8, ఫిబ్రవరి 2021, సోమవారం

మాండవ్యముని

*📖 మన ఇతిహాసాలు 📓*



*మాండవ్యముని వృత్తాంతం*



మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు.రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు. రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేసాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపసుని కొనసాగించారు. ఒక రోజు రాత్రి కొంతమంది మహఋషులు పక్షి రూపాలతో అక్కడకు వచ్చి మాడవ్యుని చూసి " మహానుభాడవైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేసారు " అని ప్రశ్నించారు.అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని అందుకు ఎవ్వరిని నిందించ వలదని చెప్పాడు. ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని క్రిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు.శూలం అతని శరీరంలోనుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంతభాగం మాత్రం మిగిలి పోయింది. ఆ తరవాత అతడు ఆణి మాండవ్యుడునే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరవాత యమపురికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో " మహా మునీ చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించే వాడివి. అందు వలన ఈ శిక్ష అనుభవించావు. " అన్నాడు. అది విన్న మాండవ్యుడు కోపంతో " పదునాలుగేళ్ళ వరకూ పిల్లలలు ఏమి చేసినా తెలియక చేస్తారు. అందు వలన ఇక మీదట పదునాలుగేళ్ళ బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు. వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది. కానీ యమధర్మరాజా నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు శూద్ర గ్రర్భమందు జన్మించెదవు కాక " అన్నాడు. ఆ కారణంగా వ్యాసుని వలన యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టాడు అన్నాడు వైశంపాయనుడు.


9⃣4⃣4⃣1⃣7⃣6⃣4⃣4⃣7⃣7⃣

కామెంట్‌లు లేవు: