20, అక్టోబర్ 2024, ఆదివారం

అవతార ప్రకటన!

 అవతార ప్రకటన!  

-------------------------- 

         

  సీ:  చేతివిభూతితో  జీర్ణరోగాలకు 


                                      చిట్కావైద్యంబు  చేయువాఁడ ;


                కను చూపుతో  కల్పవృక్షాల  సృజియించి


                                                  కలిమికికాపులఁ  జేయువాఁడ ;


                 చిరునవ్వుతో  చేతనా చేతనములేలి  ,


                                               కరుణామృతంబును  గురియువాఁడ ;


                  నోటిమాటలతోఁడ   లోకాల  నాడించి 


                                                      నాటకరంగంబు  నడపువాఁడ ; 


        గీ: ఎవ్వరనుకొంటిరో  నన్ను?  నేననంత,


             శాంత మూర్తిని  కరుణా  నితాంత మూర్తి ,


           నాశ్రయించిన వారల నాదరించు  

!!

            సాయి బాబాను  సర్వార్ధ  సాధకుండ:!


              శ్రీ సత్యసాయి  భాగవత సత్కథామృతము. -తృతీయ స్కంథము:- స్వీయము !


                         ధర్మగ్లాని  కలిగినప్పుడు  సంభవామి  యుగే యుగే ! అని భగవద్గీతలో  కృష్ణ భగవానుడు చెప్పాడు. ఆప్రకారం అవసరానుసారంగా  యెన్ని యవతారా లెత్తాడో?  ప్రతీ అవతారానికీ  ఒకప్రత్యేకత  ఒకప్రయోజనం మనం అనుభవించాం.మంచిపనులు చేసి లోకానికి మేలుచేసిన వారి నందరినీ  మనం దైవాలుగానే  సంభావించాం. అలాంటి లోకోప కారక మైన అవతారాల్లో  శ్రీ  సత్యసాయి  యవతారమొకటి.


                                 పుట్టపర్తి యనే మారుమూల పల్లెలో  ఈశ్వరమ్మ  పెద వేంకమ రాజులకు 4 వ సంతానంగా సత్యసాయి

(సత్యనారాయణరాజు)  ఉదయించాడు.పుట్టినదాది మామూలు బాలురవలెగాక కొంత ప్రత్యేకతగా కనిపించేవాడు.తాతగారు  కొండమరాజుగారి   పెంపకంలో చక్కని యాధ్యాత్మక సంపత్తిని పొందాడు.బాలునిగా బుక్కపట్నంలో  చదివేరోజులలోనే  యేవేవో మహిమలు  చూపించేవాడు. 


                 కమలాపురం , ఉరవకొండ గ్రామాలలో  అన్న శేషమరాజు యింటివద్ద ఉంటూ విద్యాభ్యాసం  చేస్తోన్నరోజులలో  కొద్ది కొద్దిగా

     అతనిలో యేదో చెప్పలేని మార్పు కనబడ సాగింది. అతనిలో దివ్యత్వం వ్యక్తావ్యక్తంగా  ఉంటూవచ్చింది. ఇలాఉండగా ఉరవకొండలో  అతడొక తేలు  కాటుకు  గురియైనాడు. ఆవిషప్రభావంతో  రెండురోజులు సుప్తచేతనావస్థలో ఉండిపోయాడు. అదేతరుణంలో యేవేవో కలవరింతలు. మొత్తానికి కోలుకున్నతరువాత గూడా మామూలు మనిషికాలేదు. పదేపదే "నేను సాయిబాబాను"- నాకు నాగతం తెలిసిపోయింది. మీతో నాకుసంబమధంలేదు. " అంటూ ప్రక్కనున్న ఆబ్కారీ తోటకుపారిపోవటం,ఇలాజరగుతూ ఉండేది. అన్నగారు తలిదండ్రుల కీవిషయం తెలియ జేశాడు. వారువచ్చి  సత్యాన్ని పుట్టపర్తికి తీసికొనివచ్చి  పలు వైద్యాలు చేయించారు. కానీ ఫలితం  శూన్యం.*


                 సత్యం  తనలోతానేవో పాడుకోవటం. చుట్టూచేరిన వారికి  హస్తచాలనంతో  కలకండను  విభూతిని  సృష్టించి యిస్తూ ఉండటం .చివరకు ఇదియతని దినచర్యగా మారింది. 14 ఏండ్ల ప్రాయంవాడు యిలామారటం తలిదండ్రులకు తీరనివేదనకు కారణమైంది.

 అది 1940 సంవత్త్సరం అక్టోబరు 20వ తేదీ. సత్యం యధాప్రకారంగా  భజనానంతరం  చేయికదలించి  కలకండను ,విభూతిని సృష్టించి  భక్తులకు పంచి బెట్టుచుండగా  పెదవేంకమరాజు ( తండ్రి)చేతిలో ఒక దుడ్డుకర్ర పట్టుకొని,సత్యా న్ని అదలిస్తూ"  ఓరీ! యిదంతా

బూటకంరా! నాటకాలాడకు.లోకవంచన మహాపాపం. నిన్నేదో  దెయ్యమో భూతమో  ఆవహించిందిరా! నిజంచెప్పు నీవు దెయ్యానివా?

దేవతవా? నిజంచెప్పక పోయావో  యీదుడ్డుకర్రతో  బాదగలను"- అని మహరౌద్రంగా  పలుకగా,"  సత్యం పరమ శాంత చిత్తంతో" పుత్ర

మమకారంతో  మీరు నన్ను గుర్తింప లేకున్నారు. 


                                  నేను సాయి బా బాను. సాయి బాబానే! మహారాష్ట్రమున  తొలుత జననమంది. తదుపరి యిట నవతరించితిని. భక్తి శ్రధ్ధలతో  నన్ను పూజించు వారికి  సకల శుభములు. సకల సౌఖ్యములు కల్గును.ముమ్మాటికిది నిజమనెను.

వేంకమరాజు సంశయాస్పద చిత్తంతో  "  నీవు సాయివని మాకేమి నమ్మకము. నిదర్శన మెట్లు?అన్నాడు. సత్యం పూజార్ధమై  భక్తులు గొనివచ్చిన  మల్లెపూల తట్టను  నేలపైకి విసరాడు. చిత్రంగా ఆపూలన్నీ తెలుగున  "సాయి బా బా! " యను నక్షరములుగా రూపుదిద్దుకొన్నాయి. అది చూచినవారు ఆశ్చర్యంతో చేతులు జోడించి మ్రొక్కారు.


                              నాటినుండి  సత్యం  ' సత్యసాయిగా ' పిలువ బడినాడు. ఇదీ సత్యసాయి యవతార ప్రకటన కథ!


                              సత్యసాయిగా  ఉచిత విద్యావైద్య సదుపాయములకు. నీరులేని ప్రాంతములకు సత్యసాయి సుజల పథకముద్వారా మంచినీటి నందించటం. ప్రజలకు తాత్విక జ్ఙానోప దేశములు చేయటం, గ్రామ సేవ రామసేవ యనుపథకముద్వారా పల్లీయులకు మేలుగూర్చటం, ఇత్యాది అనేకానేక మహత్కార్యాల ద్వారా లోకోప కారంచేశారు.పుట్టపర్తిలోను,బెంగుళూరు లోను సూపర్ స్పెషాలిటీ  హాస్పటల్సద్వారా  సత్యసాయి సేవాసమితి నేడు చేయుచున్న సేవ  వెలలేనిది.


                              ఇట్టి లోకోపకారిని , విజ్ఙాన మూర్తిని , వేదాంత  దేశికుని , యుగావతారి  యనుట ఉచితమేగదా!


                శ్లో:  త్వవమేవ మాతాచ పితాత్వమేవ ,


                      త్వమేవ బంధుశ్చ  సఖా త్వమేవ,


                      త్వమేవ విద్యా ద్రవిణం  త్వమేవ ,


                       త్వమేవ  సర్వం  మ మ  సాయిదేవ!!


                        భగవాన్  శ్రీ సత్యసాయి  పదారవిందములకు  భక్తితో  సమర్పితము.


                                                        ఓం  శాంతిః  శాంతిః  శాంతిః

కామెంట్‌లు లేవు: