9, ఫిబ్రవరి 2025, ఆదివారం

13-21-గీతా మకరందము

 13-21-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ప్రకృతి పురుషులను గురించి ఇంకను వివరముగ తెలుపుచున్నారు– 


కార్యకారణకర్తృత్వే* 

హేతుః ప్రకృతిరుచ్యతే

పురుషస్సుఖదుఃఖానాం 

భోక్తృత్వే హేతురుచ్యతే


తాత్పర్యము:- కార్యకారణములను గలుగజేయుటయందు ప్రకృతి హేతువనియు, సుఖదుఃఖముల ననుభవించుటయందు పురుషుడే హేతువనియు చెప్పబడుచున్నది.


వ్యాఖ్య:- కార్యమనగా శరీరము. కారణమనగా ఇంద్రియ మనోబుద్ధ్యహంకారములు, పంచభూతములు, శబ్లాదివిషయములు - వీనియన్నింటిని గలుగజేయునది (హేతువు) ప్రకృతి. ప్రకృతి జడమైనది. కావున సుఖదుఃఖముల ననుభవింపలేదు. పురుషుడు చిద్రూపుడు, అసంగుడు. కావున ఆతనికి సుఖదుఃఖభోక్తృత్వము యుండజాలదు. అయినను ప్రకృతియొక్క సంయోగముచే ఆయా సుఖదు:ఖాదులను పురుషుడు(ఆత్మ) అనుభవించునట్లు తోచుచున్నాడు. అంతియేకాని వాస్తవముగ నతనికి కర్తృత్వభోక్తృత్వాదులు ఏవియునులేవు.

~~~~

* కార్యకరణకర్తృత్వే - పాఠాంతరము

కామెంట్‌లు లేవు: