🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 52*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ప్రకృతికి నియమాలున్నాయి. మొక్కలలో పువ్వులు ముందు పూస్తాయి, పిదప పిందె వస్తుంది - ఇది అలాంటి నియమాలలో ఒకటి, కాని ఈ నియమాలు కొన్ని చోట్ల, కొన్ని సమయాలలో ఉల్లంఘనమవడమూ కద్దు. గుమ్మడి మొక్కలలో మొదట పిందె వస్తుంది. ఆ తరువాతే పువ్వు పూస్తుంది. ఈశ్వరకోటులైన తమ శిష్యులకు దీనిని ఉదాహరణగా పేర్కొనేవారు శ్రీరామకృష్ణులు.
సాధారణంగా ఆధ్యాత్మిక సాధనలు, తపస్సు అనుష్ఠించి భగవదనుభూతి పొందుతారు. ఇది నియమం కాని ఈశ్వరకోటుల విషయంలో ఈ నియమం మారుతుంది. వారు ముందుగానే ఆధ్యాత్మిక అనుభూతులను పొందివుంటారు. పిదప తపస్సు ఇత్యాదులు ఒనరించి తద్వారా ఆధ్యాత్మిక అనుభవాలు సంతరించుకొని, ముందుగానే తాము పొంది వున్న ఆధ్యాత్మిక అనుభూతులతో వాటిని పోల్చి చూసుకొంటారు.
ఈశ్వరకోటులలో అగ్రతాంబూలం నరేంద్రునిదే. అతడు ఇప్పటికే కొన్ని అత్యున్నత అనుభవాలు పొందడం చూశాం. కాని అతడూ ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించాడు. శ్రీరామకృష్ణులు అతడికి అనేక సాధనలలో శిక్షణలిచ్చారు.
ఆధ్యాత్మిక సాధనా శిక్షణలలో మొదటి మెట్టు మంత్రదీక్ష. సామాన్యంగా గురువు శిష్యుని అర్హతకు తగిన ఒక మంత్రాన్ని ఉపదేశించడం ద్వారా దీక్ష ప్రసాదిస్తాడు. అంటే ఆధ్యాత్మిక జీవితానికి మార్గం చూపుతాడన్నమాట. ఈ మంత్రం సిద్ధమంత్రమై ఉండాలి. సిద్ధమంత్రం అంటే జాగృతం కలిగించే మంత్రం అని అర్థం. అంటే గురువు ఆ మంత్రాన్ని జపించి తద్వారా, ఆ మంత్రానికి చెందిన దేవత అనుగ్రహం పొందినవాడై ఉండాలి. అలాంటి గురువు ఒసగే మంత్రదీక్ష మాత్రమే ఫలవంతమవుతుంది.
ఎందుకంటే మంత్రంతోపాటు ఆ మంత్రాన్ని జపించడానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తాడు కనుక. అందుకే గ్రంథాల్లో చదివి, ఆ మంత్రాలను జపించ కూడదు, గురువు ద్వారా పొందిన మంత్రాన్నే జపించాలని వక్కాణిస్తారు. ఈ మంత్రదీక్షకి ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి.
కాని పరిపూర్ణ స్థితిని సంతరించుకొన్న గురువు నియమాలను ఉల్లంఘించి, తాను అభిలషించే రీతిలో దీక్ష నివ్వడం కద్దు. ఆధ్యాత్మిక శక్తిని శిష్యునిలో ప్రసరింపజేయడమే దీక్ష ఉద్దేశం. దీనిని వారు తమకు నచ్చిన రీతిలో నెరవేరుస్తారు. ఇలాంటి దీక్షను తంత్రశాస్త్రాలు శాంభవీదీక్ష అని పేర్కొంటాయి. శ్రీరామకృష్ణులు నరేంద్రునికి ఇలాంటి దీక్షనే ప్రసాదించారు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి