*💎 నేటి ఆణిముత్యం 💎*
బంగారు కుదువ బెట్టకు
సంగరమున బాఱిపోకు సరసుడవైనన్
అంగడి వెచ్చము లాడకు
వెంగలితో జెలిమి వలదు వినరా సుమతీ!36
*భావం:*
నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే నేను చెప్పే నీతిని శ్రద్ధగా విను. అవసరానికి బంగారం తాకట్టు పెట్టకు. యుద్ధరంగం నుంచి పారిపోవద్దు. ఇంటికి కావలసిన నిత్యావసరాలను దుకాణంలో అప్పుపెట్టి తీసుకోవద్దు. మంచి,చెడు విచక్షణ లేనివానితో స్నేహం చేయవద్దు.
*ప్రతిపదార్థము:*
సరసుడవు + ఐనన్ అంటే ఆనందంగా ఉండాలనుకుంటే; బంగారు అంటే బంగారాన్ని; కుదువన్ + పెట్టకు అంటే తాక ట్టు పెట్టవద్దు; సంగరమునన్ అంటే యుద్ధభూమి నుంచి; పారిపోకు అంటే పలాయనం చేయకు. అంగడిన్ అంటే దుకాణంలో; వెచ్చములు + ఆడకు అంటే ఇంటికి కావలసిన నిత్యావసరాలను అరువు మీద తీసుకోవద్దు.
వెంగలితోన్ అంటే విచక్షణ లేనివానితో; చెలిమి అంటే స్నేహం; వ లదు అంటే మంచిదికాదు; వినరా అంటే వినవయ్యా. ప్రతివారూ జీవితంలో పైకి ఎదగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అలా పాటించడం వల్ల జీవితం హాయిగా నడుస్తుంది. అంతేకాక కీర్తిప్రతిష్ఠలు సంపాదించి పెడుతుంది. ఇందులో... బంగారం తాకట్టు పెట్టవద్దు, దుకాణంలో అరువుకి సరుకులు తీసుకోవద్దు... ఈ రెండింటినీ పాటిస్తే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రావు. అలా కాకపోతే అప్పులపాలవుతారు. అందువల్ల వీటిని పాటించమని చెప్పాడు. యుద్ధరంగంలో రాజు పారిపోతుంటే సైనికులు బలహీనులైపోతారు. వారిని శక్తిమంతులుగా ఉంచాలంటే రాజు తప్పనిసరిగా యుద్ధం రంగం నుంచి పారిపోకూడదు. చెడ్డవానితో స్నేహం చేయడం వల్ల ఎన్ని నష్టాలో అందరికీ తెలిసినదే. తాడిచెట్టు కింద నిలబడి పాలు తాగినా కల్లు తాగినట్లే భావిస్తారు. అందువల్ల మంచిపద్ధతులను అలవర్చుకుంటే జీవితం హాయిగా సాగుతుందని కవి ఈ పద్యంలో వివరించాడు.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి