శు భో ద యం🙏
పోతనగారి రూపచిత్రణ !
శా: తాటంకాచలనంబుతో భుజనటధ్ధమిల్ల బంధంబుతో ,
శాటీముక్త కుచంబుతో , నదృఢ చంచత్కాంచితో ,శీర లా
లాటేపముతో , మనోహర కరా లగ్నోత్తరీయంబుతోఁ ,
గోటీందు ప్రభతో , నురోజభర సంకోచద్వలగ్నంబుతోన్;
భాగవతము- దశమస్కంధము- గజేంద్ర మోక్షము- బమ్మెఱపోతన ;
బమ్మెఱ వారి రూపచిత్రణము బాపూ బొమ్మను బోలియుండును. భాగవతములోని ఆయాఘట్టములలో నతడు జూపిన ప్రతిభ నాన్యతో దర్శనీయము. ప్రకృత పద్యము గజేంద్ర మోక్షములోనిది. భక్తరక్షణా పరాయణుడగు నారాయణుడు.
గజేంద్రుని మొఱవిని వైకుంఠమునుండి సపరివారముగా బయలుదేరినాడు. ఆకాశమార్గమున పరుగు లెత్తు చున్నాడు. చీరచెంగు
నారాయణుని చేతజిక్కి లక్ష్మీదేవియు నతనివెనుక బరుగిడ సాగినది. అపుడామెయవస్థారూపమును పోతన బహురమ్యముగా
చిత్రించినాడు.
తాటంకా చలనంబుతో- తాటంకములంటే కర్ణాభరణాలు అవి అటునిటు ఊగుతున్నాయట.
భుజనటత్ ధమ్మిల్ల బంధంబుతో- ధమ్మిల్లము - అంటే జుట్టుముడి . అది ఊడిపోయి కేశసంపద భుజములపై జీరాడుచు
న్నదట.
శాటీ ముక్త కుచంబుతో- రెవిక ముడివిడింది వక్షోజ సంపద బయటకు కనిపిస్తోందట.
అదృఢ చంచత్కాంచితో-కాంచి - అంటే వడ్డాణం అదికాస్తా వదులై క్రిందికి జారుతున్నదట.
ఉశీర లలాటేపముతో- ఉశీరములు అంటే వట్టివేళ్ళు- చలువ గలగటంకోసం ఫాలభాగంలో
వట్టివేరుల రసం పట్టీలా వేసుకుంటారు. అదికరగిపోయి క్రిందికి జారుతున్నది.
మనోహర కరాలగ్నోత్తరీయంబుతో- మనోహరుడు ఆమెభర్తగారు విష్ణువు ఆయనచేతిలో ఈమె చీరచెంగు
చిక్కుబడినదట.
కోటీందు ప్రభతో- కోటి చంద్రులకాంతితో వెలిగిపోతున్న ముఖమండలముతో నున్నదట.
ఉరోజ భర సంకోచత్ వలగ్నంబుతోన్- పాలిండ్ల బరువుకు ఈమెనడుము నిలుచునా లేదా? యను ననుమానము
నకు తావిచ్చు చున్నదట.
మొత్తంమీద భావమిది; హరితో ఆకాశ వీధిలో పరుగిడు నప్పుడు లక్ష్మీదేవి యాకారమిటులున్నది.
కదలుచున్న కర్ణాభరణములు. కొప్పువిడి భుజములపై తారాడు కేశములు. ముడివిడివిడి రెవిక నుండి వెలికి
గనబడు పాలిండ్లు. క్రిందికి జారుచున్న వడ్డాణము. కరగి క్రిందకు జారు వట్టివేరుల గంధము. మగనిచేత చిక్కు
కొన్న చేలచెరగు. కోటిచంద్ర ప్రభా భాసమానమైన ముఖమండలము. పాలిండ్ల వ్రేగున వణకు నడుము గలిగి
చూపరులకు వింత గొల్పు చున్నదట!
ఇదీ పోతనగారి రూప చిత్రణ! మనో నేత్రాలతో దర్శించి ఆనందాన్ని పొందండి!
స్వస్తి!!🌷🙏🙏🙏🙏👌👌👌🙏🌷🌷🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి