10, నవంబర్ 2023, శుక్రవారం

ధన్వంతరీ మహాత్యం

 ధన్వంతరీ మహాత్యం


ఆశ్వయుజ మాసం బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి. ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనస్సుకు ఏకాగ్రత ఉండదు. సకల సుఖాలు అనుభవించడానికి ఆరోగ్యమే ఉండాలి. అందుకే పెద్దలు దీవించేటప్పుడు ‘‘ఆయురారోగ్య ఐశ్వర్య, సంతాన, ఉద్యోగ ప్రాప్తిరస్తు’’ అంటారు. ఆయువు తర్వాత ఆరోగ్యానికే పెద్దలు ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తుంది. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. సకల రోగాల విముక్తికై మనమంతా ధన్వంతరిని పూజించాలి. సాక్షాత్తూ విష్ణుమూర్తియే ధన్వంతరిగా పాలకడలి నుండి అమృతభాండం పట్టుకుని అవతరించిన రోజు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు ఈ రోజున ధన్వంతరి పూజ తప్పక చేయాలి.

భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.


బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.

కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు")- ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.


విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం.


ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉంది.


భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.


"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.


వైద్యవిద్యకు అధిదేవుడు. సనాతన వైద్య శాస్తమ్రైన ఆయుర్వేదాన్ని వృత్తిగా గైకొన్నవారు ఈ రోజు ధన్వంతరీ పూజ చేస్తారు. యాగాలు చేస్తారు. వైద్యులు మాత్రమే ధన్వంతర యాగాన్ని, పూజలను చేస్తారని, మరెవ్వరూ చేయరు అనే భావన చాలామందిలో ఉంది. కాని ఈ ధన్వంతరి భవరోగాలను పోగొట్టే దైవం. అందుకే ధన్వంతరి వ్రతాన్ని ఆనవాయితీగా లేనివారు కూడా ఆనాడు శ్రీమన్నారాయుణిడిని, ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేస్తే సకల రోగాలు పటాపంచలవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తమవుతాయి. ఆయుర్వేదానికి ప్రథమ గురువు సుశ్రుతుడు. ధన్వంతరి నుండి మొదట ఆయుర్వేద శాస్త్రం ఉపదేశం పొందినాడు. ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ ఔషధ గుణాలు, ప్రతి చెట్టు ఔషధాల నిస్తుందని చెప్తుంది ఆయుర్వేదం. కేరళ రాష్ట్రంలో త్రిశూరవద్ద ధన్వంతరి ఆలయం ఉంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం.


పురాణ కథనం ప్రకారం సురాసురులు కలిసి పాలసముద్రాన్ని మధించారు. ధర్మాచరణతో మనుగడ సాగించేవారికి అపారమైన జ్ఞానాన్ని, అనంతమైన సంపదను అందించడానికి విశ్వపాలకుడు, జగద్రక్షుడైన ఆ నారాయణుడు నడుం కట్టాడు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని పరమశివుడు మింగేసి గరళకంఠుడు అయ్యాడు. ఆ తర్వాత కామధేనువు, ఐరావతం, ఉచె్తై్చశ్రవం పుట్టాయి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీ, కల్పవృక్షం ఉద్భవించింది. చిట్టచివరగా శ్రీమన్నారాయణుడు పరిపూర్ణ ప్రశాంత సాకార పరంజ్యోతి స్వరూపుడుగా ధన్వంతరి రూపం ధరించి చేతిలో అమృత కలశంతో వెలుపలికి వచ్చాడు. అమృత కలశంలోనే సమస్త శారీరక, మానసిక, అజ్ఞానరోగాలకు ఔషధాలు నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీమహావిష్ణువుకు ప్రతి రూపమైన ధన్వంతరి నాలుగు భుజాలుతో ఉద్భవించాడు. దేవదానవులు అతనికి నమస్కరించారు.


వైభవంగల ధన్వంతరి (శ్రీమహావిష్ణువు) పటాన్ని కుంకుమతో, పుష్పాలతో అలంకరించి, స్వామి సహస్రనామాన్ని పఠిస్తూ తెల్లపూవులు లేదా తులసీ దళాలతో అర్చించాలి. అనంతరం పాయసాన్ని నివేదించాలి. ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ ముందుగా స్వీకరించి అనంతరం ఖచ్చితంగా కనీసం అయిదుగురికైనా పంచాలి.


మేడి (ఔదాదుంబరం) చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాము. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది. కనుక శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజుదగ్గరనుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది.


ఈ స్తోత్రము ప్రతి రోజు చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు.

ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు వున్నఎడల ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఎడల ఆ రోగము ఉపశమించును.


ఓం నమో భగవతే

మహా సుదర్శన

వాసుదేవాయ ధన్వంతరయే

అమృత కలశ హస్తాయ

సర్వ భయ వినాశాయ

సర్వ రోగ నివారణాయ

త్రైలోక్య పతయే

త్రైలోక్య విధాత్ర్తే

శ్రీ మహా విష్ణు స్వరూప

శ్రీ ధన్వంత్రి స్వరూప

శ్రీ శ్రీ ఔషధ చక్ర

నారాయణ స్వాహా

ఓం నమో భగవతే

వాసుదేవాయ ధన్వంతరయే

అమృతకలశ హస్తాయ

సర్వ భయ వినాశాయ

త్రైలోక్య నాథాయ

శ్రీ మహా విష్ణవే నమః

కామెంట్‌లు లేవు: