*మాయమైన మొండితనం*
ఒక శనివారం ఉదయం ఆరు గంటల వేళ..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు మా దంపతులము చేరాము..ఇది మాకు ఎప్పుడూ ఉన్న అలవాటే..ఆ సరికే అర్చకస్వాములు మందిరం లోకి వచ్చి, గణపతి పూజ, శివ పూజ, లక్ష్మీ నరసింహస్వామి పీఠం వద్ద పూజ పూర్తి చేసుకొని వున్నారు..ఒక్కొక్క అర్చకస్వామి తనకు నిర్దేశించిన దేవీ దేవతల మందిరాలకు వెళుతున్నారు..మరో గంట తరువాత కానీ..భక్తుల రాక మొదలుకాదు..ఎందుకంటే..మాలకొండలో ఉదయాన్నే ఆ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని మొగలిచెర్ల రావడానికి కనీసం ఆ సమయం పడుతున్నది..శనివారం కనుక, మా దంపతులము కూడా శ్రీ స్వామివారి సమాధిని కటకటాల ఇవతలి నుంచే చూసి నమస్కారం చేసుకొని వచ్చేసాము..
మరి కొద్ది సేపటిలోనే..ఒక కారు వచ్చి మందిరం ముందు ఆగింది..అందులోంచి ముగ్గురు వ్యక్తులు దిగారు..దంపతులిద్దరూ..వాళ్ళ కుమార్తె..మొత్తం ముగ్గురు దిగి..స్వామివారి మందిరం లోపలికి వచ్చి.."ఈరోజు స్వామివారి సమాధి వద్దకు పోవడానికి కుదరదు కదా..?" అని మా సిబ్బందిని అడిగారు.."అవునండీ...కుదరదు..కానీ శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద మీ గోత్రనామాలతో అర్చన చేస్తారు..కటకటాల నుంచి మీరు సమాధిని చూడొచ్చు.." అని మా సిబ్బంది చెప్పారు..వాళ్ళు అర్చన కొఱకు టికెట్ కొనుక్కొని..కొబ్బరి కాయ తీసుకురమ్మని బైట ఉన్న అంగడి వద్దకు తమ కారు డ్రైవర్ ను పురమాయించి..మేము కూర్చున్న చోటుకి వచ్చి కొద్దీ దూరం లో నిలుచున్నారు..ఆ దంపతులిద్దరూ చక్కగా సంప్రదాయానుసారంగా దుస్తులు ధరించి వున్నారు..ఎటొచ్చీ వాళ్ల కుమార్తె మాత్రం..ఆధునిక వస్త్రధారణ లో ఉన్నది.."ఏమండీ..వీళ్ళిద్దరూ చక్కగా బట్టలు కట్టుకున్నారు..ఆ అమ్మాయి వస్త్రధారణ కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నది..సరి చేసుకోమని చెపుదామని అనుకుంటున్నాను.." అని మా ఆవిడ అన్నది..నిజానికి వయసులో ఉన్న ఆ అమ్మాయి అటువంటి దుస్తులు వేసుకొని..అందునా పవిత్రమైన ఆలయాలకు రావడం చేయకూడదు..నా అభిప్రాయం నేను చెప్పేలోపలే..
"మీరు ఎక్కడినుంచి వచ్చారు..?" అని నా భార్య వాళ్ళను అడిగింది.."నెల్లూరు నుంచి వస్తున్నాము..మాలకొండ కు వెళ్లాలని ప్రయాణం అయ్యాము..మొగిలిచెర్ల ఊర్లో ఈ మందిరం తాలూకు బోర్డ్ చూసి..దగ్గరే కదా..ముందుగా చూసి పోదామని అనుకున్నాము..మా డ్రైవర్ ఈరోజు స్వామివారి సమాధి దర్శనం ఉండదు అని చెప్పాడు..పర్లేదు కనీసం చూడొచ్చు కదా అని వచ్చాము.." అని చెప్పారు..
"మీరేమీ అనుకోనంటే..ఒక మాట చెపుతాను..మేమిద్దరమూ మీకన్నా వయసులో పెద్దవాళ్ళం..మీరేమీ అనుకోవద్దు..మీరిద్దరూ సంప్రదాయబద్ధంగా వున్నారు..అమ్మాయి వేసుకున్న దుస్తులు బాగాలేవు..అమ్మాయి డ్రస్సు మార్చుకోమని చెప్పండి..చీర కానీ..పంజాబీ డ్రస్సు కానీ ధరించమనండి..ఈ పాంట్ షర్ట్ వద్దు..అందరూ అమ్మాయినే చూస్తున్నారు..డ్రస్సు మార్చుకోవడానికి మా రూముకు తీసుకువెళతాను..వేరే విధంగా భావించవద్దు.." అని నిర్మొహమాటంగా చెప్పేసింది..ఆ దంపతులు ఒకరినొకరు చూసుకున్నారు..అమ్మాయి వైపు చూసి.."విన్నావా..ఇంటి దగ్గర మేము మొత్తుకున్నాము..నువ్వు మొండి పట్టు పట్టావు..కనీసం ఇప్పుడన్నా కార్లో నుంచి డ్రస్సు తెచ్చుకొని ఆంటీ తో పాటు రూముకు వెళ్లి మార్చుకొని రా..మేము ఇక్కడే కూర్చుని ఉంటాము.." అన్నారు.."మీరే దర్శనం చేసుకోండి..నేను కార్లో ఉంటాను.."అని ఆ అమ్మాయి చివ్వున వెనక్కు తిరిగి కోపంగా వెళ్ళిపోయింది.."మహా మొండితనం అండీ..ఒక్కటే కూతురు..తన మాటే నెగ్గాలనే పంతం..ఏ దేవుడు దాని మనసు మారుస్తాడో చూడాలి.." అని ఆ దంపతులు మాతో చెప్పి..పూజకు వెళ్లారు..పూజ చేయించుకొని..స్వామివారి సమాధి కి నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చారు.."మా అమ్మాయికి ఈ మొండితనం తగ్గిపోయి..మంచి దానిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము.." అన్నారు..
"అన్యధాభావించకండి..పెద్దదాన్ని కదా..అమ్మాయిని అలా చూసేసరికి వుండబట్టలేక మీతో అలా చెప్పాను.." అని మా ఆవిడ అన్నది..ఇద్దరూ తలా ఊపి వెళ్లిపోయారు..ఆ అమ్మాయి మాత్రం కారులోనే ఉండిపోయింది..
ఆరోజు సాయంత్రం నాలుగు గంటల వేళ..ఆ దంపతులు మళ్లీ మందిరానికి వచ్చారు..నేరుగా మేము కూర్చున్న చోటుకి వచ్చి.."మాలకొండ లో కూడా..ఆ లక్ష్మీనరసింహ స్వామిని మేమిద్దరమే దర్శించుకొన్నాము..అమ్మాయి రాలేదు..కానీ తిరిగి వెళ్ళేటప్పుడు..మొగిలిచెర్ల దగ్గరకు రాగానే..అమ్మాయి ఈ స్వామివారి మందిరానికి పోదామని పట్టుబట్టింది..మీరు ఒప్పుకుంటే..మీ రూములో డ్రస్సు మార్చుకొని లోపలికి వస్తానని చెప్పింది..మాకే ఆశ్చర్యంగా ఉంది.."అన్నారు.."కారు తీసుకొని..మందిరం వెనుకాల ఉన్న మారూముకు రండి.." అని మా ఆవిడ వాళ్ళతో చెప్పింది..మరో పది నిమిషాల్లో..ఆ అమ్మాయి చక్కగా పంజాబీ డ్రస్సులో మందిరానికి వచ్చింది..బుద్దిగా తల్లిదండ్రుల తో కలిసి స్వామివారి విగ్రహం వద్ద ఆశీర్వచనం తీసుకొని..సమాధికి నమస్కారం చేసుకొని వచ్చింది.."ఏ దేవుడు దీని మనస్సు మారుస్తాడో అని ఉదయం వేదన పడ్డాము..సాయంత్రానికే మార్పు వచ్చింది..ఇదే మార్పు ఇలాగే కొనసాగాలని..స్వామిని వేడుకున్నాము..వెళ్లిస్తామండీ.." అని చెప్పి వెళ్లారు..
మరో ఆరు నెలలకు ఆ దంపతులు, వాళ్ళ అమ్మాయి ఒక గురువారం నాడు వచ్చారు.."అమ్మాయి పూర్తిగా మారిందండీ..మొండితనమే లేదు..మొన్న సంబంధాలు చూసాము..ఒకటి కుదిరింది..వచ్చేనెలలో వివాహం..ఒకసారి ఈ స్వామివారిని దర్శించుకొని వద్దామని అమ్మాయి చెప్పింది..అందుకే వచ్చాము.." అన్నారు.."చక్కగా కుందనపు బొమ్మలా ..లక్ష్మీ కళ తో ఉన్నావు..మొండితనం తగ్గిందా?.."అన్నది మా ఆవిడ..నవ్వుతూ తలవూపింది..
నిజానికి సమస్య చిన్నదే కానీ..ఆ దంపతుల కు అదే పెద్ద మనోవేదనగా ఉన్నది..స్వామివారి సమాధి వద్ద శాశ్వత పరిష్కారం లభించింది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి