4, సెప్టెంబర్ 2021, శనివారం

సంస్కృత మహాభాగవతం*

 *4.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*


*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*5.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*తం తదా మనుజా దేవం సర్వదేవమయం హరిమ్|*


*యజంతి విద్యయా త్రయ్యా ధర్మిష్ఠా బ్రహ్మవాదినః॥12348॥*


ఆ యుగము నందలి ధర్మనిష్ఠాపరులు, వేదాధ్యయనము నందును, అధ్యాపనమునందును పారంగతులు. వారు సర్వదేవ స్వరూపుడు, దేవాదిదేవుడగు శ్రీహరిని ఋగ్వేద-యజుర్వేద-సామవేద మంత్రములద్వారా ఆరాధింతురు.


*5.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*విష్ణుర్యజ్ఞః పృశ్నిగర్భః సర్వదేవ ఉరుక్రమః|*


*వృషాకపిర్జయంతశ్చ ఉరుగాయ ఇతీర్యతే॥12349॥*


ఈ యుగమునందు విష్ణువు, యజ్ఞపురుషుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అను నామములతో పరమాత్మయొక్క గుణలీలావైభవములను జనులు కీర్తించుచుందురు.


*5.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ద్వాపరే భగవాఞ్శ్యామః పీతవాసా నిజాయుధః|*


*శ్రీవత్సాదిభిరంకైశ్చ లక్షణైరుపలక్షితః॥12350॥*


ఆ పరమాత్మ ద్వాపరయుగము నందు శ్యామవర్ణశోభితుడై పట్టుపీతాంబరములను ధరించును, కంఠమున కౌస్తుభమణితోడను, వక్షస్థలమున శ్రీవత్సాది చిహ్నములతోడను ఒప్పుచు, కరములయందు శంఖ, చక్ర, గదా, పద్మములను దాల్చును. ఆ స్వామియొక్క అఱచేతుల యందును, పాదతలములయందును పద్మాదిశుభచిహ్నములు అలరారుచుండును.


*5.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*తం తదా పురుషం మర్త్యా మహారాజోపలక్షణమ్|*


*యజంతి వేదతంత్రాభ్యాం పరం జిజ్ఞాసవో నృప॥12351॥*


నిమిమహారాజా! ఆ యుగమునందు పరమపురుషుడు ఛత్రచామరాది మహారాజ లక్షణములతో విలసిల్లుచుండును. జిజ్ఞాసువులైన మానవులు ఆ ప్రభువును వైదిక మంత్రములతో, ఆగమాది తంత్రములద్వారా ఆరాధింతురు.


*5.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ|*


*ప్రద్యుమ్నాయానిరుద్ధాయ తుభ్యం భగవతే నమః॥12352॥*


*5.30 (ముప్పదియవ శ్లోకము)*


*నారాయణాయ ఋషయే పురుషాయ మహాత్మనే|*


*విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమః॥12353॥*


వాసుదేవా! సంకర్షణా! ప్రద్యుమ్నా! అనిరుద్ధా! పరమాత్మా! నీకు నమస్కారములు. నారాయణా! యోగేశ్వరా! పురుషోత్తమా! మహాత్మమా! విశ్వేశ్వరా! విశ్వరూపా! సర్వభూతాత్మా! నీకు ప్రణామములు అని ఈ యుగమువారు భగవంతుని పూజింతురు.


*5.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*ఇతి ద్వాపర ఉర్వీశ స్తువంతి జగదీశ్వరమ్|*


*నానాతంత్రవిధానేన కలావపి యథా శృణు॥12354॥*


నిమిమహారాజా! ఈ విధముగా ద్వాపరయుగమునందు భక్తులు ఆ జగదీశ్వరుని స్తుతింతురు. కలియుగమునందు కూడ వివిధములగు తంత్రవిధానముల ద్వారా ఆ సర్వేశ్వరుని ఆరాధింతురు.


*5.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్రపార్షదమ్|*


*యజ్ఞైః సంకీర్తనప్రాయైర్యజంతి హి సుమేధసః,12355॥*


కలియుగమునందు భగవంతుడు శ్రీకృష్ణనామధేయుడై ఇంద్రనీలమణికాంతులతో తేజరిల్లుచుండును. హృదయాది మంత్రమూర్తులతో, కౌస్తుభాది ఉపాంగములతో, సుదర్శనాది ఆయుధములతో సునంద, నందాది పార్షదులతో విరాజిల్లుచుండును. వివేకవంతులు యజ్ఞయాగములద్వారా ఆ పరమపురుషుని ఆరాధించుదురు. ఆ స్వామియొక్క నామ, గుణ, రూపలీలావైభవములను పారవశ్యముతో కీర్తింతురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: