18, జూన్ 2024, మంగళవారం

సంస్కృత మహాభాగవతం*



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది ఐదవ అధ్యాయము*


*ప్రద్యుమ్నుని జననము - శంబరాసురవధ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*55.1 (ప్రథమ శ్లోకము)*


*కామస్తు వాసుదేవాంశో దగ్ధః ప్రాగ్రుద్రమన్యునా|*


*దేహోపపత్తయే భూయస్తమేవ ప్రత్యపద్యత॥10517॥*


*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! వాసుదేవుని యొక్క అంశయైన మన్మథుడు పూర్వము శంకరుని క్రోధాగ్నికి భస్మీభూతుడయ్యెను. అతడు మఱల దేహమును పొందుటకై వాసుదేవుని ఆశ్రయించెను.


*55.2 (రెండవ శ్లోకము)*


*స ఏవ జాతో వైదర్భ్యాం కృష్ణవీర్యసముద్భవః|*


*ప్రద్యుమ్న ఇతి విఖ్యాతః సర్వతోఽనవమః పితుః॥10518॥*


అతడు శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవియందు జన్మించి, *ప్రద్యుమ్నుడు* అను పేరుతో ఖ్యాతి వహించెను. అతడు అన్నివిధములుగా (సౌందర్య, వీర్య, సౌశీల్యాది గుణముల యందు) తండ్రితో (శ్రీకృష్ణునితో) సమానుడుగా ఉండెను.


*55.3 (మూడవ శ్లోకము)*


*తం శంబరః కామరూపీ హృత్వా తోకమనిర్దశమ్|*


*స విదిత్వాఽఽత్మనః శత్రుం ప్రాస్యోదన్వత్యగాద్గృహమ్॥10519॥*


కామరూపియైన శంబరాసురుడు ఈ శిశువు (ప్రద్యుమ్నుడు) మున్ముందు తనకు శత్రువు కాగలడని నారదుని వలన వినెను. వెంటనే ఇతరులు గుర్తింపలేని విధముగా అతడు మాఱు రూపమును ధరించి, ఇంకను పది దినములు నిండని ఆ శిశువును అపహరించుకుపోయి సముద్రమునందు ఉంచి, తన గృహమునకు చేరెను.


*55.4 (నాలుగవ శ్లోకము)*


*తం నిర్జగార బలవాన్ మీనః సోఽప్యపరైః సహ|*


*వృతో జాలేన మహతా గృహీతో మత్స్యజీవిభిః॥10520॥*


*55.5 (ఐదవ శ్లోకము)*


*తం శంబరాయ కైవర్తా ఉపాజహ్రురుపాయనమ్|*


*సూదా మహానసం నీత్వావద్యన్ సుధితినాద్భుతమ్॥10521॥*


*55.6 (ఆరవ శ్లోకము)*


*దృష్ట్వా తదుదరే బాలం మాయావత్యై న్యవేదయన్|*


*నారదోఽకథయత్సర్వం తస్యాః శంకితచేతసః|*


*బాలస్య తత్త్వముత్పత్తిం మత్స్యోదరనివేశనమ్॥10522॥*


అనంతరము సముద్రమునందలి ఒక పెద్ద (మిక్కిలి బలిష్ఠమైన) చేప ఆ శిశువును మ్రింగివేసెను. పిదప కొంతకాలమునకు జాలరులు (బెస్తవారు) వేఱే చేపలతోపాటు ఆ మహామత్స్యమునుగూడ పెద్ద వలచేసి పట్టుకొనిరి. పిమ్మట ఆ జాలరులు అ మహామీనమును శంబరాసురునకు కానుకగా సమర్పించిరి. అంతట వంటవారు అ మహామీనమును వంటశాలకు తీసికొనివెళ్ళి, గండ్రగొడ్డలితో (ఒక అస్త్రముతో) దానిని ఖండించిరి. వంటవారు ఆ చేపకడుపులో ఒక బాలుని చూచి, అ విషయమును మాయావతికి నివేదించిరి. ఆ బాలుని జూచి ఆమె మిగుల ఆశ్చర్యపడెను. ఇంతలో నారదుడు అచటికి వచ్చి, ఆ బాలుడు మన్మథుడనియు, శ్రీకృష్ణుని పత్నియైన రుక్మిణియందు జన్మించినాడనియు, అతనిని శంబరాసురుడు సముద్రమునందుంచగా, ఒక మహామీనము ఆ శిశువును మ్రింగివేసెననియు ఆమెకు తెలిపెను.


*55.7 (ఏడవ శ్లోకము)*


*సా చ కామస్య వై పత్నీ రతిర్నామ యశస్వినీ|*


*పత్యుర్నిర్దగ్ధదేహస్య దేహోత్పత్తిం ప్రతీక్షతీ॥10523॥*


ఆ మాయావతి లోగడ మన్మథుని పత్నియైన రతీదేవియే. సాధ్వియైన ఆ యశస్విని, శంకరుని క్రోధాగ్నికి భస్మమైన తన పతియొక్క పునర్ఝన్మకై నిరీక్షించుచుండెను. 


*55.8 (ఎనిమిదవ శ్లోకము)*


*నిరూపితా శంబరేణ సా సూదౌదనసాధనే|*


*కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదార్భకే॥10524॥*


శంబరాసురునిచే వంటశాలలో వంటగత్తెగా నియమింపబడిన ఆ మాయావతి ఆ శిశువు మన్మథుడేయని తెలియుటతో ఆ బాలునిపై మిక్కుటమైన అనురాగమును చూపసాగెను.


*55.9 (తొమ్మిదవ శ్లోకము)*


*నాతిదీర్ఘేణ కాలేన స కార్ష్ణీ రూఢయౌవనః|*


*జనయామాస నారీణాం వీక్షంతీనాం చ విభ్రమమ్॥10525॥*


శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు కొలది కాలములోనే యౌవనవంతుడాయెను. అతని రూపలావణ్యముల వైభవమును వీక్షించిన తరుణీమణులందరికిని ఆయనపై మోహము ఏర్పడుచుండెను.


*55.10 (పదియవ శ్లోకము)*


*సా తం పతిం పద్మదలాయతేక్షణం ప్రలంబబాహుం నరలోకసుందరమ్|*


*సవ్రీడహాసోత్తభితభ్రువేక్షతీ ప్రీత్యోపతస్థే రతిరంగ సౌరతైః॥10526॥*


రాజా! ప్రద్యుమ్నుని నేత్రములు పద్మపత్రములవలె విశాలములై మనోహరముగా ఉండెను. ఆ ఆజానుబాహుని శుభాకారము జగన్మోహనము. ఆ పంచబాణుని (మన్మథుని) జూచి మాయావతి (రతీదేవి) సిగ్గుతో చిఱునవ్వులను చిందించుచు భావగర్భితముగా చూచుచు (హొయలొలికించుచు) అతనిని తనవైపు ఆకర్షించుటకు చేరువయగుచు సేవించుచుండెను.


*55.11 (పదకొండవ శ్లోకము)*


*తామాహ భగవాన్ కార్ష్ణిర్మాతస్తే మతిరన్యథా|*


*మాతృభావమతిక్రమ్య వర్తసే కామినీ యథా॥10527॥*


అంతట మహాత్ముడైన ప్రద్యుమ్నుడు మాయావతితో ఇట్లనెను. "అమ్మా! నేను నీ కుమారుడనుగదా! ఆ మాతృభావమును విస్మరించి, సిగ్గువిడచి, ఒక సామాన్యభామినివలె వలపులను క్రుమ్మరించుచు పలురీతుల విలాసచేష్టలను ప్రదర్శించు చున్నావు. ఇట్లు మోహకృత్యములకు పాల్పడుట ఎంతవఱకు సముచితము?"


*రతిరువాచ*


*55.12 (పండ్రెండవ శ్లోకము)*


*భవాన్ నారాయణసుతః శంబరేణ హృతో గృహాత్|0'*


*అహం తేఽధికృతా పత్నీ రతిః కామో భవాన్ ప్రభో॥10528॥*


*55.13 (పదమూడవ శ్లోకము)*


*ఏష త్వానిర్దశం సింధావక్షిపచ్ఛంబరోఽసురః|*


*మత్స్యోఽగ్రసీత్తదుదరాదిహ ప్రాప్తో భవాన్ ప్రభో॥10529॥*


*రతీదేవి (మాయావతి) ఇట్లనెను* "ప్రభూ! నీవు శ్రీమన్నారాయణుని (శ్రీకృష్ణుని) సుతుడవు. శంబరాసురుడు నిన్ను పురిటింటినుండి అపహరించుకొని వచ్చెను. నేను నీకు ప్రీతిపాత్రు రాలనైన ధర్మపత్నిని. నీవు వాస్తవముగా పూజ్యుడవైన మన్మథుడవు. ఈ శంబరాసురుడు పదిదినములైనను నిండని శిశువుగా ఉన్న నిన్ను దొంగిలించుకొనివచ్చి, సముద్రమునందు ఉంచెను. ఒక మహామీనము నిన్ను మ్రింగెను. దాని ఉదరములోనున్న నీవు ఇక్కడికి చేరితివి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: