*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము*
*288వ రోజు*
*సుప్రీతకంను ఆపాలని వెళుతున్న అర్జునుని సంశక్తులు అడ్డగించుట*
దూరం నుండి సుప్రీతకం చేస్తున్న విధ్వసాన్ని చూసిన అర్జునుడు కృష్ణునితో " కృష్ణా ! భగదత్తుని గజము సుప్రీతకం పాండవ సేనను చిన్నాభిన్నం చేస్తుంది. ఎవరూ ఎదుర్కోలేక పోతున్నాడు. మనం లేక పోవడంతో ధర్మరాజాదులు ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా ! మన రధమును వెంటనే భగదత్తుని వైపు మళ్ళింపుము " అన్నాడు. కృష్ణుడు రథమును భగదత్తుని వైపు మళ్ళించాడు. ఇంతలో సంశక్తులు వీరాలాపములు పలుకుతూ పదునాలుగు వందలమంది కృష్ణార్జునులను చుట్టుముట్టి శరవర్షం కురిపించారు. అర్జునుడు " కృష్ణా ! మన బలమును తరువాత చూసుకోవచ్చు ముందు సంశక్తులను వధించాలి " అన్నాడు. శ్రీకృష్ణుడు రథమును సంశక్తుల వైపు మళ్ళించాడు. అర్జునుడు గాండీవం సంధించి దేవదత్తము పూరించి దివ్యమైన బాణములను సంశక్తులపై ప్రయోగించాడు. అర్జునుడి అస్త్రధాటికి రథ, గజ, తురగములు నాశనం ఔతున్నాయి. పదాతి దళముల తలలు ఎగిరి పడుతున్నాయి. కాళ్ళు చేతులు తెగిపడుతున్నాయి. అర్జునుడి విజృంభణ చూసి కృష్ణుడు ప్రశంసించాడు. కృష్ణుని ప్రంశలకు పొంగి పోయిన అర్జునుడు మరింత ఉత్సాహంతో విజృంభించి సంశక్తుల సేనను సర్వ నాశనం చేసాడు. అర్జునుడు కృష్ణునితో " ఇక్కడ సంహారం పూర్తి అయింది. రధమును మనసేన వైపు మళ్ళించు " అన్నాడు. కృష్ణుడు రథమును మళ్ళించగానే సంశక్తులు వెనుక నుండి " అదేమిటయ్యా ! మేము యుద్ధానికి పిలుస్తుంటే పారిపోతున్నావు " అని అరిచారు. " కృష్ణా ! యుద్ధానికి పిలుస్తుంటే మరలి పోవడం వీరుల లక్షణం కాదు. మన సైన్యం దైన్య స్థిలో ఉంది. నాకు సరి అయిన మార్గం తోచడం లేదు. నీవే తగు నిర్ణయం తీసుకో " అన్నాడు. కృష్ణుడు మారు మాటాడక సంశక్తుల వైపు రథాన్ని మళ్ళించాడు. అర్జునుడు మహోగ్రంతో త్రిగర్తుని విల్లు త్రుంచి కేతనము విరిచాడు. త్రిగర్తుని సోదరులను చంపాడు త్రిగర్తుడు మూర్చపోయాడు.
*అర్జునుడు సుప్రీతకమును భగదత్తును ఖండించుట*
ఇంతలో పాండవ సేనలు పారిపోవడం చూసిన అర్జునుడు " కృష్ణా ! అటు చూడు సుప్రీతకం ధాటికి ఆగలేని మన సేనలు పారిపోతున్నాయి . రధమును అటు మళ్ళించు " అన్నాడు. శ్రీకృష్ణుడు అమిత వేగంతో రథమును పాండవ సేన వైపు పరుగెత్తించాడు. అర్జునుడు దేవదత్తము పూరించి భగదత్తుని మీద కరకుటమ్ములు ప్రయోగించి సుప్రీతకముకు ఎదురుగా నిలిచాడు. భగదత్తుడు అర్జునుడిపై ఉగ్రమైన బాణములు ప్రయోగించాడు. అర్జునుడు చిరునవ్వుతో వాటిని ముక్కలు చేసి భగదత్తుని మీద సుప్రీతకం మీద అతి దృఢమైన బాణ ప్రయోగం చేసాడు. ఆ బాణములు సుప్రీతకమును నొప్పించడంతో కృష్ణార్జునుల వైపు అతి వేగంగా దూకింది. సుప్రీతము ధాటికి కృష్ణార్జునులు ప్రాణాలు కోల్పోయారన్న వార్తతో పాండవ సేనలో హాహాకారాలు చెలరేగాయి. అప్పుడు కృష్ణుడు రథమును పక్కకు తప్పించంతో అది సేనలో దూసుకు పోయి వందల కొద్ది సైనికులను కాళ్ళతో తొక్కి చంపింది. ఇది చూసిన అర్జునుడికి కోపం వచ్చినా మనసులోనే అణచుకుని " కృష్ణా ! మన రధమును సుప్రీకం ఎదురుగా నిలుపుము " అన్నాడు
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి