14, ఫిబ్రవరి 2025, శుక్రవారం

తిరుమల సర్వస్వం -149*

 *తిరుమల సర్వస్వం -149*

*తొండమాన్ చక్రవర్తి -4*



 *శ్రీనివాసుడెటు వైపు?* 


 తొండమానుడు, వసుదానుడు ఇరువురికీ ఆత్మీయుడైన శ్రీనివాసుడి సహాయాన్ని ఇద్దరూ అర్థిస్తారు. ఇద్దరూ శ్రీనివాసునితో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చి, శ్రీనివాసుని సహాయాన్ని పొందే హక్కు తమకే ఉన్నదని విన్నవించుకుంటారు. ఇద్దరూ తనకు ఆప్తులవ్వడంతో, ఎటూ పాలుపోని శ్రీనివాసుడు, పద్మావతీదేవిని తగిన పరిష్కారం సూచించ వలసిందిగా సంప్రదిస్తాడు. తాను ఒంటరి వాడినని, ఇద్దరికీ సహాయపడ లేనని, ఇరువురూ పద్మావతీదేవికి అత్యంత సన్నిహితులే కనుక ఆమె చెప్పిన ప్రకారమే నడుచుకుంటానని తుది నిర్ణయం ఆమెకే వదిలేశాడు. 


 పద్మావతి అమ్మవారు, అటు పితృతుల్యుడైన పినతండ్రి ఇటు పుత్రసమానుడైన ముద్దుల తమ్ముడు, ఎవరిపక్షం వహించాలో తెలియక సందిగ్ధంలో పడుతుంది. సుదీర్ఘంగా, ధర్మసమ్మతంగా ఆలోచించి ఈ విధంగా తన అభిప్రాయం వ్యక్త పరుస్తుంది: 


 *"పెద్దవయస్కుడైన తొండమానుడు పరాక్రమవంతుడు. తనను తాను రక్షించుకో గలిగిన సమర్థుడు. ఇటు తండ్రిని కోల్పోయి, చిన్నవయసులో ఉన్న వసుదానుడు తనను తాను కాపాడుకోలేని నిర్భలుడు. యుగయుగాలుగా అనాథలు, బలహీనులను అక్కున జేర్చుకున్న శ్రీనివాసుడు వసుదానునికే సాయమందించటం ఉచితం."* అని ధర్మాధర్మ విచక్షణ చేసి తమ్ముని పక్షాన్ని వహించమని శ్రీనివాసునిణ్ణి వేడుకుంటుంది.


 *ధర్మసంకటంలో పడ్డ శ్రీనివాసుడేం నిర్ణయించుకున్నాడు? శరణాగతులెవ్వరినీ నిరాకరించని శ్రీవేంకటేశ్వరుడు వైరిపక్షాలలో ఉన్న ఇద్దరినీ ఎలా అనుగ్రహించాడు?*


 పద్మావతీదేవి శెలవిచ్చినట్లు, యుద్ధరంగంలో పిన్న వయస్కుడైన తన బావమరిది వసుదానుని పక్షం వహించడమే శ్రీనివాసునికి సమంజసంగా తోచింది. 


 *అయితే,,, తొండమానుడు ఏ ధైర్యంతో ముల్లోకాలలో ఎదురులేని శ్రీనివాసుణ్ణి ఎదుర్కోవడానికి తలపడ్డాడు?*


 *తానొకవైపు - శంఖుచక్రాలు మరోవైపు* 


 అయితే తన పరమభక్తుడు, పద్మావతీదేవితో తన కళ్యాణాన్ని సుగమం చేసిన వాడు అయిన తొండమానుణ్ణి ఉపేక్షించడం ఎలా? ఇలా తర్జన భర్జన పడిన అనంతరం, ఉభయతారకంగా ఉండేట్లు ఒక నిర్ణయానికి వచ్చాడు. తాను మాత్రం వసుదానుని తరఫున యుద్ధం చేస్తూ, తన ఆయుధాలైన శంఖుచక్రాలను తొండమానుని సహాయార్థం పంపించాడు. శ్రీకృష్ణపరమాత్ముడు తాను పాండవపక్షం వహించి తన సమస్తసైన్యాలను కౌరవులకు బాసటగా నిలిపిన మహాభారత యుద్ధం జ్ఞప్తికి వచ్చేలా; అత్యంత భీకరంగా జరిగిన వసుదానుడు తొండమానుల యుద్ధంలో, శ్రీనివాసుడు రౌద్రరూపం దాల్చి తొండమానుని సేనలను కకావికలం చేశాడు. తొండమానుడు ఉక్రోషంతో వసుదానునిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించగా, వసుదానుణ్ణి రక్షించబోయిన శ్రీనివాసుడు చక్రం దెబ్బకు మూర్ఛిల్లాడు. ఇరుపక్షాల వారు శ్రీనివాసుని శ్రేయోభిలాషులు కావడంతో జోరుగా సాగుతున్న యుద్ధానికి కొంత విరామమిచ్చి స్వామివారికి సపర్యలు చేయసాగారు. -



 *ఉభయతారకమైన  ఒప్పందం* 


 శ్రీనివాసుడు గాయపడ్డ విషయం తెలుసుకున్న పద్మావతీదేవి అగస్త్యునితో సహా యుద్ధరంగానికేతెంచి, తగిన ఉపచారాలు చేసి, శ్రీనివాసుణ్ణి తెప్పరిల్ల జేసింది.


 అప్పటికే ఇరుప్రక్కలా జరిగిన విశేష జననష్టానికి కలత చెందిన పద్మావతి వైరిపక్షాల మధ్య 'సంధి' చేయవలసిందిగా శ్రీనివాసుణ్ణి వేడుకొంటుంది. మొదట్లో కొంచెం వెనుకాడినప్పటికీ అగస్త్యముని కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో, శ్రీనివాసుడు ఇరువురికి ఆమోద యోగ్యమైన ఒడంబడికను ప్రతిపాదిస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం ఆకాశరాజు సామ్రాజ్యం రెండు భాగాలుగా విభజింప బడుతుంది. నారాయణవనం రాజధానిగా గల భాగం వసుదానునికి దక్కగా, తొండమనాడు రాజధానిగా గల మరొక భాగం తొండమానుని వశవుతుంది. ఆ విధంగా, సుధర్మమహారాజు తన భార్యయైన నాగకన్యకు ఇచ్చిన వాగ్దానం శ్రీనివాసుని ద్వారా సాకార మవుతుంది. తానే దగ్గరుండి సైన్యాన్ని, ధనాగారాన్ని సమభాగాలుగా విభజింపజేసిన శ్రీనివాసుడు, ఇరువురూ సంతుష్టులైన తరువాత పద్మావతీ సమేతంగా తిరిగి అగస్త్యాశ్రమాన్ని చేరుకుంటాడు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: