28, సెప్టెంబర్ 2023, గురువారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 33-37*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 33-37*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శ్లోకం - 33*


*స్మరం యోనిం లక్ష్మీం త్రితయ మిద మాదౌ తవ మనోః*

*నిధా యైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః |*

*భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయాః*

*శివాగ్నౌ జుహ్వన్త స్సురభి ఘృతధారాహుతి శతై: ‖*


నిత్యే= అమ్మా


తవ మనోః = నీ మంత్రమునకు ముందు చెప్పిన హాది విద్య లోని 'హ్రీమ్'


త్రితయ మిద మాదౌ = మొదటి కూటమిలోని మూడు అక్షరములను మార్చుకుంటే 


స్మరం = కామరాజ, మన్మధ బీజం


యోనిం = భువనేశ్వరీ బీజంః


లక్ష్మీం = లక్ష్మీ బీజం 

ఈ మూడూ ఐం హ్రీమ్ శ్రీమ్


నిధాయ = అవుతున్నది 

కాది విద్యగా


నిరవధి మహాభోగ రసికాః = అవధి లేని మహాభోగమంటే కేవలం బ్రహ్మానందము. 

ఇట్టి ఆనందమును కోరే రసికులు (సంస్కారవంతులు) ఈ మంత్రమును జపిస్తారు.  నిన్ను ధ్యానిస్తారు. 


భజంతి త్వామ్ చింతామణి గుణ నిబద్ధాక్ష వలయాః = చింతామణులతో కూర్చిన జపమాలను ధరించి, జపించి 


శివాగ్నౌ జుహ్వంతః = రుద్ర మంత్రంతో మంత్రించిన అగ్నిహోత్రంలో   


సురభి ఘృత ధారాహుతి శతైః  = ఉత్తమమైన గోక్షీరము నుండి తీసిన నేయితో శతాధిక సంఖ్యలో ఆహుతులు ఇస్తారు.


ఏదైనా మంత్రం సిద్ధించాలంటే జప తర్పణాదుల తరువాత ఆ దేవతకు సంబంధించిన హోమం చేస్తే సంపూర్ణ ఫలం సిద్ధిస్తుందని శాస్త్రము. అంతేకాక ఇక్కడ ఈ ఉపాసనల వల్ల లభించే ఇహలోక పరలోక సుఖములు అనిత్యములు కనుక

ఆ కర్మఫలములను జ్ఞానాగ్నిలో (శివాగ్నిలో) బ్రహ్మార్పణమస్తు అని ఆహుతి చేస్తున్నారు అని భావించాలి. వారికి అమ్మవారి పాదాలే అవధి లేని భోగం. 

హాది విద్య, కాది విద్య, సాది విద్య ఇవన్నీ అమ్మవారి బ్రహ్మవాస్తు విద్యలు. కాది విద్యను మన్మధుడు, హాది విద్యను లోపాముద్ర , సాది విద్యను దూర్వాస మహర్షి ప్రకటించారు.


 🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷


*శ్లోకం - 34*


*శరీరం త్వం శంభోశ్శశిమిహిర వక్షోరుహయుగం*

*తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన మనఘమ్ |*

*అతశ్శేష  శ్శేషీ త్యయ ముభయసాధారణతయా*

 *స్థితస్సమ్బన్ధోవాం సమరస పరానంద పరయోః ‖*



ఈ శ్లోకం నుండి 41 వ శ్లోకము వరకు ఒక గుచ్ఛము. వీటిలో శివ శక్తులు జగత్తుకు జననీ జనకులై ప్రతి జీవుడి హృదయంలో ఆసీనులై పాలిస్తున్నారు అని చెప్పబడుతున్నది. మొదట్లో మనము చెప్పుకున్న సమయాచారము శివ శక్తుల సమైక్యత వీటిలో స్ఫుటంగా కనబడుతుంది. *సమయాచార తత్పరా* అని సహస్ర నామాల్లో ఒకటి కదా!


శరీరం త్వం శంభోః = తల్లీ నీవు శివునకు శరీరమువు. వ్యక్తమయేది శరీరం. అవ్యక్తం ఆత్మ. అమ్మ వ్యక్తమయితే స్వామి అవ్యక్తం.


శశి మిహిర వక్షోరుహయుగం = సూర్యచంద్రులు వక్షముగా కలిగిన శరీరము నీది. అదే విశ్వము. విశ్వమే శివుని శరీరం. జగత్తంతా నిండిపోయినవాడు కదా! పసిపిల్లలకు తల్లి స్తన్యము వలె సర్వ జగత్తుకు ప్రాణశక్తిని, సస్యములను, ఓషధులను ఇచ్చి పోషించేది సూర్యచంద్రులు.


తవాత్మానం మన్యే భగవతి = ఆత్మ శబ్దానికి సందర్భాన్ని బట్టి అన్వయం మారుతూ ఉంటుంది. 

ఇప్పుడు తాపత్రయములలో  (ఆధి భౌతిక,ఆధి ఆత్మిక, ఆధి దైవిక తాపములు) ఆధ్యాత్మికము వలె ఒక చోట మనస్సనీ మరొకచోట శరీరమనీ అన్వయం చేసుకోవాలి. ఇప్పుడు శంకరులు అంటున్నారు. తల్లీ ఒక్కొక్కసారి నీవు ఆత్మవు అవుతావు ఆయన శరీరమవుతాడు.


నవాత్మాన మనఘమ్ = నవరూపములుగా వున్న శివుడు

 శివ వ్యూహాలు,అంశలు తొమ్మిది.


 ఇవి కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళా, జీవ అనేవి. అందుకే శివునకు నవాత్మ అని కూడా పేరు.


అతః శేషః శేషీ త్యయ ముభయ సాధారణ తయా = శేషః అంటే ఆశ్రయించుకొని వున్న జీవులు/విశ్వము

 శేషి అంటే ఆశ్రయింపబడినవాడు. బహుశా ఈ భావము నుండే విష్ణువునకు శేష శయనుడు అనే పేరు కలిగివుండవచ్చు. ఇప్పుడు, ఇంతకు ముందు చెప్పుకున్న విధముగా ఒక్కొక్క సారి అమ్మవారు శివునకు శరీరముగా శేషః  అయితే, స్వామివారు ఆత్మగా శేషి అవుతారు. మరొకసారి సందర్భమును బట్టి స్వామి శేషః అయితే, అమ్మవారు శేషి. అలాగే వారి సమన్వయం ఎలా ఉంటుందంటే 


పంచ కృత్యములలో సృష్టి, స్థితి అమ్మవారు చేస్తే, ఆయన సహకరిస్తారు. (ప్ర)లయము, తిరోధానము సహజ స్థితిని కప్పి ఉంచటం.

ఉదా: నిద్రా సమయంలో ఇంద్రియాలు ఉపసంహరింపబడి, ప్రపంచ వ్యవహారాలన్నీ మరుగున పడటం. అయ్యవారి పని అయితే, ఆవిడ సహకరిస్తుంది. అనుగ్రహము మోక్షము, తెల్లవారి లేచాక రాత్రి నిద్రా సమయంలో మరుగున ఉన్నవన్నీ మళ్ళీ బుద్ధికి తోచటం మాత్రము ఇద్దరూ సమముగా చేస్తారట.


స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః = పరానందము అంటే మాలిన్యములేని విషయ సుఖాపేక్ష లేని స్వచ్ఛమైన ఆనందము.

 పైన చెప్పిన విధంగా శేష,శేషీ భావ సంబంధము  సమరస సమన్వయము కలిగిన శివ శక్తులను ఆనంద భైరవ, ఆనంద భైరవీ రూప చిచ్ఛక్తులుగా ఈ విశ్వమునంతా నడుపుతున్న జననీ జనకులుగా భావించి ధ్యానించాలి అని అర్థము.


తాపత్రయాలు మనిషికి మూడు విధాల తాపములు కలుగుతూ ఉంటాయట.

 అవి


1. ఆధి ఆత్మికము = మనిషి స్వయంగా చేసే కర్మల వల్ల కలిగే బాధలు, వృత్తిలోను, ఇతరులతో మనం వ్యవహరించే తీరు తోను ఉత్పన్నమయే బాధలు.


2. ఆధి భౌతికము = వ్యాధులు, జంతువులు/ కీటకములు/ సర్పములు, వృశ్చికములు వంటి వాటి వలన కలిగే బాధలు. 

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి ఈ కోవ లోనిదే.


3. ఆధి దైవికం = దైవికంగా కలిగే ఆపదలు. 

ఉదా: భూకంపాలు, తుఫానులు, సునామీలు, కార్చిచ్చులు వంటివి.


🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శ్లోకం - 35*


*మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి రసి*

*త్వ మాప స్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరమ్ |*

*త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వ వపుషా*

*చిదానందాకారం శివయువతి భావేన బిభృషే ‖*


ఓ తల్లీ 

పంచభూతములు మనస్సు నీ రూపములై ఈ ప్రపంచముగా కనబడుతున్నావు నీవు. 

ఈ ఆరూ మనలోని షట్చక్రములు. 

నీ కంటే ఇతరమైనది ఏదీ లేదు. ఈ ప్రపంచముగా అభివ్యక్తమవటానికి చిదానంద రూపాన్ని ధరించి ప్రకృతిగా, శివానిగా రూపు దిద్దుకున్నావు.


మనస్త్వం = భ్రూమధ్య స్థానం, మనస్సు నీవే


వ్యోమత్వం = ఆకాశము నీవే


మరుత్ ఆసి = వాయువు నీవే


మరుత్ సారధి రసి = వాయువు సారధిగా కల అగ్నివి నీవే


త్వం ఆపః = జలమువు నీవే


త్వం భూమిః = నీవే భూమివి 


పరిణమయితుం విశ్వ వపుషా =  నీవే ఈ ఆరుగా పరిణమించి విశ్వముగా, శరీరముగా ఏర్పడ్డావు.


ఇన్నిటిగా ఉంటూ కూడా నీవు మాత్రం ఏ పరిణామం లేకుండా చిదానంద రూపిణిగా శివశక్తిగా వున్నావు అని భావం.


🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శ్లోకం - 36*


*తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం*

 *పరం శంభుమ్ వందే పరిమిళితపార్శ్వం పరచితా |*

*యమారాధ్యా న్భక్త్యా  రవిశశిశుచీనా మవిషయే*

*నిరాలోకేఽలోకే నివసతిహి భాలోకభువనే ‖*


ఈ శ్లోకం నుండి నాలుగు శ్లోకాలలో సాధనపరమైన విషయములను చెప్తున్నారు. నిన్న 35 వ శ్లోకార్థంలో చెప్పుకున్నాము మనలోని షట్చక్రాలు అమ్మవారి పరిణామ స్వరూపాలని. ఇప్పుడు శివ శక్తులు సామరస్యంగా ఈ షట్చక్రాల్లో విహరిస్తూ ఏ చక్రంలో ఎలా వుంటారో ఏ పేరుతో వుంటారో ఆ స్వరూపం ఏమిటో మన ధ్యానం ఎలా ఉండాలో వివరిస్తున్నారు. 


 35 వ శ్లోకంలో చెప్పుకున్నట్లు మన షట్చక్రములు అమ్మవారివేనన్న భావనతో మన ధ్యానం సాగాలి.


తవాజ్ఞాచక్రస్థం = నీ ఆజ్ఞాచక్రమునందు


తపన శశికోటి ద్యుతిధరం = కోట్లాది సూర్యచంద్రుల కాంతితో వెలిగిపోతున్న


పరం శంభుమ్ = పరశంభు గా పిలువబడే పరమేశ్వరునికి


వందే పరిమిళితపార్శ్వం పరచితా = ఆయనతో వామభాగాన కలిసిపోయి పరచితి అని పిలువబడుతున్న నీకు నమస్కారము.

 పరచితి అంటే పరమమైన చైతన్యం.


యమారాధ్యన్ భక్త్యా = వారిని ఆరాధిస్తే, భక్తులకు ఎలాటి ఫలితం ఉంటుంది?


రవి శశి శుచీనామవిషయే = సూర్య, చంద్ర, అగ్నులకు అందని స్థానానికి వెళ్తారు. నిజానికి ఈ మూడు వెలుగులూ ఒక్కటే. వేదాంత పరిభాషలో త్రిపుటి అంటారు.

అంటే

 జ్ఞాత 

తెలుసుకొనేవాడు, సాధకుడు


 జ్ఞానము

తెలుసుకొనే సాధనం 


జ్ఞేయ 

తెలుసుకోబడే వస్తువు,పరమాత్మ. అంతా ఒక్కటేనన్న స్థాయికి చేరుతాడు.


నిరాలోకేఽలోకే = ఇక ఏ లోకమూ లేదు.(నిరాలోకే)


*లోకాతీతా* అని అమ్మవారి నామం చెప్పినట్లు


ఆలోకే =  స్వయంప్రకాశమైన వెలుగు,బ్రహ్మజ్ఞానము 


భాలోక భువనే = భా అంటే కాంతి, వెలుగు అన్ని లోకాలనూ ప్రకాశింపజేసే స్థాయికి చేరి


నివసతి హి = అక్కడ నివసిస్తాడు.


మనది భారతదేశం. మనది సనాతన ధర్మం. హిందూ అనే శబ్దం పారశీకులు దండెత్తి వచ్చినప్పుడు సింధు నది ప్రాంతంలో వున్న దేశం కాబట్టి  సింధు/హిందూ (వారి భాషలో  స కి హ కి భేదం లేదు) దేశంగా పిలిచారు. రతము అంటే ఆసక్తి, రమించుట అని. కాంతి, ప్రకాశము (ఆత్మజ్యోతి) యందు ఆసక్తి, నిష్ఠ కలిగి తాను పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకొని ఆ పరబ్రహ్మానందమునందు రమించు ఋషులు, యోగి పుంగవులు కలిగిన దేశము భారతదేశము.


🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷


*శ్లోకం - 37*


  *విశుద్ధౌ తే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం*

   *శివం సేవే దేవీమపి శివసమానవ్యవసితామ్ |*

   *యయోః కాంత్యా యాంత్యా  శ్శశికిరణ సారూప్యసరణేః*

   *విధూతాం న్తర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ ‖*



ఈ శ్లోకంలో స్వామి, అమ్మ విశుద్ధ చక్రంలో ఎలా వుంటారో చెప్తున్నారు.


విశుద్ధ చక్రమంటే ఆకాశ చక్రం. ఆకాశమును కలిగించినవారు వ్యోమజనకం  ఆకాశము నుండి మిగిలిన భూతములు ఉద్భవించాయి.

వాయువు, అగ్ని, జలము, భూమి.ఒకదాని నుండి ఒకటి జన్మించాయని వేదము చెప్తున్నది.ఇప్పుడు ఈ విశుద్ధ చక్రములోనున్న పార్వతీ పరమేశ్వరులను వ్యోమేశ్వరి, వ్యోమేశ్వరుడు అంటారు. 


విశుద్ధౌ తే శుద్ధస్ఫటిక = శుద్ధ స్ఫటిక కాంతులతో


శశికిరణ సారూప్యసరణేః = వారి శరీర కాంతులు చంద్రకిరణ కాంతులవలె తెల్లగా చల్లగా ఉంటాయట.


విధూతాంతర్ధ్వాంతా = మన లోపలి అజ్ఞానపు చీకట్లను తొలగిస్తారు.


విలసతి చకోరీవ జగతీ = జగత్తు చకోరము వలె వున్నది వారి వలన. చకోరములు వెన్నెల త్రాగి జీవిస్తాయి. ప్రపంచం శివశక్తుల నుండి ప్రసరిస్తున్న అమృతం వల్లనే బ్రతుకుతున్నదని భావం.


శివం సేవే దేవీమపి శివసమాన వ్యవసితామ్ = అట్టి జననీ జనకులను సమముగా సేవిస్తున్నాను.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: