25, మే 2023, గురువారం

సామ గానం - ఖగోళ జ్ఞానం

 సామ గానం - ఖగోళ జ్ఞానం


శ్రీరంగం ఆలయ గోపుర నిర్మాణ సహాయానికి ముందుగా ఇష్టం వ్యక్తం చేసిన మంత్రాలయ మఠం వారు ఇప్పుడు కాస్త వెనకడుగు వేస్తున్నారని, కాబట్టి ఈ పనికి వేరొకరిని వినియోగించాలి కాబట్టి మరెవరిని అయినా సూచించాలని జీయర్ గారు శ్రీ దేశికన్ ని పరమాచార్య స్వామి వద్దకు పంపించారు. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. 


మహాస్వామివారు నేలపైన గ్రామఫోను బొమ్మ వేసి, పక్కనున్నవారిని సినీప్రముఖుల పేర్లను చెప్పమని సంజ్ఞలతో ఆదేశించారు. అందరి పేర్లూ ఒక్కొక్కటిగా చెబుతున్నారు కాని స్వామివారు ఇంకా ఇంకా అని అడుగుతున్నారు. హఠాత్తుగా ఎవరో నాపేరు చెప్పగానే, నేనే ఆ వ్యక్తి అని స్వామివారు చెప్పారు. 


నాకు పరిచయస్తుడైన తిరుచ్చి నివాసి చంద్రమౌళి నాకు ఈ విషయం తెలిపాడు. ఈయన మంచి మృదంగ విద్వాంసుడు. ఒకరోజు సాయింత్రం ఏడు గంటలప్పుడు ప్రాసాద్ స్టూడియో నన్ను కలుసుకొని జరిగిన సంగతి మొత్తం చెప్పాడు. 


“శ్రీరంగం ఆలయ గోపురం కట్టించమని నిన్ను ఆదేశించి, నిన్ను స్వామివారు అనుగ్రహించారు” అని చెప్పాడు. ”ఓహ్! పరమాచార్య స్వామివారు ఆదేశించారా? అయితే తప్పక చెయ్యాలి. నేను ఖచ్చితంగా చేస్తాను” అని చంద్రమౌళికి చెప్పాను. 


కాని దాని గురించి ఆలోచిస్తే నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నేను అప్పటిదాకా స్వామివారిని కలవలేదు. ఈ విషయం గురించి నాకు స్వామివారి వద్ద నుండి కాని, జీయర్ గారి వద్దనుండి కాని ప్రత్యక్షంగా సమాచారం రాలేదు. 


“మొత్తం గోపురం ఖర్చు 22 లక్షలు అవుతుంది. కాని స్వామివారు మిమ్మల్ని కేవలం ఆరవ అంతస్తు గురించి మత్రమే మీకు అప్పగించారు. అది దాదాపు 8 లక్షల రూపాయలు అవుతుంది” అని చెప్పాడు. “నేను మొత్తం గోపుర నిర్మాణానికే నా సమ్మతిని తెలిపాను. అంత ధైర్యం నాకు ఎలా కలిగిందో తెలుసా? అది కేవలం మహాస్వామివారి పైన ఉన్న భక్తి మాత్రమే. ఆ బరువు స్వామివారే చూసుకుంటారు. వారు ఏదైనా విషయం చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో నా పాత్ర, ప్రమేయము ఏమి ఉండదు” అని చెప్పాను.


ఆ తరువాత నాకు మహాస్వామి వారిని చూడాలనే కోరిక చాలా బలపడింది. నేను ఈ విషయాన్ని ప్రముఖ చిత్రకారుడు శిల్పికి చెప్పగా నేను కూడా వస్తాను అన్నాడు. మేమిద్దరమూ చంద్రమౌళితో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళాము. అప్పుడు మహాస్వామివారు సతారాలో మకాం చేస్తున్నారు. 


సతారాకి దగ్గర్లోని మహాగావ్ లో మహాస్వామి వారిని కలిసాను. అది సదూర ప్రాంతం. స్వామివారు గోశాలలో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యింది. మేము వచ్చినట్టుగా అక్కడి కైంకర్యానికి చెప్పాము. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. మమ్మల్ని స్వామివారి వద్దకు తీసుకునివెళ్ళారు. స్వామివారు సంజ్ఞలతోనే మేమెవరమని అడిగారు. కైంకర్యం మమ్మల్ని ఒక్కొక్కరిగా పరిచయం చేశాడు. స్వామివారు చెయ్యెత్తి మమ్మల్ని ఆశీర్వదించారు. తరువాత వారు కొద్దిగా తల ఇటు తిప్పడంతో వారి కళ్ళను నేను చూడగలిగాను. ఎంతటి దేదీప్యమానమైన ప్రకాశవంతమైన కళ్ళు అవి. నా జీవితంలో అప్పటి దాకా అంతటి అమోఘమైన కళ్ళను నేను చూదలెదు. అవి నాకు ఏమో చేశాయి. ఆ కళ్ళను చూడడంతోనే నేను స్థాణువై నిలబడిపోయాను. రెండు చేతులు పైకెత్తి నమస్కరిస్తూ, నా ప్రమేయం లేకనే కళ్ళ నీరు కార్చాను. కొద్దిసేపు ఒక మామిడి పండును చేతిలో ఉంచుకొని దాన్ని ప్రసాదంగా నాకు ఇచ్చారు. ఎప్పటికి లభించని పెద్ద అనుగ్రహం అది.


స్వామివారు ఆ సాయింత్రం దగ్గర్లోని గ్రామానికి వెళ్తున్నారని కొందరు మాకు చెప్పారు. మేము తిరిగి వెళ్ళిపోవాలని చాలా బాధపడ్డాము. కాని మాకోసమే అన్నట్టుగా స్వామివారు ఎక్కడికి వెళ్ళడం లేదని తెలుసుకొని చాలా సంతోషించాము. ఆరోజు రాత్రి అందరమూ ఆకాశం క్రింద పచ్చని తోటలో కూర్చున్నాము. నాకు తెలిసి ఆ రోజు పొర్ణమి అనుకుంటా. ఆకాశంలో ఒక్క మబ్బు కూడా లేదు. మొత్తం నక్షత్రాలతో నిండి ఎంతో అహ్లాదాన్ని కలిగిస్తోంది. నన్ను అడగకుండానే స్వామివారి శిష్యులు నేను పాడాలనుకుంటున్నానని స్వామివారితో చెప్పారు. సరే అన్నారు. చెంబై వైద్యనాథ భాగవతార్ గారి ‘సామ గాన వినోదిని’ పాడటం మొదలుపెట్టాను. 


‘సామ గాన’ అని మొదలుపెట్టగానే మహాస్వామివారు వెంటనే నా వైపు తిరిగి వారి దివ్య కరుణా కటాక్ష వీక్షణాలను నాపై ప్రసరింపజేశారు. అలా పాడుతూనే కళ్ళ నీరు పెట్టడం మొదలుపెట్టాను. నన్ను నేను నియంత్రించుకోలేక పాట పూర్తి చెయ్యడానికి చాలా కష్టపడ్డాను. తరువాత స్వామివారు మౌనవ్రతం వీడి నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. కేవలం నన్ను కరుణించడానికే స్వామివారు నాతో మాట్లాడుతున్నారు. తరువాత స్వామివారు ఆకాశంలో 27 నక్షత్రాలను చూపించి, వాటి గురించిన విశేషాలను, స్థానాలను విపులంగా వివరించారు. అలాగే 12 రాశులను కూడా చూపించారు. “సర్వేశ్వరా! ఎంతటి అనుగ్రహం”. 


దాంతో మహాగావ్ లో మా దర్శనం పూర్తయ్యింది. వారిని తరచుగా దర్శించుకోవాలనే కోరిక చాలా బలపడింది. వారి భౌతిక దర్శనం ఒక ‘తత్వయోగి’ని చూసినట్టు. వారి స్వరూపం అవ్యాజ కరుణ, ప్రేమ, భక్తి స్వరూపం. వారి తీక్షణమైన వీక్షణాలను ఆ యోగిక శక్తిని నేను ఎన్నటికి మరచిపోలేను. అవి దక్కడం నా అదృష్టం. అది కేవలం వారి అనుగ్రహం.


--- ‘మ్యూసిక్ మాస్ట్రో’ ఇళయరాజా గారి ఇంటర్వ్యు నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: