5, ఆగస్టు 2024, సోమవారం

నాకే ఎందుకు ఇట్లా అవుతుంది.

 నాకే ఎందుకు ఇట్లా అవుతుంది. 




ప్రతి మనిషి అనుకునే సాధారణమైన మాట "నాకే ఎందుకు ఇట్లా అవుతుంది" వాళ్ళందరూ చూడు యెంత సంతోషంగా, ఆనందంగా వున్నారో, అదేమిటోగాని నాకు మాత్రం జీవితంలో సంతోషమే కరువు అయ్యింది. ఎందులో వేలు పెట్టినా కానీ చుక్కెదురే పాడు జీవితం రోజు ఏడుపే నాకు మిగులుతుంది. ఇట్లా మనలో చాలామంది బాధపడుతుంటారు, బాధపడుతున్నారు అంటే అందులో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. నిజమే ఎందుకు మనుషులలో ఇలాంటి భావనలు కలుగుతున్నాయి అంటే ప్రతి మనిషి కూడా ఒక అభిప్రాయంతో ఉంటాడు అదేమిటంటే తాను సుఖంగా లేడు ఎదుటివాడు సుఖంగా ఉన్నాడు అని అనుకుంటాడు. ఈ మానసిక స్థితి అటు పురుషులలోని ఇటు స్త్రీలలోను ఉంటుంది. 




మా అయన అస్సలు నా మాట వినడు అదే ఆ విమల వాళ్ళాయన ఎప్పుడు ఆమె కొంగు పట్టుకొని తీరుగుతాడు అంటుంది ఒక కమల . ఆమె దృష్టిలో తన భర్త తనకు స్వాధీనుడు కాడు కానీ విమల భర్త ఆమెకు స్వాదీనుడిగా ఉంటాడు అంటే తనకన్నా విమల అదృష్టవంతురాలు అని తన భావన. నీకు తెలుసా విమలా వాళ్ళాయన రోజు తాగి ఇంటికి వస్తాడట అని ప్రక్కింటి సరళ చెపితే ఆ అట్లనా అని ఆశ్చర్యపోయింది కమల అదికూడా రాత్రి పది పదకొండు గంటలకు. ఒక్కొక్కసారి తాగి రోడ్డుమీద పడితే తెలిసిన వాళ్ళు పట్టుకొచ్చి ఇంట్లో దింపుతారట ఆ అని మరల ఆశ్చర్యపోవటం తన వంతయింది నీకు తెలియదా అక్క అని పక్కింటి సరళ చెప్పేదాకా కమలకు విమల గూర్చి ఆమె తన భర్త విషయంలో పడే ఆవేదన గురించి తెలియదు, తనకు పగటిపూట ఎప్పుడో ఒకసారి తన భార్యను అనునయిస్తున్న అతనిని చూసి అనవసరంగా ఎక్కువగా వూహించుకున్నట్లు అర్ధం అయ్యింది. అక్కా బావ ఐతే ఎంచక్కా సాయంత్రం ఐదున్నరకల్లా ఇంట్లో ఉంటాడు నిన్ను పిల్లలను సినిమాలకు షికార్లకు తీసుకొని వెళతాడు. ఏ రోజయినా బావ ఆరింటికి ఇంటికి వచ్చాడా అక్కా అని అంటే అప్పుడు కానీ కమల ట్యూబులైటు వెలగలేదు యేమాటకు ఆ మాటే చెప్పుకోవాలి నిజానికి నా భర్త ఒక్క రోజు కూడా ఇంటికి ఆలస్యంగా రాడు నేనే ఎప్పుడు ఆయనను ఆడిపోసుకుంటాను అని మనసులో అనుకోని మంచి భర్తను తనకు ఇచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పింది. ఒక్కసారి చూసి ఏ అభిప్రాయం ఎవరిమీద ఏర్పరచుకోకూడదని ఆమెకు అర్ధం అయ్యింది.




ఇదే విషయం పురుషులలో కూడా ఉంటుంది. మా ఆవిడ గయ్యాళి ఎప్పుడు నా మాటే చెల్లాలని అంటుంది నేను పడలేక పోతున్నారా అని ఒక రామారావు తన స్నేహితుడు కృష్ణమరావు తో అన్నాడు. దానికి కృష్ణమరావు మిత్రమా నీకు నాగభూషణం భార్య సంగతి తెలుసా అని అన్నాడు ఆ ఆమెకేమి అందంగా ఉంటుంది వాడు అదృష్ట వంతుడు అని అన్నాడు. . నీకు అదే తెలుసు ఆమె భర్త ఆఫీసుకు వెళ్ళగానే హ్యాండు బ్యాగు వేసుకొని షాపింగుకి బయలుదేరుతుంది. ఆమె చేసే షాపింగుకు నాగభూషణం సంపాదన అంతా ఉష్కాకి అవుతుంది నిజం చెప్పాలంటే నాగభూషణంకు ఒక కప్పు కాఫీ తాగటానికి కూడా జేబులో డబ్బులు వుండవు తెలుసా అని అన్నాడు అప్పుడు రామారావుకి తన భార్య పొదుపుతనం జ్ఞ్యాపకానికి వచ్చింది ఏది కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి అది తప్పకుండా అవసరం ఐతేనే కానీ కొనదు. తననుకూడా దుబారా ఖర్చు చేయనీయదు. ఈ రోజు తాను తన సంపాదనతో ఒక సొంత ఇల్లు కొన్నాడంటే దానికి కారణం తన భార్య అని అనుకోని మనసులోనే భార్యను మెచ్చుకున్నాడు. నిజమే తానూ చాలా సార్లు విన్నాడు నాగభూషణం నోటి నుంచి నాకు ఈ నెల ఇంటి కిరాయి కట్టటానికి ఇబ్బందిగా వుంది కొంచం డబ్బులు సర్దు అని అడగటం. ఆలా తానుకూడా చాలా సార్లు నాగభూషణానికి ఇచ్చాడు. కొన్ని ఇచ్చాడు కొన్ని ఇవ్వలేదు. తనుకూడా అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు తెలిసిందిబాహ్య మెరుపులను చూసి బంగారం అని అనుకోకూడదని.




ఇలా వ్రాసుకుంటూ వెళితే నవలలకు నవలలు వ్రాస్తూ వెళ్ళవచ్చు. ఎందుకంటె మన సమాజంలో ప్రతి మనిషికి ఉండే సామాన్యమైన మనస్తత్వం ఒక్కటే అదే ఇతరులను పోల్చుకొని జీవించటం. ఇలా పోల్చుకునే విధానాన్ని వదిలి చుడండి తప్పకుండా మీరు సంతోషంగా ఉండగలరు. 




ఈ ప్రపంచంలో ఎవరి ఆర్ధిక పరిస్థితి వాళ్ళది ఎవరి మనస్తత్వం వాళ్ళది. ఏ ఒక్కరు కూడా వాళ్ళు అన్నదమ్ములే కావచ్చు లేక అక్కాచెల్లెళ్లు కావచ్చు ఇంకొకరి స్థితిగతులకు సమానంగా వుండరు నలుగురు పిల్లలు ఉంటే వకడు అందంగా ఉండవచ్చు ఒకడు అనాకారిగా ఉండవచ్చు ఒకడు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండవచ్చు మరొకడు ఏ పేరు లేకుండా తిండికి కూడా లేకుండా ఉండవచ్చు. అందుకేనేమో మనకు ఒక నానుడి వున్నది అదేమంటే " నేను వాళ్ళను కన్నాను కానీ వాళ్ళ రాతను కన్నానా" అని తల్లులు అంటూవుంటారు. ఇది ముమ్మాటికీ నిజం. 




ప్రతి మనిషి ఒకటి మాత్రం గుర్తుఉంచుకోవాలి అదేమిటంటే నాకు ఈ జన్మ భగవంతుడి ఇచ్చిన వరం. దీనిని నేను సద్వినియోగం చేసుకోవాలి అని సదా తలూస్తూవుండాలి అప్పుడే మదిలో చక్కటి భావాలు రేకెత్తుతాయి, జీవితం మంచి మార్గంలో పయనిస్తుంది. ఈర్ష్య, ద్వేషం, మొండితనం, అలసత్వం, సోమరితనం, ఇతరులమీద క్రుళ్ళుకోవటం, ఎదుటివాని ఎదుగలను చూసి అసూయపడటం మానుకోవాలి. ఈ ప్రపంచంలో భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దేనికి నీవు అర్హుడవో అదే నీకు లభిస్తుంది. ఈ విషయం తెలియక్ ప్రతివారు వారి అంతస్తుకు మించిన ఆలోచనలు చేసి అప్పులపాలు అయి చివరకు చతికిల పడతారు. సమాయణంలో ఇతరులముందు అబద్దపు డాంబికాలు (false prestage) పోయి అప్పులలో అనేక అవసరము వున్నా లేకపోయినా అనేక గృహయోపకారణాలను కొని నెలసరి వాయిదాలు సరిగా కట్టలేక చివరకు అప్పుల బాధలు పడలేక ప్రాణాలు తీసుకున్నవారు ఎందరినో మనం చూస్తూవున్నాము.  




నిజానికి మనిషి తనకు తానుగా తన స్థితి ఏమిటి సమాజంలో తన స్తానం ఏమిటి అని యోచించి తగిన విధంగా కట్టు, బొట్టు కలిగి మెసలుకోవాలి. నీవు పాత చొక్కావేసుకున్నావని సమాజం నిన్ను గౌరవించదని నీవు అనుకుంటే నీవు అప్పు చేసి డాంబికానికి పొతే చివరకు అప్పు తీర్చటానికి ఎవ్వరు నీకు సాయం చేయరు. కాబట్టి ప్రతి మనిషి తన ఆదాయం, ఖర్చు మీద సరైన జ్ఞ్యానం కలిగి తన ఆదాయానికి తగినట్లుగా తన ఖర్చులను నిర్ణయించుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి మహిళా చక్కగా పురుషులతో సమానంగా విద్య బుద్దులు కలిగి వుంటున్నది కాబట్టి తన గృహ నెలసరి ఖర్చుల విషయంలో భార్య భర్తలు కలిసి వారికి ఏవి అవసరమో, ఏవి అవసరము లేవో చక్కగా విశ్లేషణ చేసి ఒక ప్రణాళిక బద్దంగా ఆదాయ వ్యయాలను నిర్ణయించుకొని ప్రతినెల మిగులు బడ్జెట్ వచ్చేవిధంగా ఏర్పాటు చేసుకొని మిగిలిన ద్రవ్యంతో శాశ్విత ఉపకరణాలు అంటే, మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జి మొదలైనవి కొనుక్కుంటే సంసారం మూడు పూవులు ఆరు కాయలుగా ఉంటుంది. అదే భార్య ఒకటి భర్త ఒకటి అనుకుంటే జీవితం నరక సాదృశ్యం అవుతుంది. 




ఇక్కడితో ఈ కధనాన్ని ఆపితే అది సామాజిక పరమైన కధనంగా అనుకోవచ్చు కానీ ఇంకా కొంచం ముందుకు తీసుకొని వెళితే అప్పుడు దానిని ఆధ్యాత్మిక పరమైనదిగా అనుకోవచ్చు. అన్ని శాస్త్రాలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడనుండి ఆధ్యాత్మికత మొదలౌతుంది. అది మన మహర్షులు మనకు బోధించిన అనన్య సామాన్యమైన జ్ఞ్యాన సంపద 




ఫై కథనాన్ని చదివితే మనకు తెలిసేది ఏమిటంటే పోటీ తత్త్వం వలన మనకు అనేక అనర్ధాలు కలుగుతాయి అని. కానీ భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే పోటీ తత్త్వం ఏమి చెడ్డ గుణం కాదు నిజానికి నిజమైన పోటీ తత్త్వం ప్రతి సాధకుడు కాలిగి ఉండాలి. అదేమిటి ఇది సమాజానికి ఎలా హితవు కీడు అని కదా మనం తెలుసుకున్నాము అని అనుకోవచ్చు. ఆ పోటీ తత్త్వం సాటి మానవులను చూసి ఉండకూడదు మరి ఎవరిని చూసి ఉండాలంటే అది భగవంతుని చూసి భగవంతునితో పోటీ తత్త్వం కలిగి నిత్యం భగవంతుని ఆరాధిస్తూ అయన గుణాలను పొంది చివరకు కైవల్యం చెందాలి అది ఎట్లానో ఇంకొక కాండికలో తెలుసుకుందాం. 




ఓం తత్సత్ 




ఓం శాంతి శాంతి శాంతిః 




ఇట్లు 




మీ భార్గవ శర్మ .




ఇంకా వుంది

కామెంట్‌లు లేవు: