*తిరుమల సర్వస్వం -144*
*అలిపిరి మార్గం-15*
*శ్రీవారి మెట్లు*
మనం మొదట్లోనే చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం తిరుమలకు కాలి నడకన చేరుకోడానికి రెండే మార్గాలున్నాయి. రెండింటిలో, అలిపిరిమార్గం నందు గల విశేషాలన్నింటిని గత కొద్దిరోజులుగా చెప్పుకున్నాం. మరో నడకదారి *"శ్రీవారిమెట్లు'* గురించి ఈరోజు తెలుసుకుందాం
*మెట్లెన్ని?*
తిరుపతికి సమీపంలోని శ్రీనివాసమంగాపురానికి కొద్ది దూరం నుండి మొదలయ్యే ఈ మార్గం 2388 మెట్లతో, సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలిపిరిమార్గంతో పోలిస్తే ఈ మార్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి:
సుమారు 1100 మెట్లు తక్కువ. దూరం కూడా ఆరేడు కిలోమీటర్లు తక్కువే! కేవలం రెండు గంటల కన్నా తక్కువ సమయంలోనే కొండపైకి చేరుకోవచ్చు. కొండపైన, మెట్లమార్గం పూర్తయిన ప్రదేశం నుండి దేవాలయం అతి సమీపంలో ఉంటుంది. అలిపిరి మార్గంలో అయితే కొండపైకి చేరుకున్న తరువాత కూడా, మరో రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాక గానీ ఆలయాన్ని సమీపించలేము. ఈ మార్గం కూడా దారి పొడవునా పైకప్పుతో ఉండి ఎండావానల నుండి రక్షణ కల్పిస్తుంది. అలాగే, మార్గమధ్యంలో మంచినీటి సదుపాయం, శౌచాలయాలు, సామాను, పాదరక్షలు పైకి చేర్చే వెసులుబాటు, ప్రథమచికిత్సా కేంద్రం కూడా ఉన్నాయి. ప్రకృతిసోయగం, వృక్ష, జంతుజాతుల సందడి కూడా దాదాపుగా అలిపిరితో సమానంగానే ఉంటుంది. ఈ మార్గంలో మెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటాయని, నడివయసు వారు ఎక్కలేక ఇబ్బంది పడతారని కొందరు చెప్పే మాటలు ఊహాజనితాలే! అలిపిరిమార్గం గుండా నడవగలిగే వారందరూ, ఈ మెట్లను కూడా అంతే సులభంగా అధిరోహించగలరు.
ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తెరచి ఉండే ఈ మార్గంలో, రోజుకు పరిమితంగా – ప్రస్తుతం ఆరువేల మందిని మాత్రమే - అనుమతిస్తారు.
*అలిపిరే అనుకూలమా?*
అలిపిరి మార్గంతో పోల్చితే శ్రీవారిమెట్ల మార్గంలో ప్రతికూలాంశాలు కూడా కొన్ని లేకపోలేదు. ఈ మార్గం తిరుపతి పట్టణం నుంచి సుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవస్థానం వారి "ధర్మరథం" (ఉచిత బస్సులు), అతికొద్ది ప్రైవేటు బస్సులు, త్రిచక్రవాహనాలు తప్ప, తిరుపతి పట్టణం నుంచి రవాణాసౌకర్యం అంతంత మాత్రమే! చాలామంది స్వంత వాహనాల్లోనో లేదా ప్రైవేటు టాక్సీల్లోనో వెళతారు. అలిపిరి మార్గంలో ఉన్నట్లుగా శ్రీవారిమెట్ల మార్గంలో చెప్పుకోదగ్గ చారిత్రక, పౌరాణిక విశేషాలు లేవు. ఈమార్గంలో నడకదారి దాదాపుగా లేకపోవడం వల్ల, ప్రయాణం కొద్దిగా శ్రమతో కూడుకున్నట్లనిపిస్తుంది. మధ్యలో జింకలపార్కు, ఉద్యానవనం వంటి ఉల్లాసభరిత ప్రదేశాలు లేకపోవడం వల్ల, కొంతమంది స్వల్ప అసహనానికి కూడా లోనవుతారు. మార్గమధ్యలో ఘాట్ రోడ్డు ఏమాత్రం తగలదు. మార్గమధ్యంలో హోటళ్ళు, చిరుతిళ్ళు కూడా అంతగా లేవు కానీ, కనీస సౌకర్యాలకు కొదవలేదు. యాత్రికుల సందడి కూడా తక్కువగానే ఉంటుంది.
కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, తరచూ నడక ద్వారా తిరుమలకు చేరుకోవాలనుకునే భక్తులకు, సమయాభావం ఉన్నవారికి, శీఘ్రంగా చేరుకోగలిగే ఈ మార్గం ఎంతో అనువైనది. ఇద్దరు ముగ్గురితో కలిసి మెట్లెక్కతూ, గోవిందనామాలు బిగ్గరగా ఉచ్ఛరిస్తుంటే అలసట తెలియదు. మధ్యమధ్యలో కొద్దిగా ఆగుతూ, పచ్చని ప్రకృతిలో మమేకమవుతూ ప్రయాణం కొనసాగిస్తే; చూస్తూ చూస్తూ ఉండగానే కొండపైకి చేరుకుంటాం!
శ్రీనివాసమంగాపురం నందున్న కళ్యాణవేంకటేశ్వరుని ఆలయం నుంచి కొద్దిదూరం మైదాన మార్గంలో ప్రయాణించిన తరువాత ఈ మెట్లమార్గం మొదలవుతుంది.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి