17, మార్చి 2025, సోమవారం

తిరుమల సర్వస్వం -180*

 *తిరుమల సర్వస్వం -180*

మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం-5*




2 దాంతో పాటుగా భక్తుల రద్దీ కూడా పెరగడంతో మహంతులు తమ విశేషాధికారాన్ని, ఆలయవర్గాలలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి; ప్రముఖులకు శీఘ్రంగా దర్శనం కలిగించటం మొదలుపెట్టారు. రాను రానూ ఆలయం యొక్క సాధన సంపత్తులన్నింటికీ తాము తిరుగులేని పెత్తందార్లమన్న మితిమీరిన విశ్వాసం మహంతులలో నెలకొంది. నిధుల దుర్వినియోగం ఆరోపణలు కూడా వచ్చాయి. ఆలయనిధులను తన సొంతానికి మళ్లించుకున్న ఆరోపణపై అప్పటి న్యాయస్థానం మహంతుకు జరిమానా కూడా విధించింది. అంతే గాకుండా, వారు ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ జరిపే సమయంలో; పాత ధ్వజస్తంభం యొక్క పాదపీఠం క్రింద ఉన్న నిధులను అపహరించారన్న అపవాదును మూటగట్టుకున్నారు. వీరి హయాంలోనే, మహంతుల నివాసం ఇప్పుడు ప్రధానాలయానికి ఆగ్నేయమూలలో ఉన్న, హంగు ఆర్భాటాలతో యాదవ రాజులు కట్టించిన మహంతుమఠానికి మారింది. అప్పటివరకు వైరాగ్యజీవితాన్ని గడిపిన మహంతులకు భిన్నంగా తరువాతి వారు మహంతుమఠంలో సర్వసౌఖ్యాలు అనుభవించారు. సర్వసంగపరిత్యాగులకు సౌధాలెందుకన్న ప్రశ్న భక్తుల మదిలో మెదిలింది. అప్పటి మహంతుల అతిశయం ఎంతగా వెర్రితలలు వేసిందంటే తిరుమల యాత్రికులు ముందుగా మహంతును దర్శించుకుని, కట్నకానుకలు సమర్పించుకున్న తర్వాతనే స్వామివారిని దర్శించుకునే సాంప్రదాయానికి నాంది పలికారు. అప్పటివరకు ఏ విధమైన తరతమ భేదాలకు తావులేని ఆలయంలో జమీందారులకు, ధనికులకు, రాచకుటుంబీకులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. పరపతి గలవారికి త్వరితగతిన దర్శనాలు జరిగేవి. ఇవన్నీ ఒక ఎత్తయితే, అన్యమతస్తుల విషయంలో మహంతు అవలంబించిన వైఖరి మరో ఎత్తు. అప్పటికి దాదాపు వంద సంవత్సరాల క్రితమే, ఆంగ్లేయులు, తిరుమల క్షేత్రం మరియు మీదకి హైందవేతరుల రాకపోకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. దానికి భిన్నంగా ప్రస్తుత మహంతులు, యూరోపియన్ అధికారుల ప్రాపకం సంపాదించుకోవడం కోసం వారికి కొండపై ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు కల్పించారు. సాంప్రదాయానికి విరుద్ధంగా దేవాలయ నిధులను, భూముల పూచీకత్తుపై కొంతమంది జమీందార్లకు రుణంగా ఇచ్చారు. అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు గానీ వాటన్నింటిలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అపవాదును మూటగట్టుకున్నారు. కొన్ని మహమ్మదీయ సంస్థలకు విరాళాలిచ్చారు.


 తరువాతి కాలంలో అధికారంలోకి వచ్చినా రామ్ కిషోర్ దాస్ జీ పై కూడా నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావడంతో, న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా మరణించారు. ఈ విధంగా మహంతుల నిర్వాకంపై వివిధ న్యాయస్థానాల్లో లెక్కలేనన్ని కేసులు నమోదు కావడంతో; 1898వ సంవత్సరంలో ఉత్తర ఆర్కాట్ జిల్లా ప్రధాన న్యాయస్థానం అప్పటి మహంతును కక్షి దారులైన జియ్యంగార్లు, శ్రీవైష్ణవులు, తిరుమలలో వున్న ఇతర మఠాల వారిని పిలిచి; సయోధ్య కుదిర్చారు. దాని ప్రకారం, న్యాయస్థానం ఆలయనిధుల వినియోగాన్ని పర్యవేక్షించడానికి ఐదుగురు సభ్యులతో ఒక ధర్మాసనాన్ని నియమించింది. దానిపై మహంతులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తరువాతి కాలంలో ఆలయనిర్వహణపై మహంతులకున్న తిరుగులేని అధికారాలకు పరిమితులు విధిస్తూ న్యాయస్థానాలు అనేక తీర్పులిచ్చాయి. వాటన్నింటిపై మహంతులు ఎప్పటికప్పుడు పైకోర్టుల్లో పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. చివరకు లండన్లోని అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ. మహంతులు తప్ప ఆలయంతో సంబంధం ఉన్న మిగిలిన వారందరూ ఒక వర్గంగా ఏర్పడటంవల్ల, మహంతులపై అధికార దుర్వినియోగం ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతుండడం వల్ల తరచూ వారికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతూ ఉండడమే గాకుండా, మహంతు వ్యవస్థ పట్ల తొలినాళ్ళలో భక్తులకున్న గౌరవాభిమానాలు క్రమంగా అంతరించి పోయాయి. ఆ విధంగా, 1900వ సంవత్సరం నాటికి మహంతుల ప్రభావం గణనీయంగా తగ్గింది.




*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: