5, ఆగస్టు 2024, సోమవారం

శ్రావణమాస మహాత్మ్యము -01*_

 _*శ్రావణమాస మహాత్మ్యము -01*_

        _*ప్రథమోధ్యాయము*_

 బ్రహ్మశ్రీ లక్ష్మీనృసింహ శాస్త్రి గారు

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)


_*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం!*_

_*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్!!*_


*శ్రీరస్తు.*


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!


వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః  పౌత్రమకల్మషం♪!!

పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం♪!! 

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!!

నమో వై బ్రహ్మ నిధయే వశిష్ఠాయ నమోనమః!

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే! 

సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే!!


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం! దేవీంసరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్•!!


*శౌనక ఉవాచ:* 


శ్లో॥ 

*సూతసూత మహాభాగ వ్యాసశిష్య మహామతే।*

*త్వదీయవదనాంభోజా దుపాఖ్యానానిశృణ్వతాం|*

*తృప్తిర్నజాయతే భూయశ్రావణేచ్ఛా ప్రవర్ధతే!*


తా॥

మహానుభావుడవును విశేషమైన జ్ఞానము గలవాడవును వ్యాసమునీశ్వరునకు శిష్యుడవును అగు ఓ సూతమునీశ్వరా! నీ ముఖపద్మము వలన  అనేక యితిహాసములను వింటిమి. అయినను తృప్తి తీరలేదు, తిరిగి _*శ్రావణమాస మాహాత్మ్యము*_ వినవలయునని కోరిక గలిగియున్నది. అని శౌనకుడు పలికెను.


*శ్లో:* 

*కార్తికస్యచమాహాత్మ్యం తులాసంస్థే దివాకరే!*

*మాఘమాసస్య మాహాత్మ్యం మకర స్థితే దివాకరే॥*

వైశాఖమాసమాహాత్మ్యం తథా మేషగతే రవౌl 

తత్ర తత్ర చ యే ధర్మాః కథితాస్సర్వశస్త్వయా! 


 ఓ మునీశ్వరుడా! సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినప్పుడు కార్తికమాస మాహాత్మ్యమును, సూర్యుడు మకరరాశి యందు ప్రవేశించినప్పుడు మాఘమాస మాహాత్మ్యమును, సూర్యుఁడు మేషరాశి యందు ప్రవేశించినప్పుడు వైశాఖమాస మాహాత్మ్యమును చెప్పి, ఆయా మాసములయందు జేయతగిన ధర్మములను సవిస్తరముగా జెప్పియుంటిరి.


 ఓ మునీశ్వరుడా! ఏ మాసము యొక్క మహిమను వినిన యెడల మఱియొక ధర్మమును వినవలయునని కోరిక కలుగదో... ఆటువంటిదియు, ఈ చెప్పబడిన మాసములకంటె ఉత్తమమైన మాసము ఉన్నయెడల చెప్పవలయును. ఎవరైనను ధర్మమును వినవలయునని కోరిక గలిగియున్న యెడల తెలిసినవారు దానిని చెప్ప వలయును గాని దాచగూడదు.


 *సూతుడు చెప్పుచున్నాడు...*


 ఓ శౌనకాది మునులారా! మీరందరు వినుఁడు. మీకు అందరికీ నాయందు ఉన్న గౌరవము వలన సంతసించితిని, ఇంత శ్రద్ధ గలిగియున్న మీ యెదుట సర్వమును జెప్పెదను గాని రహస్యముగా ఉంచువాడను కాను.


 డాంబికము లేకయుండుట, ఈశ్వరుడు ఉండుననుట, ద్వేషము లేక పోవుట, భక్తికలిగి యుండుట, పెద్దలను సేవించుట, నమ్రతగా ఉండుట, సమస్త విద్యలు నేర్చియుండుట, మంచి స్వభావము గలిగియుండుట, ధైర్యము కలిగియుండుట, శుచిగా ఉండుట, తపస్సు చేసికొనుట, అసూయత లేకపోవుట, అను గుణములు పండ్రెండును ధర్మములను వినవలయును అనుకునే వారికి ముఖ్యముగా ఉండవలయును. కాఁబట్టి అట్టి సమస్త గుణములు మీయందు ఉన్నందువలన సంతోషించి, యధార్ధముగా అంతయు మీకు చెప్పదలచిన వాడనైతిని.


 ఓ మునులారా! మిక్కిలి జ్ఞానసంపన్నుడైన సనత్కుమారుడు ధర్మములను తెలుసుకొన నిశ్చయించినవాడై యీ ప్రకారముగా అడిగెను.


 సనత్కుమారుడు అడుగుచున్నాడు.... 


 దేవతులకు దేవుడవును మునీశ్వరులచే ధ్యానము చేయతగిన పాదపద్మములు కలవాడవునగు... ఓ సాంబమూర్తీ! అనేకమైన వ్రతములు ధర్మములు సవిస్తరముగా నీవలన వినియుంటిని.


 అయినను, ఇప్పుడు నా మనస్సునందు మఱియొక కోరిక గలదు.  ఆది యెట్లనగా పండ్రెండు మాసములలోను శ్రేష్ఠమైనదియు, మీకు ప్రియమైనదియు, సమస్త కర్మలకు ఫలమునిచ్చునట్టి మాసమును గురించి వినవలయునని కోరిక జనియించియున్నది. 


 ఓ స్వామీ! ఇతర మాసములయందు జేయునట్టి కర్మ ఏ మాసమందు జేసిన విశేషఫలమును ఒసగునో అట్టి మాసమును, ఆ  మాసమునందుండెడి సమస్త ధర్మములను జెప్పి, లోకులను తరింపజేయు అనుగ్రహము కలవాడవు అగుమని సనత్కుమార మునీశ్వరుడు ఈశ్వరునితో బలికెను.


*ఈశ్వర ఉవాచ:*


 బ్రహ్మ మానసపుత్రుడవు అగు ఓ సనత్కుమారా! నీ యొక్క శుశ్రూష చేతను, భక్తి చేతను సంతోషించితిని. నే జెప్పెడు ధర్మము రహస్యముగా ఉంచతగినది. అయినను జెప్పెద వినుము.


 పండ్రెండు మాసములలోను శ్రావణమాసము నాకు చాలా ప్రియమైనది, దాని మహిమ, వినతగినది గాన, శ్రావణమాసమని పెద్దలచే నుడువఁబడి యున్నది.


 శ్రవణ నక్షత్రముతో గూడిన పూర్ణిమ గలదు కాబట్టి శ్రావణమాసమని చెప్పబడుచున్నది. ఏ మాసము యొక్క మహిమ వినబడినంత మాత్రముననే ఫలము నిచ్చుచున్నదో, అందువలననే ఆ మాసము శ్రావణమాసమని చెప్పబడుచున్నది. 


 ఆకాశమువలె నిర్మలమైనది కాబట్టి శ్రావణమాసమునకు, *నభా,* అని పేరువచ్చినది, ఆ మాసము నందుండు ధర్మములను లెక్కపెట్టుటకు ఈ భూమి యందు ఎవడును సమర్ధుడు కాడు.


 ఈ శ్రావణమాస మహిమను సర్వమును చూచుటకు బ్రహ్మ దేవుడు నాలుగు ముఖములు గలవాడయ్యెను, దేవేంద్రుడును వేయి నేత్రములు గలవాడయ్యెను.


 ఈ శ్రావణమాస ఫలమును చెప్పుటకు ఆదిశేషుడు రెండువేల నాలుకలు గలవాడయ్యెను. మఱియు ఇదియదియని విశేషముగా జెప్పనేల. ఈ మాసము యొక్క ఫలమును జెప్పుటకు ఈ ప్రపంచములో ఎవరును సమర్ధులు లేరు.ఓ మునీశ్వరుఁడా! ఈ శ్రావణమాస మహిమలో పదునారవ వంతు మహిమనైనను ఇతర మాసములు పొందలేవు. కాబట్టి, యీ మాసమంతయు వ్రతస్వరూపము గాను, ధర్మ స్వరూపముగాను ఉన్నదని మునీశ్వరులు జెప్పిరి.


 ఈ శ్రావణమాసము నందు ఒక దినమైనను వ్రతము లేని దినము లేదు. ఈ మాసమునందు తిధులన్నియు వ్రత దినములైనవి.


 ఈ శ్రావణమాస మహిమను గురించి చెప్పినదంతయు యధార్థమే గాని స్తోత్రము కాదు.  ఆర్తులు, జ్ఞానేచ్ఛగల భక్తులు, ప్రయోజనమును అపేక్షించు వారు, మోక్షాపేక్ష గలవారు, ఈ నాలుగు విధములైనవారును తమ తమ కోరికలను పొందుటకు ఈ శ్రావణమాస ధర్మములను ఆచరింపవలయును.


*సనత్కుమారువాచ:*


 ఓ సాంబమూర్తీ! ఈ శ్రావణమాసమునందు ఒక వారమైనను ఒక తిథియైనను, వ్రతము లేనిది కాదు. తిథులన్నియు తరుచుగా వ్రతములు కలవియే యని చెప్పితిమి. దానినే విస్తరించి నాకు జెప్పవలయును. ఏ తిథియందు ఏమి వ్రతము కలదు, ఏ వారమునందు ఏమి వ్రతము కలదు, ఆయా వ్రతములను ఎటువంటి వాఁడు చేయవలయును,  చేసినందువలన ఏమి ఫలము కలుగును, చేయువిధానం ఎటువంటిది, ఈ శ్రావణమాస వ్రతములను పూర్వమందు ఆచరించినవారెవరు, ఉద్యాపనము చేయుట ఎట్లు, ఏ దేవతను పూజింపవలయును ఆ పూజకు సామాగ్రి ఏమిటి!?


  ఓ సాంబమూర్తీ! నీవు ప్రధానుడవై యుండగా నీ ఎడమ భాగమందు శక్తియు, కుడి తొడయందు గణపతియు, నేత్రంబులయందు సూర్యుడును, భక్తాగ్రగణ్యుడగు విష్ణువు హృదయమందును నివసించి యుండుటవలన సృష్టి-స్థితి-లయములను జేయుటవలనను నీవు బ్రహ్మస్వరూపుఁడవైతివి.  నిన్ను పూజించినయెడల పంచాయతనపూజ జరుగును ఇతర దేవతలను పూజించిన యెడల ఆ విధముగా సంభవించదు.


 ఓ శివుడా! నీవు సమస్త దేవతలకును జీవస్వరూపముగా ఉండుటవలన నీవు శ్రేష్ఠుడవనుటకు నెవరికి సందేహము లేదు.


 విరక్తిని చెంది శ్మశానమునందు, పర్వతములయందు ఉన్న నీ యొక్క నివాసము ప్రతివారికిని వైరాగ్యమును అవలంబించి మోక్షాపేక్షులుగా ఉండవలయునని బోధించుచున్నది.  మఱియు పురుషసూక్తములో (ఉతామృతత్వస్స్యేశానః) అను మంత్రముచే ప్రతిసాదింపబడు దేవుడవు నీవేయని మునీశ్వరులు చెప్పుచున్నారు. 


 ప్రపంచమును సంహరింపజేయునట్టి హాలాహాలము అను విషమును నశింపజేయు ప్రలయకాలాగ్నిని మూడవ నేత్రముగా నుదుటను ధరించిన సుమర్ధుడవు నీవే కదా! సంసారమనెడు చీకటి నూతిలో పడద్రోయుటకు సమర్ధుడగు మన్మధుని సంహరించినవాడవు గదా! నీవు యిటువంటి వాడవు... అని నీ మహిమను జెప్పుటకు నేనెంతటివాఁడను.


 గ్రుడ్డిగవ్వతో సమానుడనైన నేను కోటి జన్మములెత్తినను నిన్ను స్తుతించుటకు సమర్ధుడను కాను. కాబట్టి, నాయందు దయ ఉంచి నేను వేసిన ప్రశ్నలకు అన్నిటికిని తగిన సమాధానములను జెప్పి నన్ను కృతార్థుడను జేయుము. 

        

*||ఇతి శ్రీస్కాందపురాణే ఈశ్వర సనత్కుమార సంవాదే శ్రావణమాస మాహాత్మ్యే ప్రధమోధ్యాయ స్సమాప్తః|*

కామెంట్‌లు లేవు: