25, మే 2023, గురువారం

రహస్య గ్రంథాలు

 ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు -  వాటి గురించి విశేషాలు .


     మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు .  నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను . 


 *  బృహద్యంత్ర సర్వస్వము  - 


         ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు 


                   ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.


                 ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు.  


          అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.


 *  ఆగతత్వలహరీ  - 


         ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .


 *  అవతత్వ ప్రకరణం  - 


          ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు . 


 *  అండ కౌస్తభం  - 


           ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర 

జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.


 *  అంశు బోధిని - 


           ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు  , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.


 *  ఆకాశ తంత్రం  - 


            ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.


 *  ఋక్ హృదయ తంత్రం  - 


            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.


 *   ఔషధీ కల్పం  - 


            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.


 *  కరక ప్రకరణము  - 


             ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.


 *   కర్మాబ్దిసారము  - 


             ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.


 *   కౌముదీ  - 


               ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.


 *   ఖేట సర్వస్వము  - 


              ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.


 *  ధాతు సర్వస్వము  - 


             ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి

లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు . 


 *  ధూమ ప్రకరణం  - 


           ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.


 *  నామార్థ కల్పం  - 


           ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.


 *  ప్రపంచ లహరీ  - 


             ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.


 *  బ్రహ్మాండ సారం  - 


               ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.


 *  మేఘోత్పత్తి ప్రకరణం  - 


              ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.


 *  లోక సంగ్రహము  - 


              ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.


 *  లోహ తంత్రము  - 


              ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.


 *  వాయుతత్వ ప్రకరణము  - 


              ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద  ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు. 


 *  వైశ్వనర తంత్రము - 


              ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.


 *  శక్తి తంత్రము  - 


            ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ  మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా . 


 *  శుద్ద విద్యాకల్పం  - 


         ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.


 *  సమరాంగణ సూత్రధారము  - 


         ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.


           పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము ,  యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక  అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ,  గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ  మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన  కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో  1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని                 "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది.  ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి. 


   మరింత విలువైన సమాచారం , సులభ ఆయుర్వేద చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     

కామెంట్‌లు లేవు: