""ఎవరు గొప్ప,
సర్వేజనా సుఖినోభవంతు ""
*🙏సూర్యుడు చెప్పిన మంచి మాటలు (కథ)...!!*
🌸 ఒకసారి వరుణ దేవుడికి, వాయు దేవుడికి తగాదా వచ్చింది. ‘నేను గొప్ప’ అంటే ‘నేను గొప్ప’ అనుకున్నారు. ఇద్దరిలో ఎవరైతే ప్రజల్ని బాగా ఏడిపిస్తారో వాళ్ళే గొప్ప అని రెండోవారు అంగీకరించాలని నిర్ణయించుకున్నారు.
🌿తరువాత రోజు ఉదయం నుండి వాతావరణంలో మార్పు వచ్చింది. జల్లులుగా మొదలైన వాన ధారలుగా మారి, కుంభవృష్టి కురిసింది. ఏకంగా వారం రోజులు వానలే వానలు.
భూమ్మీద పండిన పంటలన్నీ నీట మునిగాయి.
🌸ఏడాది కష్టం గంగపాలయ్యేసరికి రైతులు ఏడ్చారు. పేదల గుడిసెలన్నీ తడిసి ముద్దయ్యాయి. గోడలు కూలిపోయి మట్టిపెళ్లల క్రింద నలిగి కొందరు చనిపోయారు. పశువులు, జంతువులు వరదల్లో కొట్టుకుపోయాయి.
🌿పక్షులు చలికి వణికిపోయి బిక్కుబిక్కుమన్నాయి. నదులు, వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులు నిండుకుండను తలపించాయి. రహదారులు నీట మునగడంతో జనజీవనం స్తంభించింది.
🌸 సూర్యుడి వెలుగు కనబడి వారమయ్యేసరికి అల్లాడిపోయారు ప్రజలు. వానలను ఆపమని వాన దేవుడిని ఎన్నో విధాలుగా వేడుకున్నారు ప్రజలు. ప్రజల మొర ఆలకించిన వానదేవుడు నెమ్మదించాడు.
🌿వెంటనే వాయు దేవుడిని కలుసుకుని “నా ప్రతాపం చూసావు కదా. ఇప్పటికైనా నేను గొప్ప అని అంగీకరిస్తావా?” అనడిగాడు.
🌸వాయు దేవుడు “నువ్వు వారం రోజులు కురిస్తే ప్రజలు నిన్ను వేడుకున్నారు. నా ప్రతాపం చూసాక మాట్లాడు“ అని జవాబిచ్చాడు. సరే అన్నాడు వరుణ దేవుడు.
🌿 మరుక్షణం నుండి భూమి మీద విపరీతమైన సుడిగాలి వీచింది. దుమ్ము ధూళి గాలిలో కలసిపోయి ఏమీ కనబడలేదు. పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆరుబయటున్న వస్తువులు గాలికి ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడ్డాయి. మనుషుల్ని కూడా అంతెత్తుకు ఈడ్చుకుపోయి క్రింద పడేయడంతో చాలామంది చనిపోయారు. చెట్లెన్నో విరిగి పడ్డాయి. జంతువులు కూడా బెదురుతూ పరుగులు తీశాయి.
🌸దొడ్లో కట్టిన పశువులు కూడా మెడకు కట్టిన తాళ్లను తెంపుకుని ఎటో వెళ్లిపోయాయి . లోకమంతా అల్లకల్లోలంగా మారిపోయింది.
జనం ఎంతగానో భయపడ్డారు. వాయు దేవుడిని శాంతించమని ప్రార్ధించారు. వాయు దేవుడు సంతోషించి ఉపశమించాడు.
🌿తరువాత వరుణ దేవుడిని కలుసుకుని “ ఒక్కరోజు నేను చూపించిన ప్రతాపానికే దిక్కు తోచక అల్లాడిపోయారు భూలోకవాసులు. ఇంకా ఎక్కువ రోజులైతే ఏం జరిగేదో వూహించు” అన్నాడు గర్వంగా.
🌸“నిజమే! నువ్వే గొప్ప” అని వాన దేవుడు అంటుండగా “కాదు” అని వినిపించింది. ఆకాశ మార్గంలో మాట్లాడుతున్న తమకి అడ్డు చెబుతున్నది ఎవరా అని చూసారు ఇద్దరూ. ఎదురుగా సూర్యభగవానుడు కనిపించాడు.
🌿 “అంటే నా గొప్పతనం అంగీకరించడం లేదా?” అని వాయు దేవుడు అడిగాడు. సూర్యుడు “ఇందులో గొప్పతనం చెప్పడానికి ఏముంది? నేను విపరీతమైన తేజస్సుతో రోజంతా ప్రకాశిస్తే నాకూ భయపడతారు మానవులు.
🌸మనమున్నది ప్రజలకు మేలు చేయడానికి. ఆ విషయం మరచిపోయి మీరు చేసిందేమిటి? ప్రజల ఉసురు పోసుకున్నారు. ఒకరేమో వారం రోజలు వరుసగా కుంభవృష్టి కురిపిస్తే ,
🌿 మరొకరు తీవ్రగాలులతో భయపెట్టారు. ఇది మీకు తగునా? “ అనడిగాడు సూర్యుడు.
“మా ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవడానికి అలా చేసాము“ అన్నాడు వరుణ దేవుడు.
🌸“మీలో ఎవరు గొప్పో తెలచడానికి ఇంద్రుడినో, ఋషులనో అడగాలి కానీ ప్రజలను బాధపెట్టవచ్చా?” అని అడిగాడు సూర్యుడు.
“అది తప్పెలా అవుతుంది?” ఎదురు ప్రశ్నించారు ఇద్దరూ.
🌿“ముమ్మాటికీ తప్పే. మీ చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు చేసారు. వారికి దిక్కుతోచక మిమ్మల్ని ప్రార్ధించారు. అలా కాకుండా మన మీద భక్తితో , గౌరవంతో పూజించేలా పరిపాలించాలి” అన్నాడు సూర్యుడు.
🌸“అదెలాగో వివరించు సూర్యదేవా?”అని వరుణ దేవుడు, వాయు దేవుడు అడగడంతో సూర్యుడు ఇలా చెప్పాడు.
🌿“వర్షాకాలంలో సమృద్ధిగా వానలను కురిపించాలి వరుణ దేవుడు. నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా అవసరమైన చోటల్లా వానలు కురవాలి. అప్పుడే ప్రజలకు దేవుడిలా కనబడతాడు వరుణ దేవుడుని . మనస్ఫూర్తిగా మొక్కుతారు మానవులు.
🌸 ఇక వాయు దేవుడి విషయానికి వస్తే ఎండలు పెరిగి వేడి ఎక్కువైనప్పుడు చల్లని గాలిని పంచాలి. అవసరమైనప్పుడు తన స్పర్శతో ప్రజలను ఉక్కపోత నుండి రక్షించాలి. వేసవి కాలంలో ప్రజలకు దగ్గరగా మెలుగుతూ, శీతాకాలంలో అంటీముట్టనట్టు, వర్షాకాలంలో అవసరమైన చోటుకి మేఘాలను మోసుకువెళుతూ ప్రజల మెప్పు పొందాలి.
🌿అప్పుడే వాయు దేవుడిని భక్తితో కొలుస్తారు. మీరిద్దరూ భూమాతని ఆదర్శంగా తీసుకుని మీ విధులు నిర్వర్తించండి. ఎవరు గొప్పో తేల్చుకోవడానికి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దు” అన్నాడు.
🌸“మీ మాటలతో ఏకీభవిస్తున్నాము. భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము” అని చెప్పి వెళ్లిపోయారు వరుణ దేవుడు, వాయు దేవుడు...
🕉️🕉️🕉️
మానవ స్వభావం విచిత్రంగా ఉంటుంది. ఇతరులతో పోల్చుకుంటూ అసూయతో మనిషి కుంగిపోతాడు. దురాశతో లోభిగా మారి వ్యధ చెందుతాడు. అహంకారంతో ఆత్మీయులతో విరోధం పెంచుకుని చివరి దశలో ఒంటరివాడై విలపిస్తాడు. అసత్యాలతో విజయం సాధిద్దామనుకుని భంగపడతాడు. సంతోషమే సగం బలమని గ్రహించలేక అపార్థాలతో సమస్యలు సృష్టించుకుంటాడు. సంకుచిత మనస్తత్వంతో తప్పులు చేస్తూ కష్టాలు కొనితెచ్చుకుని తన గొయ్యి తానే తవ్వుకుంటాడు. పూర్వకాలంలో ధర్మాన్ని కాపాడేందుకు, సత్యవ్రతాన్ని ఆచరించేందుకు సమస్యల వలయంలో చిక్కుకున్న ధర్మాత్ములు భగవంతుడి కృపతో కష్టాల కడలిని దాటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. నేటికాలంలో అందుకు భిన్నంగా అధర్మవర్తనులైనవారు సమస్యల వలయంలో చిక్కుకుని కాలగర్భంలో కలిసిపోతున్నారు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి