☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(52వ రోజు)*
*(నిన్నటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*సూర్య చంద్రవంశాలు*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*తన స్త్రీత్వం పోగొట్టమని సుద్యుమ్నుడు వశిష్ఠుని వేడుకున్నాడు.*
*వశిష్ఠుడు, శివుని ఆశ్రయించి, సంగతంతా వివరించాడు. సుద్యుమ్నను సుద్యుమ్నుని చేయమని ప్రార్థించాడు.*
*శివుడు కరుణించాడు. అయితే తన మాట పొల్లుపోకూడదని, వరాన్ని ఇలా ప్రసాదించాడు. సుద్యుమ్నుడు ఒక నెల స్త్రీగానూ, ఒక నెల పురుషుడిగానూ ఉంటాడన్నాడు.*
*అలా ఉంటూనే సుద్యుమ్నుడు రాజ్యపాలన చేయసాగాడు. ప్రజలకి అది నచ్చలేదు. సుద్యుమ్నుడికి ఉత్కలుడు, గయుడు, విమలుడు అని ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు ఉత్తరపథాన్ని పరిపాలించసాగారు.*
*సుద్యుమ్నుడికి ముసలితనం వచ్చింది. పరిపాలనకు తను అనర్హుడనుకున్నాడు. కొడుకు పురూరవుడికి రాజ్యాన్ని అప్పగించి, తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్ళిపోయాడు.*
*సుద్యుమ్నుడు అలా అడవుల్లో తేలాడని తెలిసి, చాలా బాధపడ్డాడు వైవస్వతుడు. మళ్ళీ కొడుకు కావాలని, యమునాతీరంలో తపస్సు చేయసాగాడు. నూరేళ్ళు చేశాడు తపస్సు.*
*అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. అతని కోరిక తీర్చాడు. భగవదనుగ్రహంతో వైవస్వతునికి ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, కరూశకుడు, అరిష్యంతుడు, వృషద్రుడు, నభగుడు, కవి తదితరులయిన పదిమంది కొడుకులు పుట్టారు. వారితో మనుసంతతి విస్తారమయింది.*
*ఇక్ష్వాకుడు సూర్యవంశానికి మూలపురుషుడయినాడు. ఈ సంతతిలో హరిశ్చంద్రుడు, రఘువు, అజుడు, దశరథుడు, శ్రీరాముడు మొదలయిన వారంతా జన్మించారు.*
*ఇలకూ(సుద్యుమ్నుడు) బుధునకూ జన్మించిన పురూరవుడు చంద్రవంశానికి మూలపురుషుడయినాడు. ఆ వంశం కూడా అభివృద్ధి చెందింది.*
*సుకన్య:~*
*వైవస్వత మనువు కుమారుడయిన శర్యాతి వేదార్థతత్త్వవిదుడు. అతనికి ఓ కుమార్తె జన్మించింది. ఆమె పేరే సుకన్య. శర్యాతి ఒకనాడు, సుకన్యను వెంటబెట్టుకుని, వనవిహారానికి బయలుదేరాడు. చ్యవనమహాముని ఆశ్రమాన్ని సందర్శించాడు. తండ్రిని వదలి, సుకన్య ముందుకు పరుగుదీసింది. చెట్లు, పొదరిళ్ళ మధ్య విహరిస్తూ ఒక చోట ఓ పుట్టను చూసిందామె. ఆ పుట్టలో మిణుగురులా మెరస్తూ రెండు జ్యోతులు కనిపించాయి.*
*అవేమిటో? వాటిని తెలుసుకోవాలనుకున్నది సుకన్య. పక్కన పడి ఉన్న ఓ ముల్లు తీసుకుని, వాటిని పొడిచి చూసింది. పొడిచిన మరుక్షణం ఆ జ్యోతులు రక్తాన్ని స్రవించసాగాయి.*
*సుకన్యకి ఏదీ అంతుచిక్కలేదు. భయం కలిగిందామెకు. ఇంతలో శర్యాతికీ, అతని వెన్నంటి వచ్చిన పరివారానికీ మలమూత్రాలు ఆగిపోయాయి. నిరోధించినట్టుగా నిలచిపోయాయి. ఎందుకిలా జరిగిందన్నది విచారించాడు శర్యాతి.*
*మాకు తెలియదంటే మాకు తెలియదని అంతా చేతులు జోడించారు. సుకన్య అప్పుడు కలుగజేసుకుని, ముల్లు తీసుకుని, పుట్టలో పొడిచిన సంగతంతా వివరించింది. ఎంత పని చేశావన్నాడు శర్యాతి. తలపట్టుకున్నాడు. జరిగిందేమిటంటే...*
*భార్గవ మునీంద్రుడు చ్యవనుడు, తపస్సు చేసుకుంటున్నాడు. అతని చుట్టూ పుట్ట పెరిగింది. ఆ పుట్టలోంచి జ్యోతుల్లా కనిపించినవి అతని కళ్ళే! అవి కళ్ళని తెలియక సుకన్య ముల్లుతో వాటిని గుచ్చింది. దాని ఫలమే రాజుకీ, పరివారానికీ ఆ దుస్థితి.*
*చేసిన తప్పిదానికి మహాముని ఎలా ఆగ్రహిస్తాడోనని భయపడ్డాడు శర్యాతి. తన కూతురు తప్పు క్షమించమని చ్యవనుని ముందు మోకరిల్లాడతను. క్షమించాలంటే సుకన్యను ఇచ్చి తనకి వివాహం చెయ్యమన్నాడు చ్యవనుడు. తప్పకుండా అన్నాడు శర్యాతి. జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా సుకన్యను చ్యవనునికి సమర్పించి, శర్యాతి నిష్క్రమించాడక్కణ్ణుంచి.*
*(తర్వాత కథ రేపు)*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి