రామాయణమ్ 320
....
బ్రహ్మండభాండంఒక్కసారిగా బద్దలవుతున్నదా అన్నట్లుగా, పిడుగులు ఒక శ్రేణిలో వరుసగా రాలి పడ్డట్లుగా భవనాలు బద్దలవుతున్నాయి.
.
అవి బద్దలయ్యేటప్పుడు వాటికితాపడం చేసిన మణి మాణిక్యాలు ఛటచ్ఛట,సటస్సట ధ్వనులు చేసుకుంటూ చిట్లిపోయి పెట్లి రాలిపోతూ కోటానుకోట్ల మిణుగురుల గుంపులు లంకా నగర ఆకాశాన్ని కప్పి వేసినాయా అన్నట్లుగా ఆకాశం మెరుస్తూ కనపడుతూ ఉన్నది.
.
ఎగసెగసి పడుతున్న అగ్నిశిఖలు కొన్నిచోట్ల మోదుగ పువ్వుల లాగ ,మరికొన్ని చోట్ల బూరుగు పువ్వులాగ ఇంకొన్ని చోట్ల కుంకుమ పువ్వులాగా వేరువేరుగా ప్రకాశిస్తూ లంకా నగరాన్ని కోటి సూర్యులు ఒక్కసారే ప్రకాశంతో ఆక్రమించారా అన్నట్లుగా ఉంది.
.
లంకా నగర వాసుల గుండెలను మాత్రము వైష్ణవమాయ ఆక్రమించి పెనుజీకట్లుకప్పి వేశాయి.
.
ఆయన తోక గిర్రున వలయంలాగా తిరుగుతూ విలయాలను సృష్టిస్తూ ఉంటే వలవల ఏడుస్తూ లంకా నగరమంతా కాపాడే దిక్కులేనిదయిపోయింది.
.
ఆయన తోక తిరిగే వేగానికి జ్వాలా తోరణాలు పుడుతున్నాయి
ఆ తోరణాల మధ్యలో వీరహనుమంతుడు
ప్రళయకాల రుద్రుని వలే
శత్రుభయంకరుడైన వీరభద్రుని వలే
ఒక రౌద్రం ,ఒక భీభత్సం కలగలిసి రాక్షసుల హృదయాలలో గుబులు పుట్టిస్తున్నాడు..
.
సమస్త లంకా నగరం కనులు మూసి తెరిచే లోపల బూడిదకుప్ప అయిపోయింది .
.
కాలాగ్నియా ఈతడు?
అని సకల భూతగణములు బెంబేలెత్తిపోయినవి.
.
అంతలోనే ఆ మహాబలి
మనస్సును భయము ఆక్రమించింది !
.
సీతమ్మకు ఏమైనా అయ్యిందేమో???
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి