25, మే 2023, గురువారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 70*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 70*


ఖణెల్ ... ఖణెల్... మంటూ కత్తులు ఒకదానిని మరొకటి మార్కొంటుంటే వాటి రాపిడికి, నిప్పురవ్వలు రాలాయి. 


అలెగ్జాండరూ, చంద్రుడూ తెగబడి వీరావేశంతో రంకెలు వేస్తూ పోరాడుతుంటే ఎవరు ఎక్కువో, ఎవరు తక్కువో వారి ద్వంద యుద్ధాన్ని చూస్తున్న వారికి అర్థం కాలేదు. పోరు అంతకంతకీ తీవ్రమవుతోంది. ఆవేశకావేషాలు మిన్నంటుతున్నాయి. ఖడ్గచాలన శబ్దాలతో ఆ మందిరం దద్దరిల్లిపోతుంది. 


అంతలో మెరుపు మెరిసినట్లు అలెగ్జాండర్ విసిరిన కత్తి వ్రేటుని చప్పున తలవెనక్కి వంచి తప్పించుకున్న చంద్రుడు, రెప్పపాటులో అడుగుముందుకు వేస్తూ తన కరవాలాన్ని చక్రవర్తి మీదకు విసిరాడు. అత్యంత లాఘవంగా విసిరిన ఆ వ్రేటుకి చక్రవర్తి చేతనున్న ఖడ్గం పై కెగిరి, పై నుంచి జర్రున కిందికి జారుతూ చక్రవర్తి నడుముకి వ్రేలాడుతున్న వొరలోకి దూరిపోయింది. 


క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు యవన చక్రవర్తి. మరుక్షణమే తేరుకుని చప్పట్లు చరుస్తూ... 

"శభాష్ ! వీరుడివని నిరూపించుకున్నావ్. ఈ యవన సార్వభౌముని మనస్సు గెలుచుకున్నావు. నీకు తప్పక సహాయం చేస్తాం" అన్నాడు అభినందిస్తూ. 


చంద్రుడి వదనం వికసించింది. చాణక్యుని ముఖం ప్రకాశవంతమైంది. పర్వతకుని ముఖం ముడుచుకుపోయింది. 


"కానీ..." అన్నాడు చక్రవర్తి చిరునవ్వు నవ్వుతూ. 


చంద్రుడు అనుమానంగా చూస్తూ "కానీ... ?" రెట్టించాడు. 


అలెగ్జాండర్ మందహాసం చేసి "మగధని సంపాదించుకోవడానికి నీకు సహకరిస్తాం. అనంతరం మగధ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి. అది మా మొదటి నిబంధన" చెప్పాడు. 


చంద్రుడు అసహనంగా చూస్తూ "రెండోదేమిటి?" రెట్టించాడు. 


చక్రవర్తి సూటిగా చాణక్యుని వైపు చూస్తూ "చాణక్యుని అర్థశాస్త్రంతో పాటు మాకు అప్పగించాలి" చెప్పాడు. 


"ఏమిటీ.... చాణక్యుల వారిని మీకు అప్పగింతపెట్టాలా ? మగధని మీకు సామంతరాజ్యం చెయ్యాలా ? ఏం అడుగుతున్నావ్ నువ్వు ? ఎవరనుకుంటున్నావు మమ్మల్ని ? నువ్వేం చేసినా, నువ్వేం చెప్పినా తలవంచి, నీ అడుగులకు మడుగులోత్తే తొత్తులమనుకుంటున్నావా ? నీకు సామంతులుగా ఉండాల్సి వస్తే నీ సహాయం నాకు అవసరం లేదు. అవసరమైతే మగధరాజ్య కాంక్షనైనా వదులుకుంటానే గానీ చాణక్యుల వారిని నీకు అప్పగించే ప్రసక్తే లేదు. నీ యవన బలగం లేకుండా, నీ మద్దతు లేకుండా నా బలంతోనే మగధను నా హస్తగతం చేసుకుంటాను" అని హుంకరించాడు చంద్రుడు ఆవేశంతో. 


"ఆ అవకాశం నీకు ఇస్తే గదా..." అంటూ కనుసైగ చేసాడు అలెగ్జాండర్. రెప్పపాటులో యవన సైనికులు చాణక్య చంద్రగుప్తులను చుట్టుముట్టి బంధించారు. 


అలెగ్జాండర్ కోపంగా పర్వతకుని వైపు చూస్తూ... 

"ఈ దుర్హంకారులలిద్దర్నీ చెరసాలలో బంధించండి. వీళ్ళని ఏం చెయ్యాలో రేపు నిర్ణయిస్తాం" అని ఆదేశించాడు. 


చాణక్య చంద్రగుప్తులను కారాగరంలో బంధించారు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: