*✍🏼 నేటి కథ ✍🏼*
*డింగోరాజ్యం-బూర రాజ్యం*
అనగా అనగా రెండు రాజ్యాలుండేవి- డింగో రాజ్యం, బూర రాజ్యం. డింగో రాజ్యపు రాజు మురారి, బూర రాజ్యపు రాజు అరవిందస్వామి. మురారి, అరవింద స్వామి ఇద్దరూ మంచి మిత్రులు అవ్వటంతో రెండు రాజ్యాలూ ఎలాంటి తగాదాలు లేకుండా కలసి మెలసి ఉండేవి. రెండు రాజ్యాల ప్రజలూ ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా మిత్రభావంతో మెలగేవారు.
ఇలా ఉండగా ఒక సారి బూర రాజ్యపు రాజు తన దేశంలో ఒక గొప్ప కోవెల కట్టించాలని తలపెట్టాడు. గుడికి విశాలమైన ప్రాంగణం, ముందు పెద్ద కోనేరు, ప్రపంచంలోనే కనీ విననంత పెద్ద గాలిగోపురం- ఇలాంటి ప్రణాలికలతో ఒక గొప్ప గుడి నిర్మాణం మొదలైంది. అయితే పని ప్రారంభం అయిననాడే ఒక అద్భుతం జరిగింది: పంచలోహాలతో చేసిన వేణుగోపాల స్వామి విగ్రహం ఒకటి, బయట పడింది!
కొన్ని వందల సంవత్సరాల క్రితం డింగో రాజ్యమూ, బూర రాజ్యమూ కలిసి ఒకే 'డింగోబూర' రాజ్యంగా ఉండేవి. వేణు గోపాల స్వామి చలవ వల్ల డింగో బూర రాజ్యంలో అంతా సుభిక్షంగా ఉండేది. కానీ ఏనాడైతే స్వామి ఆలయం పడిపోయిందో, ఆ సంవత్సరమే రాజ్యం రెండు ముక్కలైంది; వానలు కురవక, కరువు ఏర్పడింది; అందరికీ కష్టాలు, నష్టాలు మొదలయ్యాయి. ఆ తరపు రాజులు ఎంత వెతికినా మళ్ళీ వేణుగోపాల స్వామి విగ్రహం దొరకనే లేదు!
మళ్ళీ ఇన్నేళ్ళకు, తనకే విగ్రహం దొరికినందుకు అరవింద స్వామి ఎంతో సంతోష పడ్డాడు. స్వామి కోవెల పూర్తైతే మళ్ళీ తమ రాజ్యానికి పూర్వ వైభవం వస్తుంది! అందుకని, ఆయన కోవెల పనులు త్వరగా పూర్తిచేయమని ఆదేశాలు జారీ చేశాడు.
అయితే, అక్కడే ఉన్న డింగో రాజ్యపు గూఢచారి ఈ విషయాన్ని తక్షణమే తమ రాజు మురారికి చేరవేశాడు. "వేణుగోపాల స్వామి విగ్రహం ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యం మొత్తం ఐశ్వర్యంతో నిండి ఉంటుంది.. మరి ఆ వైభవం బూర రాజ్యానికే ఎందుకు దక్కాలి; తాము వారికి ఎందులో తీసిపోయాము? మా ఇలవేల్పూ ఆ స్వామే- కనుక, విగ్రహం మాకే దక్కాలి" అని డింగో రాజు, సభికులు తీర్మానించారు. దాని ప్రకారమే మురారి అరవింద స్వామికి కబురు పంపాడు: "మీరు ఆ విగ్రహాన్ని మాకు ఇవ్వండి. దానికి తగిన డబ్బు చెల్లిస్తాం" అని.
అరవింద స్వామి, బూర రాజ్యపు మంత్రులూ ఇందుకు ఒప్పుకోలేదు. "మేం ఇవ్వం" అని కబురు పంపారు- "విగ్రహం మా రాజ్యంలోనే దొరికింది కాబట్టి, అది మాకే చెందుతుంది" అని. మాటలు చిలికి చిలికి గాలివాన అయ్యాయి. డింగో రాజ్యం వారు బూర రాజ్యం మీద పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించేశారు. రెండు రాజ్యాలూ ఘోరంగా పోరాటం చేశాయి. ఆ యుద్ధం జరిగే చోట రక్తం ఏరులై పారింది. ఇరుపక్షాల్లోనూ వేలమంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయినా విజయం ఇద్దరిలో ఎవరినీ వరించలేదు- ఇంకా చాలా ధననష్టం, ప్రాణ నష్టం జరిగితే తప్ప, యుద్ధం ముగిసేట్లు లేదు.
గుడారంలో చికాకుగా అటూ ఇటూ తిరుగుతున్న అరవింద స్వామికి, దూరంగా ఇద్దరు పిల్లలు కనబడ్డారు. వాళ్ల దగ్గర ఒక రొట్టెముక్క ఉన్నది. అన్న 'ఆ రొట్టె నాదే' అంటున్నాడు. తమ్ముడు 'అది నాకే కావాల'ని ఏడుస్తున్నాడు. ఒక దశలో ఇద్దరూ కలబడి కొట్టుకోవటం మొదలు పెట్టారు. అంతలో వాళ్ళ అమ్మ వచ్చి, అన్న చేతిలోంచి రొట్టెను తీసుకొని, దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరికీ ఇచ్చింది.
అది చూశాక అరవింద స్వామికి కనువిప్పైంది. "వేణుగోపాల స్వామి విగ్రహం కోసం, అది తేనున్న ఐశ్వర్యం కోసం ఇంతమంది అమాయకుల ప్రాణాలు బలి కావలసిన అవసరం లేదు. రెండురాజ్యాలకూ మధ్యలో దివ్యమైన మందిరాన్ని నిర్మించి, స్వామిని అందులో ప్రతిష్ఠిస్తే, రెండు రాజ్యాలకూ మేలు జరుగుతుంది కద! తనకు ఇంతవరకూ ఈ ఆలోచన ఎందుకు రాలేదు?" అని ఆయన యుద్ధాన్ని విరమించి, మురారికి ఈ విషయమై ఆలోచించమని కబురు పంపాడు.
అప్పటికే యుద్ధంవల్ల కలిగే చెడు పరిణామాలను చూసిన మురారి, ఈ ప్రతిపాదనకు సంతోషంగా అంగీకరించాడు. త్వరలో రెండు రాజ్యాల నడుమన ఒక భవ్య మందిరం తయారైంది. వేణుగోపాల స్వామి చలవ వల్ల, రెండు రాజ్యాలలోనూ శాంతి సామరస్యాలు మళ్ళీ నెలకొన్నాయి.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి