సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ గుణాలు -
కొర్రలు యొక్క ఉపయోగాలు -
* కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .
* శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.
* కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.
* శరీరం నందు వేడిని కలిగించును.
* జ్వరమును, కఫమును హరించును .
* జీర్ణశక్తిని పెంచును.
* రక్తమును వృద్దిచేయును.
* నడుముకు మంచి శక్తిని ఇచ్చును.
* అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.
* గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.
* కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .
* కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .
* కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .
* కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.
* కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.
* కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.
సామలు యొక్క ఉపయోగాలు -
* సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును.
* చలవ , వాతమును చేయును .
* మలమును బంధించును .
* శరీరము నందు కఫమును , పైత్యమును హరించును .
* ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.
* గుండెల్లో మంటకు మంచి ఔషదం.
* కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం .
రాగుల యొక్క ఉపయోగాలు -
* వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు .
* రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును.
* శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును .
* మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును .
* రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును.
* రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును.
* కఫాన్ని పెంచును. చలవ చేయును .
* శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.
* ఆకలిదప్పికలను అణుచును.
* విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును.
* రాగుల్లో పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .
* రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును .
* మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని
కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.
* రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును .
* రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.
జొన్నలు -
* రుచికి వెగటుగా ఉండును.
* శరీరం నందు కఫమును, పైత్యాన్ని హరించును .
* వీర్యవృద్ధి బలాన్ని ఇచ్చును.
* జొన్నలలో ఎరుపు, తెలుపు, పసుపు మూడురంగుల జాతులు ఉండును.
* జొన్నలలోని మాంసకృత్తుల్లో మనకు అవసరమయిన అన్ని ఎమైనో ఆసిడ్స్ తగినంతగా లభ్యం అవుతాయి. వీటిలో విటమిన్ B కాంప్లెక్స్ మరియు సెల్యూలోజులు సమృద్ధిగా లభిస్తాయి.
* జొన్నపిండితో తయారుచేసిన రొట్టెలను ప్రతిరోజు స్వీకరిస్తుంటే మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేయును . మలబద్ధకాన్ని తగ్గించి వేయును . జీర్ణశక్తి తక్కువ ఉన్నవారు తినరాదు.
* జొన్నలలో అధికంగా ఉన్న "ఫైటేట్స్ " అనే పదార్థం వలన మిగతా ఆహారపదార్ధాలలోని క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు శరీరానికి పట్టుట కష్టం అగును.కాబట్టి జొన్నలను పరిశుభ్రముగా శుద్ధిచేసి పిండిమరలో వేసి మెత్తగా పిండిచేసి ఆహారంలో ఉపయోగిస్తుంటే ఫైటేట్స్ అడ్డురావు. దీనివల్ల ఐరెన్ , క్యాల్షియం ఒంటికి పట్టును .
* మంచిగా శుద్ది చేసిన జొన్నపిండిని పాలతో కాని మజ్జిగలో కాని కలిపి తాగుతుంటే మొలలు , అజీర్తి , B1 , B2 లోపముతో బాధపడువారికి మంచి ఔషధంగా పనిచేయును .
* 100 గ్రాములు జొన్నలలో పిండి పదార్దాలు 73 గ్రా, మాంసకృత్తులు 10.5 గ్రా , కొవ్వులు 1.7 గ్రా , ఫాస్ఫరస్ 286 మి.గ్రా , కాల్షియం 20 మి.గ్రా , ఐరన్ 6 మి.గ్రా , సోడియం 7 మి.గ్రా , పొటాషియం 130 మి.గ్రా , విటమిన్స్ A - ౧౪0 , I.U ,B -345 మి.గ్రా , B2 - 365 మి.గ్రా , నియాసిన్ 1.7 మి.గ్రా ఉన్నాయి. ఇవి జీర్ణం అగుటకు 3 గంటలు పట్టును .
* జొన్నలను కడుపులో గుల్మాలు ఉన్నవారు , మొలలు సమస్య ఉన్నవారు తీసుకోరాదు . జొన్నలు అధికంగా తీసుకోవడం వలన నేత్రసంబంధ సమస్యలు వస్తాయి.
* జొన్నలకు విరుగుళ్లు పాలు , నెయ్యి, మిఠాయి
వాము .
సజ్జలు -
* 100 గ్రాముల సజ్జలలో కార్బోహైడ్రేట్స్ 66 గ్రా , ప్రొటీన్స్ 10 గ్రా, ఫాట్స్ 4.5 గ్రా , కాల్షియం 50 గ్రా , ఫాస్ఫరస్ 350 మి.గ్రా , ఐరన్ 10 మి.గ్రా , సోడియం 11 మి.గ్రా , పొటాషియం 30 మి.గ్రా , విటమిన్స్ A -2205 I .U , B1 - 329 మి.గ్రా , నియాసిన్ 3.2 మి.గ్రా ఆక్సాలిక్ ఆసిడ్ 14 .5 మి.గ్రా ఉన్నాయి .
* 100 గ్రా సజ్జలు జీర్ణం అగుటకు మూడున్నర గంటలు పడుతుంది.
* సజ్జలలో మాంసకృత్తులుకు అవసరం అయిన ఆర్డీనైన్ మొదలుకొని హెలైన్ వంటి ఎమైనో ఆసిడ్స్ తగినంతగా ఉన్నాయి. సజ్జలలో ఇంకా ఐరన్ , విటమిన్ A , B లు కూడా పుష్కలంగా ఉన్నాయి . ఇవి మంచి బలవర్థకమైన ఆహారంగా చెప్పవచ్చు.
* సజ్జలను మెత్తగా పిండిచేసి తయారుచేసిన రొట్టెలను తేనెతో కలిపి ప్రతినిత్యం ఉదయం పూట వాడుచున్న శరీరముకు మంచి బలం కలుగును.
* నిద్ర పట్టనివారు , మొలల వ్యాధితో బాధపడేవారు , నరాల బలహీనంతో బాధపడేవారు పైనచెప్పినట్టు సజ్జరొట్టెలను తేనెతో కలిపి తీసుకొనుచున్న మంచి ఫలితం కనిపించును.
* సజ్జలను అధికంగా తీసుకొనుచున్న యూరిక్ ఆసిడ్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. కావున మితముగా తీసికొనవలెను.
* మధుమేహ వ్యాధిగ్రస్థులు , శుక్రంనష్టం , తెల్లబట్ట సమస్య ఉన్నవారు, మలబద్దకం, క్షయ , గనేరియా , సిఫిలిస్ వంటి సుఖవ్యాధులు ఉన్నవారు సజ్జలు తినరాదు.
మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి