6, నవంబర్ 2020, శుక్రవారం

దేహ చింతన

 దేహ చింతన 

గత కండికలో దేహ భావన గూర్చి తెలుసుకున్నాం. ఇప్పుడు దేహ చింతన గూర్చి తెలుసుకుందాం. రెండు ఒకే అర్ధం ఇచ్చే పదాలుకదా రెంటికి తేడా ఏమిటి అని అనుమానం రావచ్చు ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం మనకు కనపడుతుంది. దేహ భావన అంటే నేను దేహన్నా లేక ఆత్మనా అనే భావన.  ఇక దేహ చింతన అంటే నేను దేహాన్ని అనే దృఢమైన ఆలోచన అని అర్ధం చేసుకుందాము. 

ఈ ప్రపంచంలో కోటికి ఒక్కరికో లేక పది కోట్లకు ఒక్కరికో మాత్రమే దేహ చింతన లేకుండా ఉంటుందేమో లేక ఇంకా తక్కువేనేమో చెప్పటం చాల కష్టం. మన ముందు రోజు చాలా మంది సత్పురుషులు అనే వారు కనపడుతున్నారు. చక్కగా ఖరీదైన కాషాయ వస్త్రాలు ధరించి, ఖరీదైన కారులల్లో పయనిస్తూ, ఖరీదైన కానుకలు ఇచ్చే శిష్య గణాలకి ఉపన్యాసాలు ధారాళంగా చేస్తున్న వారు అదే నండి స్వామీజీలు, బాబాలు మనకు కనపడుతున్నారు. చాలామంది వారి మాటలకు ప్రలోభితులై వారి శిష్య్లలుగా, భక్తులుగా మారిపోతున్నారు. అంతే కాదు సాక్షాత్తు ఆ ఆదిదేముడి అవతారంగా చెప్పుకునే వారు లేకపోలేదు. కొందరు దత్తాత్రేయస్వామి అవతారంగా ఇంకొందరు ఇంకో దేముడి అవతారంగా చెప్పుకోవటం, ప్రచారం చేసుకోవటం, వాళ్లకు గుడులు కట్టి పూజించటం. అది ఆలా ఎందుకు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారితో కఠినంగా ప్రవర్తించి వారి దేముడే అసలైన దేముడని ఆయనకు అపచారం చేస్తే కళ్ళు పోతాయని ఇలా రోజు రకరకాల మనుషులు మనకు తారస పడుతున్నారు. ఇలాంటి వారి వాళ్ళే మన మహోన్నతమైన హిందూ ధర్మానికి గ్లాని కలుగుతున్నదని మనకు కంటికి కట్టినట్లుగా కనపడుతున్నది. కొందరు ఇలా వితండ వాదం చేస్తారు. మనకు ముక్కోటి దేవతలు వున్నారుకదా ఇంకో దేముడు ఉంటే ఏమైనది.  ఇంకా కొంతమంది వారి వాదనకు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన భగవత్గీతను ఉదాహరణగా తీసుకొని ఇలా అంటారు. నీవు ఎవరిని ఏ ఎ రూపాలతో పూజించిన నేను నీకు ఆ ఆ రూపాలతో కరుణిస్తాను అన్నారు స్వామి మరి మమ్మలిని తప్పు పడతారు ఎందుకు అంటారు.  ప్రస్తుతం మన సమాజం ఇటువంటి వితండ వాదులతో కలుషితం అయి వున్నది. వారికి ఒక నమస్కారం చేయటం తప్ప మనం ఏమి చేయలేని స్థితి. 

ఇప్పటికి హిమాలయ పర్వతాలలో కొందరు మహర్షులు అనేక వందల సంవత్సరాల్నుండి తపస్సు చేసుకుంటున్నవారు వున్నారని మనకు అప్పుడప్పుడు కొన్ని వార్తలు అందుతున్నాయి. మనకు ఒక సందేహం కలుగుతుంది. ప్రస్తుతం మానవుని ఆయుర్దాయం కేవలం వంద సంవత్సరాలు కదా అటువంటప్పుడు ఆ మహానుభావులు వందల కొద్దీ సంవత్సరాలనుండి ఎలా తప్పస్సు చేసుకొంటున్నారు. ఇక జ్యోతిష్య పండితులు ఇలా అంటారు అన్ని దశలు, అంతర దశలు కుడితే 120 సంవత్సరాలు మాత్రమే అంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తే మనిషి అత్యధికంగా అంటే 120 సంవత్సరాలే మాత్రమే జీవిస్తాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో అంతకన్నా ఎక్కువ జీవించలేడు అని వారి శాస్త్ర వాదం. శాస్త్రపరంగా ఈ వాదనను మనం అంగీకరించక తప్పదు. 

ఈ సృష్టిలో మనకు తెలియని అనేక అద్భుతాలు వున్నాయి. కొన్ని మనకు తెలుస్తున్నాయి కొన్ని తెలియటం లేదు. అంటే మనకు తెలిసిన జ్ఞానం కన్నా తెలియని జ్ఞానం చాలా ఎక్కువ అన్నది వాస్తవం. అల్పాయుష్కుడు ఆయన మార్కండేయుడు చిరంజీవి కాలేదా. అలానే ఈశ్వరానుగ్రహం ఉంటే బ్రహ్మ రాతకుడా మారుతుంది ఇది తథ్యం. 

దేహచింతన చాలా చిత్రమైనది. అందరు ఈ మాయలోనే వుంటారు కానీ దీనిని అంగీకరించారు. మన సమాజంలో తిరుగుతున్న స్వామీజీలు ఒక ఆత్మ విమర్శ చేసుకుంటే వారికి ఈ దేహ చింతననుండి బయట పడగలరు అప్పుడు వారు మోక్ష మార్గంలో పయనించి మనలాంటి సామాన్యులకు కూడా గురుత్వం వహించ గలరు. కానీ వారు ఆలా చేస్తున్నారా అన్నది సందేహం. వారు చెప్పేది నేను ఎవరిని అడగటం లేదు భక్తులు వారంతట వారే ఇస్తున్నారు. నిజానికి దేహ చింతన లేని వారు బంగారాన్ని, మట్టిని ఒకే విధంగా చూస్తారు. 

సంసార జీవనం గడుపుతూ దేహచింతన లేని ఒక మహాను భావుడి గూర్చి తెలుసుకుందాం. 

ఎంతో వెనుకకు వెళ్లనవసరం లేదు మనకు 1767 లో తంజావూరులో జన్మించిన త్యాగ రాజా స్వామి చెరిత్ర చుస్తే అయన పూర్తిగా దేహ చింతన లేని మహానుభావుడుగా మనం తెలుసుకోవచ్చు. 

త్యాగ రాజా స్వామి గాన విశేషాలు తెలుసుకున్న తంజావూరు రాజుగారు అనేక కానుకలు పంపి త్యాగ రాజా స్వామిని తన ఆస్థానానికి రా వలసిందిగా అభ్యర్థిస్తాడు. కానీ పరమ భక్తుడైన మన త్యాగ రాజా స్వామి వాటన్నిటిని మర్యాదగా తిరస్కరించి తన గానామృతం కేవలం శ్రీ రాముడికే అంటారు. 

అంతటి మహాను భావుడి గానం వినాలనే ఉత్సుకతవం ఆ రాజుకి కలుగుతుంది. అప్పుడు మంత్రిని పిలిచి నేను ఎట్లాగైనా త్యాగ రాజా స్వామి గానం వినాలి అని తన కోరిక తెలుపుతారు. మంత్రి రాజా మారువేషంలో మనం వెళ్లి త్యాగ రాజా స్వామి తిరిపెమెత్తుకొనే వేళ అయన చెంతన ఉండి విందామని సలహా ఇస్తారు. ఒకరోజు రాజు,మంత్రి మారువేశాలల్లో అలానే త్యాగ రాజా స్వామి వెనుకాల ఉండి ఆయన గానామృతం  వింటారు. ఆ గానానికి ముగ్ధుడై రాజు తన మేడలో వున్నా నవరత్నాల హారాన్ని త్యాగ రాజా స్వామి కి తెలియకుండా అయన బిక్షమెత్తుకొనే పాత్రలో వేస్తారు. 

ఆ రోజు భోజనానికి బియ్యాన్ని చాటలో పోసి రాళ్లు ఏరుతున్న భార్య కమలగారికి రక రకాల రంగులలో వున్నా రత్నాలు బియాంలో కనబడ్డాయి.  స్వామి బియ్యంలో రంగురంగుల రాళ్ళూ వున్నాయి అంటుంది. దానికి త్యాగ రాజా స్వామి వాటిని చూడకుండానే రాళ్ళూ వస్తే ఏరీ పోయాలి కానీ నన్ను అడగటం దేనికని  అన్సారు ఆమె వాటన్నికి ఏరి పారేసి అన్నం వండిందని కధ . 

దేహ చింతన లేక పోవటం అంటే ఇది. ఇప్పుడు మనమందరము ఆలోచించవలసిన విషయం. మనం దేహ చింతనను ఎంతవరకు వదులుకున్నాము. 

దేహ చింతన వదలని వారికి పరమేశ్వర చింతన ప్రాప్తించదు. ఏదో ఒకటి మాత్రమే దొరుకుతుంది. ఏది కావాలో తేల్చుకోవటం మన నిర్ణయం. 

ఓం 

తత్సత్. సర్వ్యే జన సుఖినోభవంతు. 

భార్గవ శర్మ. 



కామెంట్‌లు లేవు: