*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము*
*283 వ రోజు*
*ద్రోణుడి విజృంభణ*
అది చూసి ద్రోణుడు " సారధీ ! చూసావా ! మనసేనలన్నీ పారిపోతున్నాయి. ధర్మజుని ముఖం గర్వంతో వెలిగి పోతుంది. నేను పాండవుల మీద విజృంభించకపోతే సేనలను ఆపలేము. ధర్మజుడు, భీముడు, ద్రుపదుడు, విరాటుడు వారి కుమారులు, నా ముందు నిలువలేరు అర్జునునికి విద్య నేర్పింది నేనే నీ చాతుర్యము చూపించి రధము నడుపుము నా చేతుల దురద తీరేవరకు ఒళ్ళు దాచుకొనక యుద్ధం చేస్తాను " అన్నాడు. ఆ మాటలకు పొంగిపోయిన ద్రోణుని సారథి చిత్రవిచిత్ర రీతుల రథం నడుపుతుండగా ద్రోణుడు పాండవసేనలో ప్రవేశించి చీల్చి చెండాడసాగాడు. పొంగుతున్న సముద్రంలా విజృంభించిన ద్రోణుని ధర్మనందనుని చక్రరక్షకుడు సుకుమారుడు చెలియలి కట్టలా అడ్డుకున్నారు. ద్రోణుడు ఒకే బాణంతో సుకుమారుని తల తెగనరికాడు. అది చూసిన పాండవ యోధులంతా ద్రోణుని చుట్టుముట్టారు. ద్రోణుడు అయిదు బాణములతో నకులుని, అయిదు బాణములతో సహదేవుని తిమ్మిది బాణములతో విరాటుని, ఏడు బాణములతో సాత్యకిని, మూడేసి బాణములతో ద్రౌపదీ సుతులను ఇరవై బాణములతో విశంతిని, పన్నెండు బాణాలతో ధర్మజును శిఖండిని కట్టడి చేసాడు. ఎదురు వచ్చిన రథికులు ఎవ్వరూ ప్రాణాలతో పోలేదు. యుగంధరుడు ధర్మరాజు ద్రోణులకు మధ్యకు వచ్చి ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు కోపించి ఒకే బాణంతో యుగంధరుని చంపాడు. అది చూసి కేకయరాజులు, ద్రుపదుడు, సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు, మొదలైన యోధులు ద్రోణునిపై తలపడ్డారు. సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు ద్రోణునిపై అస్త్రశస్త్రములు ప్రయోగించాడు. వారిపై కన్నెర్ర చేసిన ద్రోణుడు వారిపై రెండు వాడి అయిన అమ్ములు వేసి వారి శిరస్సులు ఖండించాడు. ఇది చూసిన మిగిలిన రథికులు పక్కకు తొలిగారు. ద్రోణుడు సింహనాదం చేసాడు. ఈ అలజడి చూసిన పాండవ సేనలో కలకలం రేగింది వారు " ద్రోణుడు ధర్మరాజును పట్టుకుని సుయోధనుని సముఖముకు తీసుకు వెళుతున్నాడు " అని ఆక్రోశించారు. అది కార్చిచ్చులా వ్యాపించి పాండవసేనలు కంపించాయి. ఇది విని అర్జునుడు ద్రోణునుని ముందుకు రథం పోనిచ్చాడు. అది చూసిన కౌరవ సేనలు ద్రోణునికి అండగా నిలిచాయి. అర్జునుడు తన గాండీవం సంధించి కౌరవ సేనలపై శరవర్షం కురిపించాడు. కౌరవ సేనలు తలలు తెగిపడుతున్నాయి రక్తం ఏరులై ప్రవహిస్తుంది. మొండెములు నేలకూలుతున్నాయి. అర్జునిని ధాటికి కౌరవ సేనలు తట్టుకోలేక పారిపోసాగాయి. ఇంతలో సూర్యుడు అస్తమించగానే ఆ రోజు యుద్ధం ముగించారు.
*ద్రోణుని సారధ్యంలో రెండవ రోజు యుద్ధం*
ద్రోణ సారథ్యంలో రెండవ రోజు యుద్ధానికి కౌరవ సైన్యం సిద్ధం అయింది. ద్రోణుడు సుయోధనునితో " సుయోధనా ! నిన్నటి రోజు నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోనలేక పోయాను. అర్జునుడు ధర్మజుని ఒక్కక్షణం కూడా విడువ లేదు. ఆఖరిక్షణంలో కూడా మన సేనలను తనుమాడాడు. అర్జునుడిని దూరంగా తీసుకు వెళ్ళకుండా ధర్మజుని పట్టుట సాధ్యం కాదు. అర్జునుడు లేకున్న ధర్మజుడు నన్ను చూసి పారిపోతాడు. అప్పుడు నేను వెన్నంటి ధర్మజుని పట్టగలను " అన్నాడు. ఆ మాటలు విన్న సుశర్మ " ఆ మాటలువిన్న సుశర్మ " సుయోధనా ! అర్జునుడు ఎప్పుడూ మమ్ము అవమానిస్తుంటాడు. మాకు అతడి మీద కోపంగా ఉంది. ఈ రోజు అర్జునుడైనా ఉండాలి లేక సుశర్మ అయినా ఉండాలి. అర్జునుడికి మేము ఏవిధంగా తీసిపోము " అని ప్రగల్భములు పలికి సుశర్మ తన తమ్ములను తీసుకుని అర్జునుడితో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. సుశుశర్మతో అతడి తమ్ములు సత్యవర్ముడు, సత్యవ్రతుడు, సత్యకర్ముడు చేరగా కేరళ, మాళవ, శిలీంద్ర, మగధాధీసులు చేరగా పదిహేను మంది యోధులను తీసుకుని జయజయ ధ్వానములు చేస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. అది చూసి సుయోధనుడు ఆనందభరితుడయ్యాడు. వారు స్నానాధికములు చేసి అగ్ని రగిల్చి అగ్ని సాక్షిగా " మేమంతా ఈ రోజు రణరంగమున అర్జునుడిని చంపుతాము. లేని ఎడల మేము గోవధ, స్త్రీ వధ, బ్రాహ్మణవధ, బ్రాహ్మణ ధనం దోచుకొనుట, ఇతరుల ధనం అపహరించుట, గురువుకు అపకారం చేయుట, శరణు వేడిన వారిని రక్షించక పోవడం, అబద్ధం పలుకుట, మద్యపానం చేయుట, దేహీ అన్నవారికి లేదనుట, గృహదహనం చేయుట, ఇతరుల భార్యలతో వ్యభిచరించుట మొదలైన పాపములు చేసిన వారు ఏలోకాలకు వెళతారో ఆ లోకాలు మాకు సంప్రాప్తిస్తాయి మేము అర్జునుడి చేతిలో మరణించిన మాకు మాకు వీరస్వర్గం లభించగలదు " అని ప్రమాణాలు చేసి రణరంగ ప్రవాశం చేసారు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి