21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*295 వ రోజు*


*పాండవులను జయద్రధుడు ఎదుర్కొనుట*


ధృతరాష్ట్రునికి సమాధానంగా సంజయుడు ఇలా చెప్పసాగాడు " మహారాజా ! పాండవ ప్రముఖులు అభిమన్యునికి సాయంగా పద్మవ్యూహంలో ప్రవేశించి కురుసేనను నిర్మూలించడం మొదలు పెట్టారు. అది చూసిన కౌరవ యోధులు నిశ్చేష్టులు అయ్యారు. పాంచాల, మత్స్య, యాదవ, కేకయ ప్రముఖులు ధర్మరాజుకు తోడుగా నిలిచి పోరాడుతున్నారు. అప్పుడు సైంధవుడు పాండవులను ఎదుర్కొన్నాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు " అదేమిటి సైంధవుడు మహావీరుడే అయినా అతడు పాండవులను ఎదుర్కొనడమేమిటి. అంతటి శక్తి రావడానికి అతడు చేసిన తపస్సేమిటి " అన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో " మహారాజా ! పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఒక రోజు సైంధవుడు భీముని చేతిలో ద్రౌపది కారణంగా భంగపడ్డాడు కదా ! ఆ అవమానం భరించ లేక ఈశ్వరుని గురించి తపస్సు చేసి ప్రసన్నుని చేసుకుని పాండవులను జయించు వరం కోరాడు. అందుకు శివుడు " అర్జునుడిని తప్ప మిగిలిన వారిని ఒక్క రోజు మాత్రం నివారించ గలవు " అని వరం ప్రసాదించాడు. ఆ వర ప్రభావంతో సైంధవుడు పాండవులను అడ్డగించగలిగాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించగానే సైంధవుడు వర ప్రభావం కారణంగా వారిని అడ్డుకుని మూడు బాణములతో సాత్యకిని, ఎనిమిది బాణములతో ధృష్టద్యుమ్నుని, ఇరవై బాణములతో, విరాటుని, పది బాణములతో శిఖండిని, ఏడు బాణములతో పాంచాల భూపతిని, పదిహేను బాణములతో దరుపదీ సుతులను, ఇరవై అయిదు బాణములతో క్వేకయరాజులను, డెబ్బై అయిదు బాణములతో ధర్మరాజుని కొట్టాడు. ధర్మరాజు సైంధవిని విల్లు విరిచి అతడిపై అతి క్రూర బాణములు గుప్పించాడు. సైంధవుడు మరొక విల్లు అందుకుని మంటలు విరజిమ్మే బాణములను ధర్మజుని పైన అతడి అనుచరముల పైన వేసాడు. భీమసేనుడు సైంధవుని ఎదుర్కొని మూడు బాణములతో అతడి విల్లును, కేతనమును, ఛత్రమును విరిచాడు. నీ అల్లుడు మరొక బాణమును చేతబట్టి భీముని ఛత్రమును, కేతనమును, కేతరుగకొట్టానమును, రథమును విడు. రథము విరిగిన భీముడుపక్కనే ఉన్న సాత్యకి రథము ఎక్కి సైంధవునిపై అనేక అస్త్రములు వేసాడు. సైంధవుడు వాటిన్నటిని మధ్యలోనే త్రుంచి పాండవ సేన మీద అతికౄర నారాచములు వేసాడు. సైంధవుని అస్త్ర ధాటికి తట్టుకోలేని పాండవసేన పారిపోయింది. ఈ ప్రకారం సైంధవుడు పాండవ సేనను పద్మవ్యూహములో ముందుకు పోకుండా అడ్డుకున్నాడు. పాండవులకు సైంధవునకు సమరం ఘోరంగా సాగుతుంది.


*అభిమన్యుని శౌర్యం*


ద్రోణుని ప్రోత్సాహంతో వెనుతిరిగిన కౌరవ సైన్యం తిరిగి వచ్చి అభిమన్యుని చుట్టుముట్టి అతడి మీద బాణములు గుప్పించారు. అభిమన్యుడు వారిని అందరిని సంహరించి సింహఘర్జన చేసి కౌరవ సేనలో భయోత్పాతాలు సృష్టించాడు. వృషసేనుడు తన సైన్యంతో అభిమన్యుని ఎదుర్కొని క్రూరనారాచములు ప్రయోగించాడు. అభిమన్యుడు కోపంతో వృషసేనుని కేతనము విరిచి, అశ్వములను గాయపరిచాడు. వృషసేనుడి శరీరం అంతా పదునైన బాణములు దింపి మూర్చిల్ల చేసాడు. అతడి రథమును ఈడ్చుకుంటూ రథాశ్వములు ఎటో తీసుకు వెళ్ళాయి. ఇంతలో శౌర్యధనుడైన వసాపతి భూపతి ఆరు బాణములతో అభిమన్యుని కొట్టాడు. అభిమన్యుడు ఒకే బాణంతో వసాపతి భూపతిని కొట్టాడు. అతడి చావు చూసిన కురుప్రముఖులు తమ సైన్యాలతో అభిమన్యునిపై లంఘించి అభిమన్యుని క్రోధాగ్నిలో కార్చిచ్చులో పడిన మిడుతల వలె మాడి పోయారు. కురుసేన అభిమన్యుని ధాటికి ఆగలేక మిగిలిన పారిపోయారు. అది చూసిన కురు వీరులు యోధులు నానాదేశ రాజులు అందరూ ఆలోచించుకుని ఒక్కుమ్మడిగా అభిమన్యుని మీదకు ఉరికారు. అభిమన్యుడు లేళ్ళ గుంపు మీదకు ఉరికిన పులి వలె వారి మీదకు లంఘించి వారందరిని మట్టుబెట్టాడు. తెగి పడిన అంగములు, మాంస ఖండములు, ఏనుగులు, హయములు, కళేబరములు రణరంగం అంతా చెదిరి పడ్డాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: