11, అక్టోబర్ 2023, బుధవారం

కుమారుడి కాపురం

 *కుమారుడి కాపురం..*


ఒక ఆదివారం నాటి సాయంత్రం ఐదున్నర గంటలకు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వచ్చే బస్సులో నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు..ఇద్దరిలో ఒకరు డెబ్భై ఏళ్ల పై బడిన తల్లి..ఆమెను జాగ్రత్తగా చేయిపట్టి నడిపిస్తూ వస్తున్న కుమారుడు..ఇతని కి కూడా దాదాపు యాభై ఏళ్ల వయసు వుంటుంది..ఇద్దరూ స్వామివారి మందిరం లోకి వచ్చారు..మా సిబ్బంది వద్దకు వెళ్లి.."మేము చెన్నై నుంచి వస్తున్నాము..మూడురోజులు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాము..మేము ఉండటానికి ఏదైనా రూము దొరుకుతుందా?.." అని అడిగారు..మా సిబ్బంది రిజిస్టర్ చూసి.."రూము ఖాళీ ఉన్నదండీ..కాకుంటే మళ్లీ శుక్రవారం నాటికి మీరు ఆ రూము ఖాళీ చేసి మాకు అప్పచెప్పాలి..ఆరోజు వేరే వాళ్లకు కేటాయించాము.." అన్నారు.."అయ్యో..అన్నిరోజులు అక్కరలేదండీ..బుధవారం సాయంత్రమే మీకు అప్పచెప్పి..మేము చెన్నై వెళ్లిపోతాము.." అన్నారు..వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని..ఒక గదిని వాళ్లకు కేటాయించారు..ఇద్దరూ తమ గది వద్దకు వెళ్లారు..


మరో గంట తరువాత..ఆ తల్లీకుమారులు స్వామివారి మందిరం లోకి వచ్చారు..ఇద్దరూ స్వామివారి మంటపం లోకి వచ్చి..అక్కడినుంచి స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు..ఆ పెద్దావిడ అక్కడే మంటపం లో కూర్చున్నారు..ఆమె కుమారుడు భక్తిగా ప్రదక్షిణాలు చేసాడు..ఆ రాత్రికి ఇద్దరూ మంటపం లోనే పడుకున్నారు..సోమవారం నాడు ఉదయం ఐదు గంటలకే స్నానం చేసి..ఇద్దరూ మంటపం లో కూర్చున్నారు..స్వామివారికి ప్రభాతసేవ లో భాగంగా ఇచ్చే హారతులు కళ్లకద్దుకొని..అర్చకస్వామి ఇచ్చిన తీర్ధాన్ని స్వీకరించి..మళ్లీ మంటపం లో కూర్చున్నారు..ఆరోజు, ఆ ప్రక్కరోజు కూడా దాదాపుగా ఇదే విధంగా..స్వామివారికి ఇచ్చే అన్ని హారతుల ను చూసి..కళ్లకద్దుకొని..తీర్ధాన్ని తీసుకొని..మంటపం లో కూర్చుని ధ్యానం చేసుకోసాగారు..


బుధవారం నాటి ఉదయం ప్రభాతసేవ పూర్తి అయిన తరువాత..స్వామివారి తీర్ధాన్ని తీసుకొని..ఆ తల్లీకుమారులిద్దరూ నేను కూర్చున్న చోటుకి వచ్చారు.."అయ్యా..నా పేరు భానుమూర్తి..మీతో ఈరోజే మాట్లాడటం..ఈరోజు సాయంత్రం నాలుగు గంటల బస్సుకు వెళ్లిపోతామండీ..గత మూడు రోజుల నుంచీ ఇక్కడ చాలా ప్రశాంతంగా గడిపాము..స్వామివారి సన్నిధిలోనే ఎక్కువ సేపు ఉన్నాము..కనీసం మూడు నాలుగు సార్లు స్వామివారి సమాధిని దర్శించుకున్నాము..ఒక తీవ్రమైన సమస్య చుట్టుముట్టి మమ్మల్ని కలవరబెడుతున్నది..ఏ రకంగానూ పరిష్కారం కనబడలేదు..చివరిగా ఈ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి మనస్ఫూర్తిగా మొక్కుకుంటే..స్వాoతన లభిస్తుంది అని మనసుకు తోచింది..దానికీ కారణం ఉన్నది..గత ఆరు నెలలుగా స్వామివారి లీలలు సోషల్ మీడియా లో వస్తున్నాయి..ప్రతిరోజూ చదువుతున్నాను..అందువల్ల ఇక్కడికి వద్దామని అనిపించింది...ఈవిడ మా అమ్మగారు..నేను ఒక్కడినే కుమారుడిని..నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది..నాకూ ఒక అబ్బాయి వున్నాడు..ప్రస్తుతం చెన్నై లోనే ఉద్యోగం చేస్తున్నాడు..వాడికి ఆరు నెలల క్రితం వివాహం చేసాము..కొన్నాళ్ళు వాళ్లిద్దరూ బాగానే వున్నారు..ఏమైందో తెలీదు..పోయిన నెలలో మా కోడలు తన పుట్టింటికి వెళ్ళిపోయింది..మా వాడు తన తప్పేమీ లేదంటాడు..ఆ అమ్మాయి కూడా తాను సరిగ్గానే ఉన్నానంటుంది..నాకూ మా అమ్మకూ ఇంట్లో ఈ పరిస్థితి చూడలేక క్షోభగా ఉన్నది..వాడి సంసారం బాగు చేయడానికి మా వియ్యపు వాళ్ళతో కూడా మాట్లాడాను..వాళ్ళూ సుముఖం గానే వున్నారు..ఎటొచ్చీ పిల్లలిద్దరూ పంతాలకు పోతున్నారు..వాళ్ళ మనసు మార్చమని ఈ స్వామివారిని వేడుకోవడానికి నేను వద్దామని అనుకున్నాను..కానీ మా అమ్మకూడా పట్టుబట్టి ఇక్కడకు వచ్చింది..ఈ వయసులో నువ్వు ఎందుకు అని మా అమ్మతో అంటే..స్వామివారి సమాధి ని దర్శించుకుంటాను..నీతోబాటు నేనూ స్వామిని వేడుకుంటాను..ఈ ముసలి దాని ప్రార్ధన వింటారేమో స్వామివారు అని నాతో పాటు వచ్చిందండీ..మా విన్నపాలు స్వామివారు విని..మా అబ్బాయి సంసారం  చక్కబడితే..అందరమూ ఇక్కడికి వచ్చి..ఒక శని ఆదివారాల్లో అన్నదానం చేయిస్తానండీ.." అన్నాడు..


మరో పదిహేనురోజుల తరువాత..."ప్రసాద్ గారూ నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను..నా పేరు భానుమూర్తి..పోయిన నెలలో మా అమ్మగారితో కలిసి స్వామివారి మందిరం వద్ద మూడురోజులు వున్నాను..గుర్తుపట్టారా?..స్వామివారి దయవల్ల మా సమస్య తీరిపోయిందండీ..వచ్చేవారం నేనూ మా అమ్మా మా అబ్బాయి కోడలు..అందరం అక్కడికి వస్తున్నాము..ఒక రాత్రి నిద్ర చేస్తాము..ఆ శని ఆదివారాలు అన్నదానానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను..అంతా స్వామిదయ..నేను అక్కడికి వచ్చి అంతా వివరంగా మీతో చెప్పుకుంటాను.." అని ఫోన్ చేసాడు..


భానుమూర్తి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు..అతనికి సంతోషం కలుగచేసి..అతని కుమారుడి కాపురం చక్కదిద్ది..అతని చేత అలా చెప్పించింది స్వామివారే అని నాకు అర్థమైపోయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: