5, ఆగస్టు 2024, సోమవారం

శ్రావణమాసం

 *పండుగలమాసం శ్రావణమాసం*


తెలుగు మాసాలలోని అతి పవిత్రమైన మాసాలలో శ్రావణమాసం ఒకటి ఈ మాసంలో ఉన్నన్ని పండుగలు వ్రతాలు ఇతర యే మాసంలోను ఉండవు.అందుకే శ్రావణమాసాన్ని శుభ శ్రావణమాసం అంటారు.


*శ్రావణమాసంలో పండుగలు*


*శ్రావణ శుద్ధ విదియ: అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి* 


*శ్రావణ శుద్ధ చతుర్థి: నాగుల చవితి* 


*శ్రావణ శుద్ధ పంచమి: గరుడ పంచమి,కల్కి జయంతి* 


*శ్రావణ శుద్ధ ఏకాదశి: పుత్రదా ఏకాదశి* 


*శ్రావణ శుద్ధ ద్వాదశి: రెండవ శుక్రవారం: వరలక్ష్మీ వ్రతం* 


*శ్రావణ శుద్ధ ద్వాదశి:  దామోదర ద్వాదశి.* 


*శ్రావణ శుద్ధ చతుర్దశి: వరాహజయంతి* 


*శ్రావణ పూర్ణిమ: రాఖీ పూర్ణిమ,హయగ్రీవ జయంతి* 


*శ్రావణ బహుళ విదియ: శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి* 


*శ్రావణ బహుళ చవితి: సంకటహర చతుర్ధి* 


*శ్రావణ బహుళ అష్ఠమి: కృష్ణాష్టమి* 


*శ్రావణ బహుళ ఏకాదశి: కామిక ఏకాదశి* 


*శ్రావణ అమావాస్య: పొలాల అమావాస్య* 


*⚜️🌹వరలక్ష్మీ వ్రతం🌹⚜️*

*******************************


శ్రావణ మాసం లో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.


*  *గరుడ పంచమి*

******************************


శ్రావణ శుద్ద పంచమిని గరుడపంచమి అంటారు. ఈరోజుననిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి పూజ. ఈరోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యంపోసి, వారి శక్తి మేర బంగారు,వెండి గరుడపక్షి ప్రతిమను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది.అంతేకాదు నాగదోషాలు,దుఃస్వప్నాలు వల్లకలిగే కీడును తొలిగిస్తుంది.


*🌹\|/ దామోదర వ్రతం \|/🌹* 

*******************************


శ్రావణ శుక్ల ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు.ఈ రోజున శ్రీమహావిష్ణువును వివిధ రకాల పూల మాలికలతో అలంకరించాలి. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించి, స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. మహా విశిష్టమైన ఈ రోజున శ్రీమహా విష్ణువుకి ప్రతీకగా చెప్పబడే సాలాగ్రామాన్ని దానంగా ఇవ్వడం మంచిది. దామోదర ద్వాదశి రోజున ఈ విధంగా చేయడం వలన మోక్షాన్ని పొందడానికి అవసరమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది.


* శ్రావణ శనివారములు 

*******************************


ఈ శ్రావణమాసంలోని శనివారాలలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా మహావిష్ణువు అవతారాలు పూజించడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శనివారం రోజున అఖండ దీపంవెలిగించి, ఉపవాసముఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేసి అష్టైశ్వర్యాలు పొందవచ్చు.


*🌹మంగళగౌరీ వ్రతం🌹*

********************************


శ్రావణ మాసమునందు ఆచరించ వలసిన వ్రతములలో  రెండవది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి.


*🐍శుక్లచవితి-నాగచతుర్థి🐍*

*************************************


దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈరోజుని నాగులచవితి పండుగలా నాగాపుజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.


*🌹శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి🌹*

*************************************


శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.


*🌝 శ్రావణ పూర్ణిమ–రాఖీపూర్ణిమ 🌝* 

************************************


అన్న/తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు.


🦄పూర్ణిమ–హయగ్రీవ జయంతి🦄

*************************************


ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టం.


*కృష్ణవిదియ-శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి* 

*************************************


మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతే కాదు. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర, శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడినది.


* కృష్ణపక్ష అష్టమి–శ్రీకృష్ణాష్టమి * 

*************************************


శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది.


*🌹కృష్ణపక్ష ఏకాదశి–కామిక ఏకాదశి🌹* 

*************************************


 ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేయాలని పెద్దలు అంటారు.దీనివలన మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.


*🌚 అమావాస్య–పోలాల అమావాస్య 🌚* 

*************************************


పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి,  పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

కామెంట్‌లు లేవు: