*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*
*319 వ రోజు*
*అర్జునుడు కౌరవ వీరులను ఎదుర్కొనుట*
అర్జునుడు కౌరవ సేనలను తనుమాడ సాగాడు. రథములు విరుగుతున్నాయి. అశ్వముములు నేల కూలుతున్నాయి. ఏనుగుల కుంభస్థలములు పగులుతున్నాయి. సైనికుల తలలు బంతుల్లా తెగి పడుతున్నాయి. రణరంగం అంతా బీభత్సంగా తయారైంది. కౌరవ సైన్యం భయంతో పారి పోయింది. సింధురాజుకు రక్షణగా ఉన్న యోధులు సింహనాదం చేసారు వారి ఉత్సాహం చూసి అర్జునుడు రథమును సుయోధనుడి వైపు పోనిచ్చాడు. సుయోధనుడికి రక్షణగా ఉన్న ఎనిమిది మంది యోధులు అర్జునుడిని ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నారు. అర్జునుడు దేవదత్తమును పూరిస్తూ వారిని దాటి సైంధవుని వైపు పోతున్నాడు. అది గమనించి మిగిలిన వారు అర్జునుడి మీద శరవృష్టి కురిపించారు. అశ్వత్థామ రెచ్చి పోయి డెబ్బై మూడు బాణాలతో కృష్ణుని మూడు బాణాలతో అర్జునుడిని కొట్టాడు. అర్జునుడి కేతనమును విరిచాడు. అర్జునుడు కోపించి నూట ఆరు బాణములు అశ్వత్థామ మీద ప్రయోగించి పది బాణములతో కర్ణుడిని కొట్టాడు. వృషసేనుడిపై మూడు బాణములు ప్రయోగించి ఒకే ఒక బాణంతో శల్యుని విల్లు విరిచాడు. శల్యుడు వేరొక విల్లు తీసుకుని అర్జునుడి మీద ఏడు బాణములు ప్రయోగించాడు. కర్ణుడు మూడు బాణములు భూరిశ్రవసుడు వృషసేనుడు తలా అయిదు బాణములు కృపాచార్యుడు పది బాణములు అశ్వత్థామ అరవై బాణములు అర్జునుడి మీద ప్రయోగించాడు. అనేక దివ్యాస్త్రాలు అర్జునుడి మీద ప్రయోగించారు. సైంధవుడు వారి చాటున నిలబడి డెబ్బై మూడు బాణములు అర్జునుడిపై వేసాడు. అది చూసిన అర్జునుడికి ఏడుపు నవ్వు ఏక కాలంలో కలిగాయి. అర్జునుడు కర్ణుడి మీద పన్నెండు బాణములు అతడి కుమారుని మీద మూడు బాణములు వేసాడు. ఒకే ఒక బాణంతో శల్యుని విల్లు తుంచి తొమ్మిది బాణములతో శల్యుని కొట్టాడు. మూడు బాణములతో భూరిశ్రవసుని ఎనిమిది బాణములతో అశ్వత్థామను ఇరవై రెండు బాణములతో కృపాచార్యుని కొట్టాడు. మరొక ఇరవై రెండు బాణాలతో అశ్వత్థామ శరీరం అంతా గుచ్చాడు. సైంధవుడు కనిపించినప్పుడల్లా అతడి మీద బాణప్రయోగం చేస్తున్నాడు. సైంధవుడు అర్జునుడికి కనుపించ కుండా వారి వెనుక దాక్కుంటున్నాడు. కౌరవ సైన్యం ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుని ఒకటిగా చేరి అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు వారిని తన బాణములకు ఎరగా వేసాడు.
*కౌరవ పాండవ సమరం*
ధర్మరాజు ద్రోణుడు ఉన్న రణరంగమున పరిస్థితి భయంకరంగా ఉంది. యుద్ధం ఘోరంగా సాగుతుంది. బృహత్క్షతృడిని క్షేమధూర్తి, ధృష్టకేతుడిని వీర ధ్వనుడు, నకులుడిని కర్ణుడు, సహదేవుడిని దుర్ముఖుడు, సాత్యకిని వ్యాఘ్రదత్తుడు ఎదుర్కొని యుద్ధం చేస్తున్నాడు. శల్యుడు మాత్రం అటు శకట వ్యూహం నుండి పద్మవ్యూహం వరకు అటూ ఇటూ తిరుగుతునే మధ్యలో ఉపపాండవులతో యుద్ధం చేస్తున్నాడు. అలంబసుడు భీముని ఎదుర్కొన్నాడు. ద్రోణాచార్యుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు ద్రోణాచార్యుని శరీరంపై తొంభై బాణములు గుచ్చాడు. ద్రోణుడు ధర్మరాజు గుండెలకు గురిపెట్టి ఇరవై అయిదు బాణాలు వేసాడు. ద్రోణుడు తన బాణములతో ధర్మరాజు రథమును ముంచెత్తాడు. ధర్మరాజు ద్రోణుడు వేసిన బాణములు నిర్వీర్యం చేసాడు. ద్రోణుడు కోపించి ధర్మరాజు విల్లును త్రుంచాడు. అది చూసిన వారంతా ఈ రోజు ద్రోణుని చేతిలో ధర్మరాజు బంధీ అయ్యాడు అనుకున్నారు. ధర్మరాజు వేరొక విల్లు అందుకుని ద్రోణుడు వేసిన బాణాలన్నింటిని త్రుంచి వెంటనే ద్రోణుని మీద శక్తి ఆయుధాన్ని వేసాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి