*11.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*
*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*14.9 (తొమ్మిదవ శ్లోకము)*
*మన్మాయామోహితధియః పురుషాః పురుషర్షభ|*
*శ్రేయో వదంత్యనేకాంతం యథాకర్మ యథారుచి॥12737॥*
మహాత్మా! ఉద్ధవా! నా మాయవలన అందరి బుద్ధులును మోహితములైనవి. అందువలన వారు తమ తమ కర్మసంస్కారములను, ఇష్టములను అనుసరించి, ఆత్మశ్రేయస్సునకై పెక్కు మార్గములను వెలువరించిరి.
*14.10 (పదియవ శ్లోకము)*
*ధర్మమేకే యశశ్చాన్యే కామం సత్యం దమం శమమ్|*
*అన్యే వదంతి స్వార్థం వా ఐశ్వర్యం త్యాగభోజనమ్|*
*కేచిద్యజ్ఞతపో దానం వ్రతాని నియమాన్ యమాన్॥12738॥*
*14.11 (పదకొండవ శ్లోకము)*
*ఆద్యంతవంత ఏవైషాం లోకాః కర్మవినిర్మితాః|*
*దుఃఖోదర్కాస్తమోనిష్ఠాః క్షుద్రానందాః శుచార్పితాః॥12739॥*
అవి ఏవనగా - ధర్మమే శ్రేయస్సాధనమని పూర్వమీమాంసకులు చెప్పగా, కీర్తియని సాహిత్యాచార్యులు, కామమని కామశాస్త్రజ్ఞులు, సత్యము, శమదమాదులేనని యోగవిదులు, ఐశ్వర్యమని నీతిశాస్త్రవేత్తలు, త్యాగమని త్యాగధనులు, భోగములే మిగుల లాభములని చార్వాకులు చెప్పెదరు. కొందరు యజ్ఞము, తపస్సు, దానము, వ్రతము, యమ-నియమాదులే పురుషార్థములని వివరింతురు. కాని, ఈ కర్మలన్నింటి ఫలస్వరూపములుగా లభించెడు లోకములు అన్నియును ఉత్పత్తి, వినాశములు గలవి. కర్మఫలములు సమాప్తమైన వెంటనే వారికి దుఃఖములే మిగులును. నిజమునకు వారికి చిట్టచివరకు లభించేది ఘోరమైన అజ్ఞానమే. వాటిద్వారా ముందుగా వారికి లభించే సుఖములుగూడా తుచ్ఛమైనవి, లెక్కింపదగినవికావు. వాటిని అనుభవించే కాలముసందు కూడా వారు అసూయాది దోషములను కలిగియుండుటచే పూర్తిగా దుఃఖభాజనులే అగుదురు. కావున, వేరువేరు సాధనముల దురాశలో చిక్కుకొనరాదని గ్రహింపవలెను.
*14.12 (పండ్రెండవ శ్లోకము)*
*మయ్యర్పితాత్మనః సభ్య నిరపేక్షస్య సర్వతః|*
*మయాఽఽత్మనా సుఖం యత్తత్కుతః స్యాద్విషయాత్మనామ్॥12740॥*
సాధుపురుషుడవైన ఉద్దవా! నిరతిశయానంద స్వరూపుడనైన నాయందే తమ మనస్సులను (సర్వస్వమును) సమర్పించినవారును, సమస్త విషయసుఖములయందు ఎట్టి ఆసక్తియు లేనివారును అగు పురుషులు ఆత్మానందమును అనుభవింతురు. అట్టివారికి ప్రాప్తించెడి పరమసుఖము విషయలోలురకు ఎట్లు చేకూరును?
*14.13 (పదమూడవ శ్లోకము)*
*అకించనస్య దాంతస్య శాంతస్య సమచేతసః|*
*మయా సంతుష్టమనసః సర్వాః సుఖమయా దిశః॥12741॥*
ఎట్టి అభిలాషలూ లేనివారును, బాహ్యేంద్రియ-అంతరింద్రియ నిగ్రహము గలవారును, సుఖదుఃఖాది ద్వంద్వములయందు సమదృష్టి గలవారును అయి, నిరంతరము నాయందే తమ చిత్తములను లగ్నమొనర్చుచు సంతుష్టిచెందెడి నా భక్తులకు అన్నివిధములుగా సుఖమే ప్రాప్తించును.
*14.14 (పదునాలుగవ శ్లోకము)*
*న పారమేష్ఠ్యం న మహేంద్రధిష్ణ్యం న సార్వభౌమం న రసాధిపత్యమ్|*
*న యోగసిద్ధీరపునర్భవం వా మయ్యర్పితాత్మేచ్ఛతి మద్వినాఽన్యత్॥12742॥*
తమ హృదయములను (సర్వస్వమును) నాకే సమర్పించిన భక్తులు బ్రహ్మపదవినిగాని, ఇంద్రాధిపత్యమును గాని, సార్వభౌమాధికారమునుగాని, రసాతల-ఐశ్వర్యములనుగాని, అణిమాది సిద్ధులనుగాని కోరరు. అంతేగాదు కడకు వారు మోక్షమునుగూడ అభిలషింపరు. నాయందు అనన్యభక్తిని కలిగియుండుటయే వారి పరమలక్ష్యము. దానిముందు ఈ బ్రహ్మాది పదవులు అన్నియును దిగదుడుపే.
*14.15 (పదిహేనవ శ్లోకము)*
*న తథా మే ప్రియతమ ఆత్మయోనిర్న శంకరః|*
*న చ సంకర్షణో న శ్రీర్నైవాత్మా చ యథా భవాన్॥12743॥*
ఉద్ధవా! నీవు నాకు అత్యంత ప్రియతముడవు. నా పుత్రుడైన బ్రహ్మగాని, ఆప్తుడైన శంకరుడుగాని, సోదరుడైన బలరాముడుగాని, నిత్యానపాయినియైన లక్ష్మీదేవిగాని, కడకు నా ఆత్మగాని నీవలె నాకు ప్రియములుగావు.
*14.16 (పదహారవ శ్లోకము)*
*నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శనమ్|*
*అనువ్రజామ్యహం నిత్యం పూయేయేత్యంఘ్రిరేణుభిః॥12744॥*
నన్ను దప్ప మరి దేనినీ అపేక్షింపనివాడు, నా రూపగుణములనే మననము చేయుచుండువాడు, ప్రశాంతచిత్తుడు, ఏ ప్రాణియందును వైరభావము లేనివాడు, అంతటను నన్నే దర్శించుచుండువాడు అగు భక్తుని నేను అనుగమించు చుందును. వాని పాదధూళులు నన్ను సోకుటవలన నాలోని లోకములన్నియును పవిత్రములగును. అనగా నా స్పర్శతోవలె, నా భక్తునియొక్క పాదరేణువుల స్పర్శవలనగూడ సకల లోకములును పునీతములగును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి