21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

13-33-గీతా మకరందము

 13-33-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


యథా సర్వగతం సౌక్ష్మ్యాత్

ఆకాశం నోపలిప్యతే | 

సర్వత్రావస్థితో దేహే 

తథాఽ౽త్మా నోపలిప్యతే || 


తాత్పర్యము:- సర్వత్రవ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుటవలన ఏ ప్రకారముగ (ధూళిమున్నగువానిచే) అంటబడదో, ఆ ప్రకారమే శరీరమందంతటను (లేక, సకలశరీరములందును) వెలయుచున్న పరమాత్మ (శరీర గుణదోషములచే) అంటబడకనున్నాడు.


వ్యాఖ్య:- దృశ్య ప్రపంచములో అతిసూక్ష్మమైనవస్తువు ఆకాశము. కావున దానిని దృష్టాంతముగ తీసికొని ఆత్మయొక్క నిర్లేపత్వ, సర్వవ్యాపకత్వ, సూక్ష్మత్వ, నిర్మలత్వములు బోధింపబడినవి. చిన్నచిన్న ఉపమానములద్వారా గొప్పగొప్ప బోధలను తెలియజెప్పుట గీతయొక్క ఒకానొక విశిష్టత. ఆకాశము అని చెప్పినందువలన ఆత్మ ఆకాశమని యెవరును భావింపరాదు. ఆకాశమువలె అతిసూక్ష్మమైనదని మాత్రమే ఎఱుంగవలయును. ఆకాశము బురద మొదలగువానియందు వ్యాపించియున్నను, వానిగుణదోషములచే అంటబడనట్లు, ఆత్మయు దేహమందంతటను వ్యాపించియున్నప్పటికిని, దాని సుఖదుఃఖాదులచేగాని, జననమరణాదులచేగాని ఏ మాత్రము అంటబడదు. మఱియు మేఘమునందు ఎన్ని మెఱుపులు, పిడుగులు, నీరు, వడగండ్లు, నలుపుదనము, శీతలత్వము మొదలైనవియున్నను, ఆకాశమునకు ఆ గుణదోషములు ఏవియు అంటనట్లు ఆత్మకున్ను శరీరసంబంధ, మనస్సంబంధ, సుఖదుఃఖాదులు ఏమాత్రమున్ను అంటనేరవని చక్కగ భావనజేసి గంభీరాత్మస్వరూపుడుగ సాధకుడు స్థితుడై యుండవలెను. తాను వాస్తవముగ ఆత్మస్వరూపుడే కావున తనను దేహమునకు సాక్షిగాను, దేహాతీతుడుగాను చింతన జేయుచు దేహసంబంధబంధముగాని, సుఖదుఃఖాదులుగాని తనకు లేవని తలంచి గంభీరముగ, నిర్భయముగ, ఆనందముగ నుండవలెను.

"సర్వత్రావస్థితో దేహే" - అని చెప్పినందువలన, (వెనుకటి శ్లోకమునందు తెలుపబడిన విధముగ) భగవంతుడు అతిసమీపమున - శరీరముననే - వర్తించుచున్నాడు. కావున పవిత్రాచరణచే వారిని హృదయమందే సాక్షాత్కరించుకొనవలయును. శరీరము దేవనిలయము, దేవసన్నిధి యని భావించి దుష్కృత్యములను, పాపకార్యములను, పాపసంకల్పములను దరికి జేర్చరాదు. మఱియు ఏజాతివారైనను, ఏమతమువారైనను, స్త్రీయెనను, పురుషుడైనను తనశరీరమున దేవదేవుడగు జగన్నాథుడు నివసించుచున్నాడని నిశ్చయించి ధైర్యోపేతులై వారిని సాక్షాత్కరించుకొనుటకు శీఘ్రముగ యత్నించవలెను. అతడు దేహమున ఎక్కడున్నాడోయని పంచకోశములను వెతకి వెతకి, మనస్సును శోధించి తుదకు అతనిని కనుగొనుటలో విజయముగాంచవలెను. ప్రయత్నశీలునకు అతడు దొరికియేతీరును.


ప్రశ్న:- పరమాత్మయొక్క స్వభావమేమి?

ఉత్తరము:- ఆతడు శరీరమందున్నను ఆకాశమువలె నిర్లేపుడై, దేహసంబంధ సుఖదుఃఖాదులచే ఏ మాత్రము అంటబడకనుండును.

కామెంట్‌లు లేవు: