2, అక్టోబర్ 2023, సోమవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 41*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 41*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


  *తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా*

  *నవాత్మానం మన్యే నవరస మహాతాణ్డవనటమ్ |*

  *ఉభాభ్యామేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా*

  *సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమ జ్జగదిదమ్ ‖*


ఇదొక అద్భుతమైన శ్లోకం. మూలాధార చక్రములో శివ శక్తులు ఎలా వున్నారో చెప్తున్నారు ఇందులో. కుండలిని శక్తికి మూలాధారం ప్రధానం. తీగకు పాదు వలె. మనిషిలో ఏ స్పందనైనా ముందు మెదడులో మొదలై విద్యుత్ వేగంతో మూలాధారానికి వెళ్లి, అక్కడ నుండి మళ్ళీ పైకి ప్రయాణించి మెదడును చేరుతుందని యోగశాస్త్రాలు చెప్తున్నాయి.


తవాధారే మూలే = నీదైన ఈ మూలాధార చక్రంలో

 శరీరం నాది కాదు అమ్మదే అనే భావనతో


సహ సమయయా లాస్యపరయా = ఇక్కడ అమ్మవారు *సమయ* అనే పేరుతో లాస్యం చేస్తూ ఉంటారట. లాస్యం కోమలంగా పద ఘట్టనం లేకుండా ఉంటుంది. 


నవాత్మాన మన్యే = శివుడు నవాత్మకుడు. 

మన శరీరము ఈ విశ్వము కూడా నవాత్మకమే. వీటిని వ్యూహములని కూడా అంటారు. వ్యూహమునకు వ్యుత్పత్తి  *ఊహ వితర్కే* విశేషముగా విచారింపబడునది. *వ్యూహో నా బలవిన్యాస నిర్మాణ నికురుంబయో: ఇతి రుద్రః* అని అమరం.

రుద్రుని  వ్యూహములు

కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కల, జీవ. వ్యూహములు ఈశ్వర విభూతులూ, అంశలు. అవతార విశేషముల వంటివే వ్యూహములు.   సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తూ జీవుల గతులను నిర్దేశించే నవగ్రహాలు, నృత్యంలో నవరసములు, నవావరణాలు ఇవన్నీ ఇలాటివే.


నవరస మహాతాండవ నటమ్ = స్వామి, నటరాజుగా నవరసాలొలికిస్తూ మహాతాండవ నృత్యం చేస్తూ వుంటారు. తాండవమనేది ఉద్ధృతంగా ఉంటుంది. ఈ తాండవాన్ని *ఆర్భటీ వృత్తి* అంటారు. వృత్తి అంటే వర్తించేది.ఒక నడక/నడవడి. వీటిని కావ్య వృత్తులంటారు. ఇవి కైశికి, ఆర్భటి, సాత్వతి, భారతి. 

అమ్మవారి లాస్యము కైశికి వృత్తి. ఈ కౌశికీ, ఆర్భటీ వృత్తుల సమన్వయమే శరీరం.


 జనకజననీమ జ్జగదిదమ్ =  శరీరం లోనే కాదు, విశ్వంలో కూడా ఈ రెండిటి సమన్వయం అవసరం.


ఉభాభ్యా మేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా

సనాథాభ్యాం జజ్ఞే = ఈ విధంగా వీరిద్దరూ ప్రపంచానికి తల్లి తండ్రులుగా వున్నారు. కనుక మేము అనాథలం కాము, సనాధలము.


ఈ శ్లోకంలో అమ్మవారి నామాలు *లాస్యప్రియా లయకరీ లజ్జా  రంభాది  వందితా* , *మహేశ్వర మహాకల్ప  మహా తాండవ సాక్షిణి* దర్శించవచ్చు.


మూలాధార చక్రం భూమి తత్త్వం. భూమిపై  జీవించే మానవులు అరిషడ్వార్గాలకు లోనయి ధర్మమును పాటించక భ్రష్టత్వం పొందుతుంటే పార్వతీ పరమేశ్వరులు తమ తాండవ/లాస్యములతో వారికి జ్ఞానేచ్ఛను కలిగించి యోగసాధనకు ప్రోత్సహిస్తారని భావం.


పరమేశ్వరుడు స్థాణువు. *స్థిరః స్థాణుః* అని శివ సహస్ర నామాలు ప్రారంభం. అమ్మవారు ఆయనను కార్యోన్ముఖులను చేస్తుందట. ఆయన నవరసాలతో కూడిన మహా తాండవ నృత్యం చేస్తుంటే ఆవిడ విలాసంగా చూస్తూ తరువాత తన మృదువైన లాస్యంతో ఆయన ఉద్ధృతిని తగ్గిస్తుందట. ఈ మహా తాండవాన్ని మహాప్రళయం కాలంలో ఆయన ప్రదర్శించి సర్వ జగత్తును మహాగ్నిలో భస్మీపటలం  చేస్తుంటే ఆమె సాక్షిణిగా చూస్తూ వుంటుందట. అనంతరం తన కరుణారస దృష్టులతో చల్లదనాన్ని వర్షించి ఆనందభైరవిగా తన లాస్యంతో పునః సృష్టికి ఆయనకు సహకరిస్తుంది. ఆయన ఆనంద భైరవుడు ఆమె ఆనందభైరవి. 


ఈ స్తోత్రము మొదలుపెట్టినప్పుడు అందమే ఆనందం అని అన్నాను. ఏమిటి ఈ రెండూ? 

ఒకటి నుండి ఈ 41 వ శ్లోకం వరకు *ఆనంద లహరి* గా పిలుస్తారు. వీటిలో, సచ్చిదానంద తత్త్వమును ప్రతిపాదించే దివ్యమైన మంత్ర, తంత్ర, యోగ, ఉపాసనా రహస్యములు అనేకం చెప్పబడ్డాయి. అందుకని ఆనందలహరి. వీటివలన కలిగిన సంస్కారంతో మిగిలిన 59 శ్లోకాలను పఠించి అర్థం చేసుకోవాలి. వీటిని *సౌందర్యలహరి* అంటారు. వీటిలో అమ్మవారి కేశముల నుండి పాదముల వరకు సౌందర్య వర్ణన ఉంటుంది. ఇవన్నీ వేదాంతపరమైన అనేక విషయములను సూచిస్తాయి. ఏది ఆనందమును కలిగిస్తుందో అది అందము. కాళిదాసు రఘువంశ కావ్యంలో చెప్పినట్లు , *వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే  జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ* 🙏🏻


 *తాండవం నటనం నాట్యం లాస్యం నృత్యం చ నర్తనే* అని నృత్య రీతులు.

*తాడ్యతే భూమిఃఅనేన ఇతి తాండవం* దీని చేత భూమి కొట్టబడును. పాదఘట్టనలు

*నట్యతే నటనం* నటించుట నటనం

*నటస్య కర్మ నాట్యం* నటుడు చేసేది నాట్యం 

*లసనం లాస్యం* లలితముగా లావణ్యముతో క్రీడించుట లాస్యము.

*నృతీ గాత్ర విక్షేపే నృత్యం నర్తనం* గాత్రమునకు చేయు నృత్యము నర్తనం.



           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: