*కృతజ్ఞత*
“కృతజ్ఞత” అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం.
మనం,
ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో,
ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో,
మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు.
మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు.
వీరికెప్పుడూ,
మనం కృతజ్ఞులమై ఉండాలి.
కృతజ్ఞత అనేది నాగరిక సంస్కారం.
వాల్మీకి, రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ” అన్నాడు.
సీతమ్మను అపహరించు కొనిపోతున్న రావణునితో పోరాడి ఆ సమాచారాన్ని రామునికి చెప్పి ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమసంస్కారం చేశాడు.
రావణ సంహారంలో తనకు తోడ్పడిన వానరుల కోసం,
ఈ వానరులు, ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధురఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు,
అక్కడి నదులలో నిరంతరం స్వాదుజలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వవలసిందిగా,
రాముడు ఇంద్రుణ్ణి కోరాడు.
ఇదీ ఆయన కృతజ్ఞతా లక్షణం.
మహాభారతం లో,
దగ్ధమైన లాక్షాగృహం లోంచి ప్రాణాలతో బయటపడి,
ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో,
తన కుమారులతో తల దాచుకుంటున్న కుంతి,
తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా,
అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో కుంతీదేవి తన ఒక కుమారుడను రాక్షసుడుకు ఆహారముగా పంపడం ద్వారా కృతజ్ఞత తెలియజేసింది.
ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం,
దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం,
వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం అంటుంది ధర్మం.
“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం”
అనే చందంగా కాకుండా,
మన ఉనికికి, ఉన్నతికి కారకులైన వారిపట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి.
ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి ,
విధివశాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే,
అతని యందు సకాలంలో,
అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే,
అది కృతఘ్నత ఔతుంది.
ఈ విషయాన్ని మహాభారతం అనుశాసనికపర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడు.
ఒక బోయవాడు వేటకు వెళ్ళి "ఘనతర విషదగ్ధ శరం" తో ఒక మృగాన్ని కొట్టబోయాడు.
అది గురి తప్పి ఒక చెట్టును తాకింది.
పువ్వులతో, కాయలతో పచ్చగా ఉన్న ఆ వృక్షం, విష శరాఘాతం వల్ల నిలువునా శుష్కమైపోయింది.
ఆ చెట్టే ఆశ్రయంగా,
దాని తొర్రలో నివాసముంటున్న ఒక మహాశుకం,
దానిని వదలలేక దాని మీదనే ఉండిపోయింది.
దీనిని గమనించిన ఇంద్రుడు మానుషరూపంలో దాని దగ్గరకు వెళ్ళి,
ఓ కీరమా! ఈ వృక్షం బెండువారి పోయింది.
ఫలసంపద గల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా,
ఇంకా దీనినే అంటిపెట్టుకున్నావెందుకు..?
అని అడిగాడు.
అపుడా శుకం,
ఈ చెట్టు తాను మధురఫలాలతో నిండిఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది.
ఈవేళ ఇది ఎండిపోయిందని, నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా! అనిమిషనాథా! అంది.
తాను మానుషరూపంలో వచ్చినా
"పురాకృత సంజనిత విశేషము" చేతనే,
ఈ మహాశుకం తనను ఇంద్రునిగా పోల్చుకోగలిగిందని ఆశ్చర్యపోయి,
నీ మాటలకు మెచ్చాను, నీకేం కావాలో కోరుకో,
అన్నాడు ఇంద్రుడు.
అపుడా మహాశుకం,
ఈ వృక్షానికి మేలు చెయ్యి, చాలు. అంది.
ఇంద్రుడు సంతోషించి,
అమృతసేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను, ఫలసంపదను కలుగజేశాడు.
ఈ కథ వల్ల,
ఉత్తములైన ఆశ్రితులు,
ఆశ్రయదాత క్షేమాన్ని కోరుకోవాలని,
కృతజ్ఞత ఉత్తమలక్షణమని తెలుస్తోంది.
సజ్జనులు,
ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని మరచిపోరు.
🙏 సర్వే జనా సుఖినోభవంతు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి