ఆ పిల్ల నాన్న మా సిబ్బంది వద్దకు వచ్చి.."అయ్యా..దూరం నుంచి వచ్చాము..కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాము..మేము ఉండటానికి ఏదైనా వసతి ఉన్నదా..?" అని అడిగాడు.."గుడి వెనకాల ఒక రేకుల షెడ్డు ఉన్నది..ప్రస్తుతం అందులో ఇద్దరే వున్నారు..మీరు కూడా అక్కడే వుండండి..అందులో ముప్పై మంది వరకూ ఉండొచ్చు..మీకు ఇబ్బంది లేదు.." అని చెప్పారు.."అలాగే అయ్యా.." అని తాము తెచ్చుకున్న సంచులు తీసుకొని..రేకుల షెడ్ లో పెట్టుకొని వచ్చాడు..అతని కూతురు మాత్రం ఏడుస్తూనే ఉన్నది..ఆ రాత్రికి ఆ దంపతులు స్వామివారి మంటపం లోనే కూతురితో సహా పడుకున్నారు..ఆ అమ్మాయి ఏడుపు ఆపటం లేదు..అలా అని పెద్దగా కేకలు పెట్టటం లేదు..కానీ చిన్న స్వరంతో ఏడుస్తూనే ఉన్నది..


ఆ ప్రక్కరోజు ఉదయం నేను స్వామివారి మందిరానికి వచ్చి..స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చేసరికి..ఆ అమ్మాయి మంటపం లో బోర్లా పడుకొని ఏడుస్తూ ఉన్నది..ఆ పిల్ల తల్లి  ఎంతగానో సముదాయిస్తోంది..కానీ ఫలితం లేదు..కొంచెం సేపటికి ఆ అమ్మాయి లేచి కూర్చుని..తల్లి భుజం మీద తల పెట్టుకొని.."అమ్మా..ఈ నొప్పి తగ్గలేదే..కడుపులో కుట్టుగా ఉంటోంది.." అంటూ మళ్లీ ఏడవడం మొదలు పెట్టింది..చూస్తున్న మా కందరికీ ఒక విధమైన చిరాకు గా ఉంది కానీ..ఆ అమ్మాయి దేని వల్ల బాధపడుతున్నదీ తెలియలేదు..మరో రెండు మూడు గంటల తరువాత కూడా అదే పరిస్థితి..ఆ అమ్మాయి దగ్గరే కూర్చుని ఉన్న ఆ పిల్ల తండ్రిని పిలిచాను..వచ్చాడు.."మీ అమ్మాయి ఏ జబ్బుతో బాధపడుతున్నదో మీకు తెలుసా?..ఇంతకుముందు ఎవరైనా డాక్టర్ల కు చూపించారా..?" అని అడిగాను.."అయ్యా..ఒక్క ఐదు నిమిషాలు ఓపిక పట్టు..ఇప్పుడే వస్తాను.." అని చెప్పి..గబగబా రేకుల షెడ్ లోకి వెళ్లి ఒక సంచీ తీసుకొచ్చాడు..అందులోనుంచి..దాదాపు పది హాస్పిటళ్ల తాలూకు ఫైళ్లు తీసి నాకు చూపించాడు..చెన్నై విజయా హాస్పిటల్ మొదలుకొని..ఒంగోలు లో పేరెన్నికగన్న డాక్టర్ల వరకూ చేసిన టెస్టులూ..రిపోర్టులు అన్నీ ఉన్నాయి..


"అందరికీ చూపించానయ్యా..ఎవ్వరూ దీని కొచ్చిన జబ్బు తేల్చలేదు..కడుపులో ఏమీ లేదు..అమ్మాయికి ఏ లోపం లేదు అన్నారు..అమ్మాయేమో తనకు కడుపులో మెలి పెట్టినట్టు బాధగా వుంటుంది అని చెప్పి..నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్నది..మాకు ఏ దిక్కూ తోచక ఈ స్వామి ని నమ్ముకుంటే బాగుపడుతుందని మాకు తెలిసిన వాళ్ళు చెపితే ఇక్కడకు వచ్చామయ్యా..మాకు ఇదొక్కటే కూతురు..దాదాపు ఎనిమిది నెలల నుంచీ ఇట్లా ఏడుస్తూనే ఉంది..దాని బాధ చూడలేకుండా ఉన్నాము.." అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.."సరే..స్వామిని గట్టిగా నమ్ముకోండి.." అని చెప్పాను..అలాగే అని తలవూపి వెళ్ళిపోయాడు..


మరో మూడురోజుల దాకా ఆ అమ్మాయి పరిస్థితి లో మార్పు రాలేదు..ఆరోజు శనివారం..స్వామివారి పల్లకీసేవ అయిపోయిన తరువాత..భక్తులు భజన చేయడం మొదలుపెట్టారు..భజన మొదలైన అరగంట తరువాత..ఈ అమ్మాయి లేచి కూర్చుని..ఆ భజన పాటకు అనుగుణంగా చేతితో చప్పట్లు కొడుతున్నది..ఏడుపు లేదు..అలా ఆ రాత్రి భజన అయిపోయిన తరువాత..ఆ పిల్ల ఏడవకుండా నిద్రపోయింది..ప్రక్కరోజు ఆదివారం ఉదయం కూడా ఆ అమ్మాయి మామూలుగానే ఉన్నది..ఆ పిల్ల తల్లిదండ్రులకు కొద్దిగా సంతోషం గా ఉంది..మళ్లీ ఎక్కడ ఏడుస్తూ ఉంటుందో అనే భయం తోనూ వున్నారు..కానీ ఆరోజు నుంచి ఆ అమ్మాయి ఏడవలేదు సరికదా..కడుపులో నొప్పి అని కూడా చెప్పలేదు..ఆ దంపతులు తమ కూతురిని పెట్టుకొని స్వామివారి వద్ద మొత్తం ఇరవై ఒక్క రోజులున్నారు..తమ కూతురికి సంపూర్ణంగా తగ్గింది అని నమ్మకం ఏర్పడ్డాక..స్వామివారికి నైవేద్యం పెట్టుకొని..మా సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పుకొని వెళుతూ.."అయ్యా..ఆ శనివారం రాత్రి భజన సమయం లో ఏమి జరిగిందో తెలీదు కానీ..మా బిడ్డ ఆరాత్రి నుంచి ఏడవలేదు..స్వామి ఏ మహిమ చూపాడో..మొత్తానికి మా అమ్మాయి సంతోషంగా ఉంది..అదే చాలు.." అని చెప్పి వెళ్లారు..


ఇప్పుడు ఆ అమ్మాయి ఇద్దరు బిడ్డల తల్లి..భర్తతో కలిసి స్వామివారి దర్శనానికి వస్తూ వుంటుంది..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని.."ఈ స్వామి దయవల్లే ఇప్పుడు నేను ఇలా వున్నాను..నన్ను కాపాడినట్లే నా భర్తను, పిల్లలను చల్లంగా చూడు తండ్రీ.." అని మొక్కుకుంటుంది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: