21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

తిరుమల సర్వస్వం -156*

 *తిరుమల సర్వస్వం -156*

*స్వామి పుష్కరిణి -3*



 *సరస్వతి దేవియే స్వామిపుష్కరిణి* 


 *గంగ-యమున-సరస్వతి నదుల సంగమాన్ని త్రివేణి సంగమం* గా వ్యవహరిస్తారు. ప్రయాగ పుణ్యక్షేత్రం వద్ద గంగాయమున సంగమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు గానీ, అంతర్వాహినిగా ప్రవహిస్తుండటం వల్ల సరస్వతీ నదిని మనం దర్శించుకోలేము. 


 తాను కూడా గంగానది వలె బహిర్గతమై, భక్తుల పాపాలను నశింపజేయాలనే ప్రగాఢమైన కోరిక గలిగిన సరస్వతి తన వాంఛను సిద్ధింపచేసుకోవడం కోసం నదీ రూపంలోనే వేంకటాచలానికి విచ్చేసి ఘోర తపస్సు నాచరించింది. సరస్వతిదేవి ధ్యానమగ్నయై ఉన్న తరుణంలో బ్రహ్మమానస పుత్రుడు, రావణుని తాత యైన పులస్త్యబ్రహ్మ కూడా వేంకటాచలానికి యేతెంచుతాడు. ధ్యానంలో ఉన్న సరస్వతిదేవి పులస్త్యుని రాకను గమనించక పోవడంతో, పులస్త్యుడు కృద్ధుడై, అహంభావంతో, సరస్వతి దేవి ఏ కార్యసిద్ధి కోసం తపస్సు చేస్తోందో అది నెరవేరదనీ, ఎన్నటికీ సరస్వతీనది గంగానదితో సమానురాలు కాలేదని శపిస్తాడు. 


 దానికి ప్రతిగా, సరస్వతీనది, పులస్త్యుడు బ్రహ్మదేవుని సతీమణి అయిన తనకు వరుసకు పుత్రుడని, తనయుని గౌరవ మర్యాదలతో ఆదరించవలసిన అగత్యాన్ని శాస్త్రం తల్లికి ఆపాదించలేదని తర్కపూరితంగా సమాధానమిస్తుంది. అంతే గాకుండా, తపోనిష్ఠలో ఉన్న మాతృమూర్తికి తమోగుణంతో శాపమిచ్చి, రాక్షసునిలా ప్రవర్తించి నందువల్ల పులస్త్యుని వంశం రాక్షసులతో అంతమవుతుందని కూడా తిరుగు శాపమిచ్చింది. శాపభయంతో అహంకారాన్ని విడనాడిన పులస్త్యుడు, మాతృమూర్తి యైన సరస్వతి దేవి పాదాలకు ప్రణమిల్లి ప్రాధేయ పడగా, పులస్త్యుని వంశము నందు తరువాతి తరంలో జన్మించిన ముగ్గురు రాక్షసులలో ఇద్దరు హరిద్వేషులైన పాపాత్ములుగా మారినప్పటికీ, ఒక్కరు మాత్రం శ్రీమహావిష్ణువుకు చేరువవుతారని శాపాంతరం చెబుతుంది. 


‌ సరస్వతీదేవి పులస్త్యుని కిచ్చిన శాపము-వరము ఫలితంగా, పులస్త్యునికి రావణ కుంభకర్ణులతో బాటు విభీషణుడు కూడా జన్మించి, శ్రీరామచంద్రునికి ఆప్తుడు, పరమభక్తునిగా మారి లంకారాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు. 


 పులస్త్యుని శాపం కారణంగా బహిర్గతమై భక్తులను ఉద్ధరించాలన్న తన సంకల్పం నెరవేరక పోవడంతో తీవ్రమైన అసంతృప్తికి గురియైన సరస్వతి దేవికి విష్ణుమూర్తి వరమిస్తాడు. ఆ వరమహిమతో సరస్వతీ నది త్రివేణీ సంగమంలో ప్రకటితమవ్వ లేక పోయినప్పటికీ; ఆనాడు సరస్వతిదేవి వేంకటాచలం పై ఏ ప్రదేశంలో తపస్సు నాచరించిందో, ఆ ప్రదేశంలోనే స్వామిపుష్కరిణిగా ఆవిర్భవించింది. అంతే గాకుండా, గంగానది ఈ పర్వతం మీదకు రాదని కూడా విష్ణుమూర్తి అభయమిస్తాడు. వారి ఆదేశానుసారం, భక్తులు స్వామిపుష్కరిణిలో స్నానమాచరించిన తరువాతనే శ్రీనివాసుణ్ణి దర్శించుకోవాలి. అప్పుడే తిరుమలయాత్ర సంపూర్ణ ఫలాన్నిస్తుంది. అంతే కాకుండా, సరస్వతీ తీర్థంలో స్నానమాడితే మహా పాపాలు సైతం నశిస్తాయి.


 సరస్వతిదేవి స్వామి పుష్కరిణిగా ప్రకటితమైన ప్రదేశంలోనే సాళువ నరసింహరాయలు *నీరాళి మంటపాన్ని* నిర్మించాడు. స్వామిపుష్కరిణికి మధ్యభాగంలో ముగ్ధమనోహరంగా విలసిల్లుతున్న ఈ మండపం లోనే శ్రీవారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. 


 ఆదివరాహుని అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు ఆనతి మేరకు, వారి వాహనమైన గరుత్మంతుడు వైకుంఠం నందలి క్రీడాద్రి పైనున్న *"క్రీడావాపి"* అనే జలాశయాన్ని క్రీడాద్రితో పాటుగా భూలోకానికి తోడ్కొనివచ్చి వెంకటాచలం పై స్థాపించాడు. సుదీర్ఘకాలంపాటు వేంకటాద్రి శిఖరాంతర్భాగంలో నిక్షిప్తమై ఉన్న క్రీడావాపి, సరస్వతి దేవికి శ్రీమహావిష్ణువు ఒసగిన వరప్రభావం చేత, అదే ప్రదేశంలో బహిర్గతమై స్వామిపుష్కరిణి గా అవతరించింది. శ్రీనివాసుడు దేవేరులతో కలిసి ఈ పుష్కరిణిలో జలక్రీడలాడినందువల్ల అది గంగానది కంటే అత్యంత పవిత్రమైనదిగా పేరుగాంచింది. ఈ పుష్కరిణి దర్శనమాత్రం చేతనే జన్మజన్మల పాపాలు నశించి సమస్త భోగభాగ్యాలు ఒనగూడుతాయి.


*స్వామిపుష్కరిణి స్నానం సద్గురోః పాదసేవనమ్* 

*ఏకాదశీవ్రతం చాపి త్రయ మత్యంత దుర్లభమ్* 

*దుర్లభం మానుషం జన్మ దుర్లభం తత్ర జీవనమ్* 

*స్వామిపుష్కరిణీ స్నానం త్రయ మత్యంత దుర్లభమ్*


 అనగా - *స్వామిపుష్కరిణి స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం ఈ మూడు సత్కార్యాలు మానవజన్మలో లభ్యం కావడం అత్యంత దుర్లభం. అలాగే మానవజన్మ లభించడం, మానవునిగా మనుగడ సాగించడం, ఆ మానవజీవితంలో స్వామిపుష్కరిణి యందు స్నానమాచరించడం అనే కార్యాలు కూడా దుర్లభాలని వరాహపురాణం చాటుతోంది. దీనిని బట్టి స్వామిపుష్కరిణిలో పవిత్రస్నాన మాచరించడం ఎంతటి మహత్తరమైన పుణ్యకార్యమో తేటతెల్ల మవుతుంది.*


[ రేపటి భాగంలో... *చరిత్ర పుటల్లో స్వామి పుష్కరిణి* గురించిన విషయాలు తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: