*4.09.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*
*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*5.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*ధ్యేయం సదా పరిభవఘ్నమభీష్టదోహం తీర్థాస్పదం శివవిరించినుతం శరణ్యమ్|*
*భృత్యార్తిహం ప్రణతపాల భవాబ్ధిపోతం వందే మహాపురుష తే చరణారవిందమ్॥12356॥*
వారు భగవంతుని ఈ విధముగా స్తుతింతురు. 'శరణాగతవత్సలా! మహాపురుషా! ప్రభూ! నీ పాదపద్మములకు పదేపదే నమస్కరింతుము. అవి సర్వదా ధ్యానయోగ్యములు. లౌకికములైన సంకటములనుండియు, ఇంద్రియ ప్రకోపములనుండి రక్షించునట్టివి. ఇష్టార్థములను అనుగ్రహించునట్టివి. గంగాది పుణ్యతీర్థములకును ఆశ్రయములగుటవలన పరమపావనమైనవి. శంకరునిచేతను, బ్రహ్మేంద్రాది సకల దేవతలచేతను నిరంతరము స్తుతింపబడుచుండునట్టివి. సకలప్రాణులకును శరణ్యములు. భక్తులయొక్క కష్టములను తొలగించు చుండుటయేగాక వారిని సంసార సముద్రమునుండి తరింపజేయునట్టివి.
*5.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*త్యక్త్వా సుదుస్త్యజసురేప్సితరాజ్యలక్ష్మీం ధర్మిష్ఠ ఆర్యవచసా యదగాదరణ్యమ్|*
*మాయామృగం దయితయేప్సితమన్వధావద్వందే మహాపురుష తే చరణారవిందమ్॥12357॥*
ధర్మపరిపాలన ధురంధరా! అయోధ్యారాజ్యలక్ష్మిని పొందుటకొరకు దేవతలు సైతము అర్రులు చాచుచుందురు. అట్టి మహాసామ్రాజ్య వైభవములను త్యజించుట సామాన్యులకు అసాధ్యము. కానీ రామావతారమున పూజ్యుడైన మీ తండ్రియగు దశరథుని వాక్య పరిపాలనకై మహాసామ్రాజ్యమును సైతము త్యజించి, నీ పాదారవిందములు అరణ్యములయందు సంచరించినవి. నీకు ప్రాణప్రియమైన సీతాదేవి యొక్క ముచ్చటదీర్చుటకు అవి మాయామృగమును వెంబడించినవి. అట్టి నీ దివ్యచరణ కమలములకు పదే పదే ప్రణమిల్లుదుము.
*5.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*ఏవం యుగానురూపాభ్యాం భగవాన్ యుగవర్తిభిః|*
*మనుజైరిజ్యతే రాజన్ శ్రేయసామీశ్వరో హరిః॥12358॥*
నిమిమహారాజా! కృత - త్రేతా - ద్వాపర - కలియుగములలోని ప్రజలు ఆయా యుగములకు అనురూపముగా వేర్వేరు పద్ధతులలో భగవంతుని నామ, రూప, గుణ వైభవములను ఆరాధింతురు. సర్వసమర్థుడైన శ్రీహరి వారికి ధర్మార్థకామ, మోక్షములు అను చతుర్విధ పురుషార్థములను ప్రసాదించును.
శ్లో. *ధ్యాయన్ కృతే, యజన్ యజ్ఞైః త్రేతాయాంద్వాపరేఽర్చయన్|*
*యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవమ్॥*
కృతయుగమునందు ధ్యానించుటవలనను, త్రేతాయుగమునందు యజ్ఞయాగాదులను ఆచరించుటవలనను, ద్వాపరయుగమునందు అర్చించుటచేతను కలుగు లాభములు కలియుగమునందు శ్రీహరి సంకీర్తనము చేయుటవలననే ప్రాప్తించును.
*5.36 (ముప్పది ఆరవానణ శ్లోకము)*
*కలిం సభాజయంత్యార్యా గుణజ్ఞాః సారభాగినః|*
*యత్ర సంకీర్తనేనైవ సర్వస్వార్థోఽభిలభ్యతే॥12359॥*
కలియుగమునందు భగవత్సంకీర్తనము చేతనే స్వార్థపరమార్థములు (సకలపురుషార్థములు) ప్రాప్తించును. అందువలననే గుణజ్ఞులు (ఇతరులలో దోషములున్నను, వారి గుణములనే గ్రహించువారు), సారగ్రాహిణులు (ప్రధాన విషయసారమును గ్రహించువారు) కలియుగమును ఎంతయు ప్రశంసింతురు.
*5.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*న హ్యతః పరమో లాభో దేహినాం భ్రామ్యతామిహ|*
*యతో విందేత పరమాం శాంతిం నశ్యతి సంసృతిః॥12360॥*
భగవత్సంకీర్తనము పరమపురుషార్థ సాధనము. దీనివలన సంసారబంధములు తొలగిపోవుటయేగాక పరమశాంతియు లభించును. అందువలన సంసారచక్రములో పరిభ్రమించుచుండెడి దేహాభిమానులకు (ఇహపరలాభములను పొందుటకు) సంకీర్తనమువంటి సరళసాధనము మరియొకటి లేదు.
*5.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*కృతాదిషు ప్రజా రాజన్ కలావిచ్ఛంతి సంభవమ్|*
*కలౌ ఖలు భవిష్యంతి నారాయణపరాయణాః॥12361॥*
*5.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*క్వచిత్క్వచిన్మహారాజ ద్రవిడేషు చ భూరిశః|*
*తామ్రపర్ణీ నదీ యత్ర కృతమాలా పయస్వినీ॥12362॥*
*5.40 (నలుబదియవ శ్లోకము)*
*కావేరీ చ మహాపుణ్యా ప్రతీచీ చ మహానదీ|*
*యే పిబంతి జలం తాసాం మనుజా మనుజేశ్వర|*
*ప్రాయో భక్తా భగవతి వాసుదేవేఽమలాశయాః॥12362॥*
నిమిమహారాజా! కృత-త్రేతా-ద్వాపర యుగముల యందలి ప్రజలుగూడ కలియుగమునందు జన్మించుటకు అభిలషింతురు. ఏలయన, కలియుగమునందు జనులు అక్కడక్కడ శ్రీమన్నారాయణ సేవాపరాయణులగుదురు. అందునా దక్షిణభారతదేశమున పెక్కుమంది భక్తులు జన్మింతురు. ద్రవిడదేశమునందు పవిత్రములైన తామ్రపర్ణి, కృతమాల, పయస్విని, కావేరి, మహానది, ఇంకను పడమరదిశగా ప్రవహించుచుండెడి నదులును గలవు. నిమి మహారాజా! ఆ నదుల జలములను స్నానపానాదులతో సేవించినవారు తరచుగా నిర్మలచిత్తులై శ్రీకృష్ణపరమాత్ముని యందు భక్తితత్పరులగుదురు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235g
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి