5, ఆగస్టు 2024, సోమవారం

పులిహోర

 పులిహోర

--------------

సీ||

  ఆంధ్రుల కభిమాన మైనదేదియనిన

     పులిహోర వరుసలో ముందు నిలుచు!

పండుగలేకాని పబ్బమ్ములే కాని

       పులిహోర లేనిచో వెలితి గలుగు!

చింతపులుసు గల్పి చేసిన పులిహోర

      జిహ్వకు రుచిగూర్చి శిరము నూపు!

పసుపు నిమ్మపులుసు పదిలముగా గల్ప

     కంటికింపును గూర్చు కలికి వలెను!

వేరుశనగ గుళ్లు వేసిన పులిహోర

        వడిగ తినగబోని వాడు గలడె?

చల్దియన్నము నైన చక్కగా కలుపుచో

      విసుగు చూపబోరు పిల్లలెపుడు!

ఇంగువ చూర్ణమ్ము నిసుమంత వేయుచు

    నల్లపు ముక్కల నమర గల్పి

ఊరమిరపకాయ,లుప్పును తగినంత,

    జీడిపప్పుల నందు చేర్చి కలిపి

శనగపప్పు మరియు చక్కగా కరివేప

    తాళింపు వేసిన తస్సదియ్య,

నారాయణునికిని నైవేద్య మిడుటకు

    పులిహోరకును సాటి కలదె భువిని?


తే.గీ||

ఆంధ్ర దేశాన నియ్యది అద్భుతమ్ము!

వాయ పైనను వాయను వదలకుండ

ఆరగించగ నుందురు నాంధ్రు లెపుడు!

వేయ దగినది పులిహోర  పెద్ద పీట!


-----------కోడూరి శేషఫణి శర్మ

కామెంట్‌లు లేవు: