7, నవంబర్ 2023, మంగళవారం

ఆధ్యాత్మిక శిఖరం

 *ఆధ్యాత్మిక శిఖరం... శ్రీచక్రం*


భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ మోక్షసాధన లక్ష్యంగా సాగుతుంది. ఇందుకు అనేక ఉపాసన, ధ్యాన మార్గాలను పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు సూచిస్తున్నాయి. వీటన్నిటిలో శ్రీచక్ర పూజ, అర్చన, ఉపాసన అత్యున్నతమైనవి. యోగసాధనకు శ్రీచక్ర ఉపాసన పరమోన్నతమైన మార్గం. 


*శ్రీచక్ర ఆవిర్భావం*


శ్రీచక్ర ఆవిర్భావానికి సంబంధించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావన ఉంది. దీని ప్రకారం భండాసురుడనే రాక్షసుడిని సంహరించటం కోసం ఇంద్రుడు అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ గొప్ప యాగాన్ని చేస్తాడు. ఫలితంగా, యజ్ఞకుండం మధ్యభాగం నుంచి అమ్మవారు శ్రీచక్రమధ్యగతయై సాక్షాత్కరిస్తుంది. మరొక కథ ప్రకారం ‘రేణు’ మహారాజు అమ్మవారి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఇందుకు మెచ్చిన జగన్మాత, శ్రీచక్రస్థితయై అతనికి ప్రత్యక్షమవుతుంది. ఈవిధంగా శ్రీచక్ర ఆవిర్భావం జరిగినట్లు పురాణాల్లో ఉంది. 


*శ్రీచక్ర నిర్మాణం*


*శ్రీచక్రనిర్మాణంలో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉంటాయి.  బిందువు, త్రికోణం, అష్టకోణం, దశకోణాలు (రెండు), చతుర్దశ కోణం, అష్టదళం, షోడశదళం, భూపురత్రయం అనే తొమ్మిది ఆవరణలను వివిధ దేవతలు అధిష్ఠించి ఉంటారు. త్రిపురతాపినీ ఉపనిషత్తులో శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించిన వివరణ ఉంది.* 


*శ్రీచక్రం భూప్రస్తారం, మేరుప్రస్తారం అనే రెండు రూపాల్లో మనకు కనిపిస్తుంది. యంత్రరూపంలో, పటం రూపంలో కనిపించేది భూ ప్రస్తారం. కాగా, ఆలయాల్లో అర్చనలు అందుకునే రూపం మేరుప్రస్తార రూపం.* శ్రీచక్రార్చనకు సంబంధించి అనేక అర్చన, ఉపాసనా విధానాలు ఆచరణలో ఉన్నాయి.


గురు పరంపర పద్ధతి ప్రకారం వీటిలో అనేక భేదాలు ఉంటాయి. వీటన్నిటిలో నవావరణార్చన ఎంతో శ్రేష్ఠం. 


*శ్రీచక్రంలోని ఆధ్యాత్మిక కోణం ఎంత ఉన్నతమైందో అందులోని గణిత నిర్మాణం కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. సమున్నతమైన భారతీయ వైజ్ఞానిక దృక్పథానికి శ్రీచక్ర నిర్మాణం తార్కాణంగా నిలుస్తుంది. ప్రపంచం మొత్తమ్మీద ద్వి, త్రిజ్యామితీయ పరిమాణాల్లో ఉన్న ఏకైక నిర్మాణం శ్రీచక్రం మాత్రమే. లెక్క తెలియని లక్షల సంవత్సరాలకు పూర్వమే మనదేశం నేటి శాస్త్రవేత్తల ఊహకు సైతం అందని నిర్మాణాలు చేసిందనటానికి శ్రీచక్రం తరగని సాక్ష్యంగా నిలుస్తుంది.*


*రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, కెబిఎన్ కాలేజీ, విజయవాడ-1, సెల్: 9032044115*

కామెంట్‌లు లేవు: