18, సెప్టెంబర్ 2021, శనివారం

ప్రమాదకరమైనది కోపం.

 🌷మనిషి స్వభావాల్లో ఎక్కువ ప్రమాదకరమైనది కోపం.

దానికి విరుగుడు హాస్యం. హాస్యచతురత అలవడితే కోపాన్ని నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. అవతలివారి కోపాన్ని చల్లార్చేందుకూ హాస్యం ఉపకరిస్తుంది.


కొన్ని ఉదాహరణలు చూద్దాం.


🌷పేద కుర్రవాడొకడు హోటల్లోకి చొరబడి, మస్తుగా ఫలహారాలు సేవించాడు. సొమ్ము చెల్లించమనేసరికి డబ్బులు లేవని బిక్కమొహం వేశాడు.


 🌷ఆ యజమానికి కోపం ముంచుకొచ్చింది. చాచిపెట్టి

గూబమీద కొట్టాడు. పిల్లవాడు ఆ దెబ్బకు గిర్రున తిరిగి కిందపడ్డాడు.


🌷 కాసేపటికి తేరుకొని, మెల్లగా 'అయ్యా! ఈ లెక్కన నేను రోజూ రావచ్చా' అని అడిగాడు. యజమానికి ముందు నవ్వు వచ్చింది. ఆ తరవాత కన్నీళ్లు వచ్చాయి. కుర్రవాడి మీద అంతలా కోపం ప్రదర్శించినందుకు సిగ్గుపడ్డాడు.


🌷హాస్యప్రవృత్తి మనిషిని ఆరోగ్యవంతుణ్ని చేస్తుంది. 'రోజుకు ఒకసారైనా మనసారా బిగ్గరగా నవ్వని రోజు జీవితంలో వృథా అయినట్లే' అన్నాడొక రచయిత.


'🌷నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అని ప్రముఖ సినీదర్శకులు జంధ్యాల చెప్పిన మాట తెలుగునాట విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.


🌷సృష్టిలో నవ్వగలిగే జీవి మనిషి ఒక్కడే! కనుక నవ్వు మనిషిసొత్తు.


🌷నవ్వు నాలుగు విదాల చేటు అనేది నమ్మదగిన మాటకాదు. నవ్వుకుని వదిలేయవలసిన మాట.


'🌷నాలో హాస్యప్రవృత్తి లేకుంటే నేను ఏనాడో ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చేది' అన్నారు గాంధీజీ.


🌷కోపంలోంచి, నిరాశలోంచి తేలిగ్గా బయటపడటానికి మనిషి హాస్య చతురతను అలవరచుకోవాలి.


🌷 ఒక మంత్రిగారి సుపుత్రుడు కళాశాలలో బాగా అల్లరి చేసేవాడు. ఉపాధ్యాయులను ఏడిపించేవాడు. వాణ్ని ఏమీ చెయ్యలేక ఒక తెలుగు మాస్టారు 'ఓరి ఇరవై అయిదూ, ఇరవై ఆరూ! నోర్మూసుకు కూర్చో' అనేవారు.


🌷అది తిట్టో ఏమిటో అర్థమయ్యేదికాదు. చివరికి కళాశాల ఫేర్‌వెల్‌ ఫంక్షన్ లో కొందరు విద్యార్థులు 'గురువుగారూ ఇవాళ చివరిరోజు కదా, ఇవాళైనా ఆ ప్రహేళిక విప్పండి' అని అడిగారు.


 🌷దానికి ఆయన 'తెలుగు సంవత్సరాల పేర్లు వెతుక్కోండి' అన్నారు.


తీరాచూస్తే ఇరవై అయిదు-ఖర, ఇరవై ఆరు- నందన!


        "ఖర నందన"


అంటే, రోజూ వాణ్ని 'గాడిదకొడకా' అని ఆయన కసితీరా తిట్టేవారన్నమాట.



 🌷హాస్యస్ఫురణ కారణంగా ఒకోసారి అనుకోని ప్రయోజనాలు చేకూరుతాయి.


🌷మనిషి విరగబడి నవ్వినప్పుడు మెదడు నుంచి విడుదలయ్యే రసాయనాలు రక్తపోటును తగ్గించి, గుండెను తేలికచేస్తాయని సైన్సు నిరూపించింది. అందుకే వైద్యులు బాగా నవ్వమని సలహా ఇస్తున్నారు. నవ్వును ఒక చికిత్స (లాఫింగ్‌ థెరఫీ)గా ప్రయోగిస్తున్నారు.


 🌷దీని ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది.


' 🌷ఖరీదైన సౌందర్య లేపనాలకన్నా మనిషి మొహాన్ని ఆకర్షణీయంగా చూపించేది- పెదాలపై చక్కని నవ్వే'

గరికపాటివారి హాస్య ప్రసంగం


🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: