18, సెప్టెంబర్ 2021, శనివారం

పతన హాస్యం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

     *🌷పతన హాస్యం🌷* 

              🌷🌷🌷

‘ఫుల్లుమూను నైటటా.. జాసుమిన్ను వైటటా.. మూను కన్న మొల్ల కన్న నీదు మోము బ్రైటటా.. టా! టా! టా!’ అంటాడు గిరీశం ‘కన్యాశుల్కం’లో. ‘నేను వట్టి తెలివితక్కువ వాడిననా నీ అనుమానం’ అని కాంతం కథల్లో భర్త అంటే అందుకు కాంతం ‘అహహ అనుమానమేమీ లేదు.. గట్టి నమ్మకమే’ అంటుంది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారబోశాను’ అని శ్రీశ్రీ రాస్తే జరుక్‌శాస్త్రి పేరడీగా ‘నేను సైతం కిళ్లీ కొట్లో పాతబాకీలెగరగొట్టాను’ అని రాశాడు. ‘నవ్వవు జంతువుల్‌.. నరుడు నవ్వును’ అంటాడో కవి. నవ్వు మానవ ప్రవృత్తి. సకల జీవజాలం నుంచి మనిషిని వేరు చేయగల ఒకే ఒక స్పందనాగుణం– నవ్వు.


‘నాకు గనక సెన్సాఫ్‌ హ్యూమర్‌ లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉందును’ అన్నారు గాంధీజీ. ఓ పెద్దాయన ‘ఏ మేన్‌  ఈజ్‌ నాట్‌ పూర్‌ ఇఫ్‌ హి కెన్‌ స్టిల్‌ హీ లాఫ్‌’ అన్నాడు. ‘నవ్వుకు చోటు దొరకనంత సేపు అది ఎంత పెద్ద గది అయినా ఇరుకే’ అని ఇంగ్లిష్‌ వ్యాఖ్య. బతకడానికి నవ్వు అవసరం అని సామాన్యుడేమిటి చక్రవర్తి కూడా అనుకున్నాడు. అందుకే విదూషకుణ్ణి ఆస్థానంలో పెట్టుకున్నాడు. తెనాలి రామలింగడు, బీర్బల్‌ తమ చక్రవర్తులను ఏమో కాని నేటికీ ఆబాలగోపాలాన్ని నవ్విస్తున్నారు.


మనుషులు నిత్య జీవితంలో పరాచికాలతో నవ్వుతారు. వెక్కిరించి నవ్వుతారు. తప్పులకు, అబద్ధాలకు నవ్వుతారు. అవివేకులను, మందబుద్ధులను, అతి తెలివిగల వారిని చూసి నవ్వుతారు. అధికారంలో ఉన్నవారిని ఏమీ అనలేక గేలి చేసి నవ్వుతారు. చాలక పుస్తకాలు చదివి, నాటకాలు చూసి, సినిమాలకు వెళ్లి కూడా నవ్వుతారు. అయినా కూడా గౌరవం పొందే విషయంలో హాస్యానిది ద్వితీయ స్థానమే. గంభీరంగా ఉండే అధికారినీ, గంభీరమైన ఉపన్యాసకుణ్ణీ గౌరవించినట్టుగా హాస్యం మిళితం చేసేవారిని గౌరవించరు. సాహిత్యంలో గొప్ప రచనలన్నీ గంభీరమైన విషయాలవే. హాస్యం రాస్తే ‘హాస్య రచయిత’.  గంభీరమైన విషయాలు రాస్తే ‘రచయిత’. అతి తక్కువ మందే హాస్యంతో గంభీరమైన విషయాలు రాసి గౌరవం పొందారు. 

తెలుగులో తొలి వచన సాధకులలో ఒకౖరైన వీరేశలింగం నవ్విస్తూ తొడపాశం పెట్టే శిల్పంలో తెలుగువారిని స్మిత వచనా సముద్రంలోకి ప్రవేశ పెట్టారు. మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు ‘హాస్యత్రయం’ అనిపించుకున్నారు. చిలకమర్తి ప్రహసనాలు, పానుగంటి ‘సాక్షి’ వ్యాసాలు క్లాసిక్స్‌. ఆ తర్వాతి రోజుల్లో ముళ్లపూడి వెంకటరమణ ‘బుడుగు’, పురాణం ‘ఇల్లాలి ముచ్చట్లు’, నండూరి పార్థసారథి ‘రాంబాబు డైరీ’... ఈ హాస్యధారను బలంగా ముందుకు తీసుకెళ్లాయి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, తెలిదేవర భానుమూర్తి తదితరులు మాండలిక రచనతో హాస్యం ఎంత నేటివ్‌ రుచిగా ఉంటుందో చూపించగలిగారు.

అయితే ఆది నుంచి స్త్రీకి హాస్యం ‘అదుపు చేయబడినది’. నవ్వుకు ప్రధాన వాటాదారు పురుషుడే. స్త్రీ కాదు. ద్రౌపది కాలం నుంచి స్త్రీ నవ్వుకు అపఖ్యాతి, అపసవ్య వర్తనను ఆపాదిస్తూ వచ్చారు. నవ్వే, నవ్వించే స్త్రీలు నేటికీ తక్కువ. ఇలాంటి సంఘ అంకుశాలను కూడా ధిక్కరించి స్త్రీలు రాశారు. భానుమతి ‘అత్తగారి కథలు’, రంగనాయకమ్మ ‘స్వీట్‌హోమ్‌’ నవ్వించాయి. పొత్తూరి విజయలక్ష్మి,  మృణాళిని, సోమరాజు సుశీల... పాఠకులను తమ ఫిక్స్‌డ్‌ ఖాతాల్లో వేసుకోగలిగారు.

కాని నవ్వించడం ఏమాత్రం జోక్‌ కాదు. ఆరోగ్యకరమైన హాస్యంతో నవ్వించడం కొద్దిమందికే చేతనవుతుంది. సమాజంలో కానీ, రచనల్లో కానీ చాలామటుకు హాస్యం స్త్రీలను, బలహీనులను, వెనుకబడినవారిని దూషించడం వల్ల గేలి చేయడం వల్ల పుడుతూ ఉంటుంది. ఆస్తిత్వ రాజకీయ ఉద్యమాల వల్ల కలిగిన చైతన్యం ఇప్పుడు ఇవేవీ చేయడానికి వీల్లేని సంస్కారాన్ని ఇస్తున్నాయి. ఈ సంస్కార పరిధిలో ఉంటూ హాయిగా నవ్వుకోగల హాస్యాన్ని పుట్టించడం నవ్వు మీద సాముగా మారింది. 

ఈ సమయంలోనే నేటి తరం ఎటువంటి హాస్యానికి సామీప్యంలో ఉన్నదీ గమనించుకోవాలి. నిత్య ఒత్తిడి వల్ల పాఠకులు ప్రేక్షకులుగా మారి చదవడానికి బదులు చూడటానికి ఇష్టపడుతున్న సమయంలో హాస్యం వ్యాపార వనరుగా మారింది. అభినవ విదూషకులు పుట్టుకొచ్చారు. నిత్యం ప్రతి చానల్‌లో గంటో అరగంటో హాస్య కార్యక్రమం ఉంటోంది. అయితే అది ఎటువంటి హాస్యం? స్త్రీల రూపాలను, ఎదుటివారి ఆకారాలను పదే పదే హీనపరచడమే హాస్యంగా ఉంది. తెలుపు నలుపులను, పొడవు పొట్టిలను, భాషా యాసలను హీనపరచడమే హాస్యంగా ఉంది. ‘ఒరే దరిద్రుడా’ అనేది హాస్య సంబోధన. దరిద్రుడంటే పేదవాడు. పేదవాడు ఎవరికి హాస్య వస్తువు? ఎందుకు హాస్య వస్తువు? సమాజం లైంగిక అపక్రియల్లో మునిగినట్టుగా వాటి చుట్టూ అల్లిన హాస్యానికి రేటింగులు వస్తున్నాయి.

మాటలతో సాగే రతిని హాస్యం అంటున్నారు. ఇవి ఇళ్లల్లో ఉండి చూస్తున్న పిల్లలకూ, యువతీ యువకులకూ ఏం నేర్పిస్తున్నాయి? ఆరోగ్యకరమైన హాస్యాన్ని అలవర్చుకోని పిల్లలు తమక్కావాల్సిన హాస్యాన్ని వెతుక్కోవడంలో ఎదుటివారి దుఃఖానికి హేతువు అవుతారు. బాధించడాన్ని ‘ఎంజాయ్‌’ చేస్తారు. సత్యానికి, హేతువుకు, వాదనకు నిలబడలేక ‘ముఖాన్నో, మూతినో’ కామెంటు చేసి పారిపోతారు. సాంస్కృతిక దాడి చేస్తారు. ఉన్నతమైన విషయాన్ని కూడా పతనానికి తెచ్చి నవ్వుదామనుకుంటారు. పతన హాస్యపు ప్రతిఫలనం ఇది. ఇప్పుడు చలామణిలో ఉన్నదానిని అపహాస్యం అనడానికి కూడా లేదు. *ఇది  దుర్మార్గ, హాస్యం!*

కామెంట్‌లు లేవు: