*నిత్యాన్నదాన మార్గం..*
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద 2007 వ సంవత్సరం జూన్ మాసం లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము..ఒక నెల రోజులపాటు కేవలం ఆదివారం మధ్యాహ్నం సమయం లో మాత్రమే అన్నదానం నిర్వహించేవాళ్ళము..శనివారం నాటి సాయంత్రం స్వామివారి మందిరానికి వచ్చిన భక్తులు ఆహారం కొరకు పడుతున్న ఇబ్బందులు గమనించి..శనివారం రాత్రికి కూడా అన్నదానం చేయాలని సంకల్పించాము..ఆరోజుల్లో శనివారం నాడు పల్లకీసేవ ఇప్పుడు నిర్వహిస్తున్న మాదిరిగా కోలాహలంగా ఉండేది కాదు..అర్చకస్వాములు పల్లకీ వద్ద స్వామివారి అష్టోత్తర పూజ చేసి హారతి ఇచ్చేవారు..ఆపై భక్తులు పల్లకీని తమ భుజాలపై మోసుకుంటూ..స్వామివారి మందిరం చుట్టూరా మూడు ప్రదక్షిణలు చేసేవారు..ప్రదక్షిణలు పూర్తికాగానే, అర్చకస్వామి పల్లకీ వద్ద మరలా హారతి ఇచ్చేవారు..అంతటితో పల్లకీసేవ సమాప్తం అయ్యేది..ఆ సమయానికి స్వామివారి మందిరం వద్ద సుమారు మూడు, నాలుగు వందలమంది ఉండేవారు..వారందరికీ ఆహారం ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి..అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము..
ఇలా ప్రతి శని ఆదివారాల్లో అన్నదానం నిర్వహించడానికి మాకు ఆర్ధిక వనరులు ఎప్పటికప్పుడు సమకూరేవి..ఇందుకు సంబంధించి ఒక చిన్న ఉదంతాన్ని మీతో పంచుకుంటాను..
2011 వ సంవత్సరం లో ఒకరోజు మా సిబ్బంది నా వద్దకు వచ్చి.."అయ్యా..అన్నదానానికి సరుకులు కొనాలి..ప్రస్తుతం మనవద్ద ఉన్న నిల్వ సరుకులు మరో మూడువారాలు అన్నదానం చేయడానికి సరిపోతాయి..అప్పటికప్పుడు వెతుక్కోవడం కష్టం కనుక..మీ దృష్టికి ఇప్పుడే తెస్తున్నాము.." అన్నారు.."సరే..మరో మూడు నెలలకు సరిపడా సరుకులు కొనడానికి ఎంత ఖర్చు అవుతుందో..విచారించి నాకు చెప్పండి.." అన్నాను..మరో గంట తరువాత లెక్క తీసుకొని నావద్దకు వచ్చారు..దాదాపుగా రెండు లక్షల రూపాయలు కావాలి..దాతలు ఇచ్చిన విరాళాలు ఓ ఎనభై వేల రూపాయలు ఉన్నాయని..మిగిలిన మొత్తం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు..సరే అన్నాను..
మరో వారం గడిచింది..మరో పదివేలు సమకూరాయి..ఎలా లేదన్నా ఒక లక్ష రూపాయల పై చిలుకు మొత్తం కావాలి..(2011 వ సంవత్సరం లో లక్ష రూపాయలు పెద్ద మొత్తం క్రిందే అనుకునే వాళ్ళము..) ఆలోచిస్తూ వున్నాను.."మీరెందుకు ఎక్కువగా ఆలోచిస్తారు..స్వామివారి కి ఈ సమస్య విన్నవించండి..పదండి.. ఇద్దరమూ స్వామివారి సమాధి వద్ద చెప్పుకొని వద్దాము.." అని నా భార్య చెప్పింది..క క్షణం ఆలస్యం చేయకుండా మనసులో స్వామివారిని తలచుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి స్వామివారి పాదుకులకు శిరస్సు ఆనించి..నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చేసాము..
ఆ ప్రక్క ఆదివారం నాడు భక్తులు విశేషంగా స్వామివారి మందిరానికి దర్శనార్థం వచ్చారు..ఆరోజు మధ్యాహ్నం ఒంటి గంట దాకా మాకెవ్వరికీ తీరిక లేకుండా పోయింది..స్వామివారికి మధ్యాహ్నం నివేదన చేసి, హారతి ఇచ్చిన తరువాత..భక్తులను అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేయవలసినదిగా మా సిబ్బంది మైక్ లో చెప్పారు..స్వామివారి మందిరం లో ఉన్న భక్తులందరూ అన్నదాన సత్రం వద్దకు వెళ్లారు..నేనూ మా సిబ్బంది మిగిలాము..ఇంతలో మధ్యాహ్నం బస్సు లో ఓ దంపతులు వచ్చారు..స్వామివారి సమాధి దర్శనానికి వచ్చామని..కందుకూరులో బస్సు దొరకడం ఆలస్యం అయినందున తాము ముందుగా రాలేక పోయామని మా సిబ్బందికి చెప్పి..స్వామివారి సమాధిని దర్శించుకోవడానికి టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చారు..స్వామివారి సమాధి దర్శించుకొని..తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొని ఇవతలకు వచ్చారు..భోజనం చేసి రమ్మని వారికి మా సిబ్బంది చెప్పారు.."ఇక్కడ భోజనం ఉందా?..తినడానికి ఏమీ దొరకవేమో అనే ఉద్దేశ్యం లో మేము కందుకూరులో ఓ రెండు రకాల పళ్ళు కొనుక్కొని వచ్చాము..స్వామివారి ప్రసాదం ఉంది కనుక అదే తీసుకుంటాము.." అని చెప్పి..వెళ్లారు..
మరో రెండుగంటల తరువాత..మేమందరమూ లెక్కలు చూసుకునే సమయం లో ఆ దంపతులు మా వద్దకు వచ్చి నిలబడ్డారు.."ఒక రోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుంది?" అన్నారు..ప్రస్తుతానికి శని, ఆదివారాల్లో మాత్రమే అన్నదానం నిర్వహిస్తున్నామని..శనివారం నాటికీ, ఆదివారానికి విడి విడిగా ఎంత మొత్తం ఖర్చు అయ్యేదీ మా సిబ్బంది తెలిపారు.."మిగిలిన రోజుల్లో కూడా మధ్యాహ్నం భోజనం పెట్టవచ్చు కదా..ఈ ప్రాంతం మారుమూల ఉంది..ఇక్కడికి స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు ఆకలితో ఉండకూడదు..ఏమంటారు?" అని నన్ను అడిగారు.."ఆర్ధిక వనరులు చూసుకోవాలి కదా..ఒకరోజు భోజనం పెట్టి..ఆ తరువాత ఆపకూడదు..నిర్వహణ చేసేటప్పుడు అన్నీ ఆలోచించుకోవాలి.." అన్నాను..
ఆ దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.."ఏమీ అనుకోకుండా ఒక నెలలో రోజూ మధ్యాహ్నం అన్నదానం చేయడానికి..శని, ఆదివారాల్లో ఇదే ఎంత ఖర్చు అవుతుందో చెప్పగలరా..ఖచ్చితంగా లేకపోయినా..కొంచెం అటూ ఇటుగా తెలుపండి.." అన్నారు..మరో అరగంటకు లెక్క తేల్చి..కాగితం పై వ్రాసి ఇచ్చాము..ఆ కాగితాన్ని సరిగా చూడకుండానే తన జేబులో పెట్టుకొని.."మంచిదండీ..మా వంతు ప్రయత్నం మేము చేస్తాము..దత్తక్షేత్రం లో నిత్యాన్నదానం ఉంటే మంచిది..మీరు అనుమతి ఇస్తే..స్వామివారి సమాధిని మరొక్కసారి దర్శించుకొని వస్తాము.." అన్నారు..సరే అన్నాను..స్వామివారి సమాధిని దర్శించుకొని..సాయంత్రం బస్సుకు వెళ్ళిపోయారు..
మరో మూడు రోజుల తరువాత..ఆ దంపతుల నుంచి నాకు ఫోన్ వచ్చింది.."ప్రసాద్ గారూ..ఇప్పుడే సరుకులన్నీ ఆటో కు ఎత్తించాము..మీకు మధ్యాహ్నం చేరుతాయి..ఒక నెలరోజులకు సరిపడా మా లెక్కప్రకారం పంపాము..మామీద దయవుంచి.. వచ్చేవారం నుంచి ప్రతిరోజూ అన్నదానం చేయండి..పాలు, కూరగాయలు ఇతర ఖర్చులకు మేము అక్కడికి వచ్చి నగదు గా ఇస్తాము.." అన్నారు..నేను ఏమీ జవాబు ఇవ్వలేదు.."సరే నండీ.." అని మాత్రం అనగలిగాను..స్వామివారు నిత్యాన్నదానానికి మార్గం వేసేశారు అని అర్ధం అయింది..నా పాత్ర పరిమితమైనది అనికూడా అర్ధం అయింది..
ఆ ప్రక్కవారం మొదలైన నిత్యాన్నదానం ఈరోజువరకూ నిరంతరం కొనసాగుతోంది..ఎందరో దాతలు సహకరిస్తున్నారు..
ఆరోజు సహాయం చేసిన దంపతులు ఏనాడూ తమ పేరు బోర్డ్ మీద వ్రాయవద్దని కోరారు..ఇప్పటికీ ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి స్వామివారి సన్నిధికి వచ్చి సమాధి దర్శించుకొని వెళుతుంటారు..స్వామివారే వారికి ఆదేశం ఇచ్చారు కనుక వేరే ప్రచారం ఎందుకు?
సర్వం..
శ్రీ దత్తకృప!!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి