25, మే 2023, గురువారం

పరిపూర్ణుడు హనుమ*

 👌 *ఏష ధర్మః సనాతనః*👌


     *25. పరిపూర్ణుడు హనుమ*


✍️ పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు.

🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹


🙏 *పరిపూర్ణుడు హనుమ* 🌹


💫 మన దేశంలో ఆంజనేయోపాసనకు ప్రాధాన్యం ఎక్కువ. అత్యధిక దేవాలయాలు ఆ స్వామికే ఉన్నాయి. 


💫 శ్రీమద్రామాయణం మంత్రగర్భిత కావ్యం. అందులో పరమేశ్వర చైతన్యం విష్ణు, రుద్ర, శక్తి రూపాలతో నిక్షిప్తమై ఉంది. విష్ణుతేజం శ్రీరామునిగా, శక్తిస్వరూపం సీతమ్మగా, రుద్రమూర్తి హనుమంతునిగా వ్యక్తమయ్యారు. ముగ్గురూ సమప్రాధాన్యం కలవారిగా రామాయణంలో మన్ననలందారు.


💫 శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజం అంజనీదేవిలో ప్రవేశించింది. ఆమె కారణ జన్మురాలైన అప్సరః కాంత. ఆ తల్లి తనయునిగా జన్మించాడు హనుమ. అతడు బాల్యంలోనే అలవోకగా సూర్యమండలం వరకు ఎగిరిన బలశాలి. వేదమూర్తి అయిన సూర్యుడికి శిష్యుడు. సూర్యుని నుంచి ఆయనకు వరంగా లభించిన దివ్యతేజశ్శక్తే సువర్చస్సు. ఈ శక్తినే స్త్రీ దేవతగా – ఉపాసనా సంప్రదాయంలో 'సువర్చల' అన్నారు. *వైశాఖ బహుళదశమి శనివారం హనుమ జననం.*


💫 రామాయణంలో తనకోసం కాక, పరులకోసం తన ప్రతాపాన్ని ప్రదర్శించినవాడు ఆంజనేయుడే. రావణుని తాను సంహరించ గలిగినప్పటికీ, అది శ్రీరాముని అవతార కార్యమని, అందుకు తగిన సహకారం అందించాడు. “రాముని బాణంలా లంకలోకి వెళతాను" అనడంలోనే తన వినయాన్నీ, భక్తిభావాన్నీ ప్రకటించాడు.


💫 జ్ఞానం, వినయం, యోగం, బలం, ధైర్యం, చాతుర్యం, వాగ్వైభవం... ఇన్నింటి కలబోత హనుమ.


💫 అభయం, ఆనందం... ఈ రెండూ హనుమ అందించే వరాలు. భయ పడిన సుగ్రీవుడికి అభయమిచ్చి శ్రీరామమైత్రిని అందించాడు. శోకంలో ఉన్న సీతకు శ్రీరామ సందేశాన్ని వినిపించి ప్రాణాలను నిలబెట్టి, సంతోష పరచాడు. సీత జాడను తెలిపి, లక్ష్మణుని ప్రాణాలు నిలిపి శ్రీరాముని ఆనందపరచాడు. ఇలా అభయాంజనేయునిగా, ఆనందాంజనేయునిగా భాసించాడు.


💫 నరసింహుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వరాహ స్వామి, ఆంజనేయుడు - ఈ అయిదూ ఒకే తత్త్వం తాలూకు విభిన్న వ్యక్తీకరణలు. ఇది మంత్రపరమైన ఔచితీదర్శనం. 


💫 మృగ వదనం, నరశరీరం కలిగిన దేవతలు *'క్షిప్రప్రసాద’*(వెంటనే అనుగ్రహించే లక్షణం కలవారు. రాక్షస సంహారంలో ప్రతాపాన్ని చూపిన నారసింహ లక్షణం, జ్ఞానస్వరూపునిగా హయగ్రీవ స్వభావం, గరుత్మంతునిగా మహావేగం, వరాహస్వామిగా సంసార సాగరం నుంచి, శోకపంకం నుంచి ఉద్ధరించే తత్త్వం, తనకు సహజమైన వానరాకారం - ఇవన్నీ కలబోసిన లీలలను రామాయణంలో ప్రదర్శించాడు హనుమ. అందుకే *పంచముఖాంజనేయుని* గా దర్శనమిచ్చాడు. 


అంతేకాక-


💫 గజవదనుడైన గణపతితత్త్వం, హనుమ తత్త్వమూ కూడా ఒకటేనని విజ్ఞుల విశదీకరణ. *“అవ్యక్త అప్రమేయ పరతత్త్వమితడు"* అని వాల్మీకి సుందరకాండలో పేర్కొన్నాడు.


💫 *'సుతరాం ఆద్రియతే ఇతి సుందరః'* అందరి ఆదరణా పొందే గుణమహిమ రూపాలు కలవాడు హనుమయే సుందరుడు. మంత్రశాస్త్రంలో హనుమ నామం సుందరుడు. అందుకే హనుమ కథ *'సుందరకాండ’* గా రామాయణ రత్నమాలలో కొలికిపూసలా ప్రకాశిస్తున్నవాడు.


🙏 *ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, ఆరాధించదగిన దైవత్వం - కలబోసిన పరమేశ్వర స్వరూపమే శ్రీ ఆంజనేయ స్వామి.* 🙏



*సేకరణ:*

🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹

కామెంట్‌లు లేవు: