~~~ ఆలోచనాలోచనాలు ~~~ అవధాన మధురిమలు ~~~ శతావధాని శ్రీ పోకూరి కాశీపతి ~~~. సమస్యాపూరణములు ;--- సమస్య---"" గౌరికిఁ గేశవుండు పతిగావలె, శంకరుఁడన్న గావలెన్."" పూరణము---- "ఉ. వారణవైరి యేసతికి వాహనమౌ, సిరికిన్ విభుండెవం / డారయ వాణికిన్ జలరుహాసనుఁ డేమియు గావలెన్, ఫణిన్ / హారముగా నెవండు గొనెనా హలి కృష్ణునకేమి గావలెన్ / గౌరికిఁ, గేశవుండు, పతిగావలె, శంకరుఁ, డన్నగావలెన్." (క్రమాలంకారము) 2* "" కనులలో చన్నులమరె కాంతామణికిన్"" పూరణము ;----" కం. చెన్నులర బెస్త చేడియ / క్రన్నన వల వల్లెవాటుగాఁ గొని వేడ్కన్ / మున్నీటికి జనునెడ వల / కన్నులలో చన్నులమరె కాంతామణికిన్." 3* "" కొడుకున్ రమియించి యొక్క కొమరుని గాంచెన్."" పూరణము ;---- "కం. పడఁతులను నమ్మనగునే / కడువలపున తార యనెడు కామిని వేడ్కన్ / జడదారిఱేని ముద్దుల / కొడుకున్ రమియించి యొక్క కొమరుని గాంచెన్." దత్తపదులు;---- 1* " రోహిణి--ఉత్తర -- రేవతి -- హస్త అను పదములతో భాగవతార్థములో పద్యము. "" తే. గీ. రోహిణీ ధవసన్నిభ రూపుఁడైన / ఉత్తరావల్లభుని తన యూరువుపయి / రేవతీ విభుఁడిడుకొని ప్రేమమీర / హస్తమస్తకసంయోగ మాచరించె."" 2* " కడవ -- కుండ -- మూకుడు -- మంగలము అను పదములతో భారతార్థములో పద్యము. "" ఆ. వె. కడవచూలి యొద్ద గఱచిన విలువిద్దె / బలిమి జూపి తౌర కలఁగకుండ / ఎఱుక నైతి నేను నేదాయె మూకుఁడు / క్షమను మంగలము కిరీటి."" భీష్మ -- ద్రోణ -- కృప -- శల్య పదములతో రామాయణార్థముతో పద్యము. "" తే. గీ. మారుతీ భీష్మముగను లక్ష్మణుఁడు మూర్ఛ / పొందె నిక ద్రోణగిరి కేగి తొందరగను / కృప దలిర్పగ సంజీవి నెసఁగ దెచ్చి / యిడఁ గదే నీదు కౌశల్యమిపుడు జూతు."" మరికొన్ని సమస్యాపూరణములు ;--- " రాముఁడు పెండ్లాఁడె శైలరాజకుమారిన్." పూరణము;---- "" కం. భీముఁడు సమధిక సుగుణ / స్తోముడు మౌళిధృతబాలసోముఁడుక్ష్మాభృ / ద్ధాముఁడు పెండ్లాడె శైలరాజకుమారిన్."" 2* "దూలము చెలరేగి కొన్ని దున్నలఁ జంపెన్." సమస్యాపూరణము "" కం. శైల ప్రాంతంబున నొక / బాలుడు మహిషము మేపు పట్లన్ గనియున్ / వాలం బాడించుచు శా/ ర్దూలము చెలరేగి కొన్ని దున్నలఁ జంపెన్."" "" ఒకే ఒక పద్యంలో 30 అర్థాలుండే త్రింశదర్థ పద్య రత్నం"" ఆ. వె. భూరిజఠర గురుడు నీరజాంబకభూతి / మహితకరు డహీనమణికలాపు / డలఘుసద్గణేశు డగ్రగోపుడు మహా / మర్త్యసింహుడేలు మనల నెపుడు."" (డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యాసర్వస్వం సౌజన్యంతో) తేది 11--10--2023, బుధవారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి