12, అక్టోబర్ 2021, మంగళవారం

*సన్యాసి..పరివర్తన

 *సన్యాసి..పరివర్తన..*


సుమారు ఎనిమిదేళ్ల క్రిందట..డిసెంబర్ నెలలో ఒక శనివారం సాయంత్రం ఐదు గంటల వేళ..బుల్లెట్ మోటార్ సైకిల్ మీద తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి.."ఈ మందిరం నిర్వాహకులు ఎవరు..?" అని అడిగాడు..


"నేనే.." అన్నాను..అతనిని చూస్తే ఓ ముప్పై ఐదేళ్ల వయసుంటుందేమో..తెల్లగా వున్నారు..గడ్డం పెంచుకొని, తలమీద జుట్టును ముడి వేసుకొని..నుదుటి మీద ఒకే నామం దిద్దుకొని..వున్నారు...చూడగానే సన్యసించారేమో అని అనిపిస్తున్నది..సరే..వివరాలు తెలుసుకుందామని అనుకొని.."మీరెవరు..?" అన్నాను..


"నా పేరు రామయోగి స్వామి..సన్యాసం స్వీకరించి నిరంతర దైవ స్మరణలో గడుపుతున్నాము..అన్ని క్షేత్రాలూ, తీర్ధాలూ దర్శించుకుంటూ..ఈ ప్రాంతంలో ఒక అవధూత సిద్ధిపొందాడని విని..ఈ ప్రదేశాన్ని చూసిపోవాలని వచ్చాము..ఈరాత్రికి ఇక్కడ బస చేసి, రేపుదయం తిరిగి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాము.." అని నాతో చెప్పాడు.."ఇప్పుడు ఈ అవధూత సమాధి చూడవచ్చా.." అన్నారు..


"ఈరోజు శనివారం కనుక, శ్రీ స్వామివారి ఆదేశానుసారం..సమాధిని దూరం నుండి దర్శించుకోవచ్చు కానీ..దగ్గరగా వెళ్లి, ముట్టుకునే అవకాశం లేదు.." అని చెప్పాను..


"ఓహో..అలాగా..పర్లేదు..రేపుదయం చూస్తాము..ఎలాగూ రాత్రికి ఇక్కడే ఉంటాము కదా.." అన్నారు..


తనని తాను "మేము.." అని సంబోధించుకోవడం నాకెందుకో నచ్చలేదు..అయినా అది వారి స్వవిషయం కనుక ఊరుకున్నాను..ఉండటానికి ఏదైనా గది కావాలా అని అడిగాను..పెద్దగా నవ్వి.."అక్కర్లేదు..ఈ మంటపం లోనే ఉంటాము..కాలకృత్యాలకు బైటకు వెళతాము..బావి వద్ద స్నానం చేస్తాము..ఈరాత్రికి ఆహారంగా పళ్ళు తీసుకుంటాము..అవికూడా తెచ్చుకున్నాము..మా గురించి మీరేమీ శ్రమ పడవద్దు.." అన్నారు..సరే అన్నాను..


ఆ శనివారం నాడు భక్తులు ఎక్కువ మంది రాలేదు..సుమారుగా మూడు నాలుగు వందలమంది మాత్రం వున్నారు..ఆరుగంటలకే చీకటి పడింది..ఏడు గంటలకు పల్లకీసేవ ప్రారంభం అయింది..అంతవరకూ మంటపం ముందు వైపు కూర్చుని ఉన్న రామయోగి స్వామి..పల్లకీ దగ్గరకు వచ్చి కూర్చున్నారు..చాలా శ్రద్ధగా పల్లకీసేవ తతంగాన్ని గమనించసాగారు..పూజా కార్యక్రమాలు అయిపోయి..పల్లకీని శ్రీ స్వామివారి సమాధి చుట్టూ త్రిప్పడానికి భక్తులు సమాయత్తం అవుతున్న సమయం లో..తన వంటి మీద ఉన్న చొక్కాను విప్పివేసి..భుజంబుమీద ఉన్న ఉత్తరీయాన్ని నడుముకు చుట్టుకొని..ఒక్క ఉదుటున పల్లకీ దగ్గరకు వచ్చి..పల్లకీ ని తన భుజం మీదకు ఎత్తుకున్నారు..నేను కొద్దిగా నివ్వెరపోయాను..


శ్రీ స్వామివారి ఆలయం వెలుపల..మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు అయ్యేవరకూ..ఆపై ముఖద్వారం వద్ద పల్లకీని ఇతర భక్తుల తో పాటు పైకెత్తి పట్టుకొని..భక్తులందరూ ఆ పల్లకీ క్రింద నుంచి నడచి వచ్చేదాకా..తిరిగి పల్లకీ యధాస్థానానికి చేరేదాకా...తానే మోస్తూ వున్నారు..అర్చకస్వామి చివరలో ఇచ్చిన తీర్ధ ప్రసాదాలను భక్తితో స్వీకరించి..ఇవతలికి వచ్చేసారు..ఆ తరువాత..కొంచెం సేపు మంటపం లో వుండి..బైటకు వెళ్లిపోయారు..


ప్రక్కరోజు ఆదివారం ఉదయం ఐదు గంటలకల్లా మందిరం లోని మంటపం లోకి వచ్చేసారు..శ్రీ స్వామివారి సమాధికి అర్చకస్వాముల ద్వారా జరిగిన అభిషేకాన్ని దగ్గరుండి మరీ చూసారు..హారతులు అయిపోయిన తరువాత..నా వద్దకు వచ్చి..

"స్వామివారి సమాధి వద్దకు ఇప్పుడు వెళ్ళొచ్చా..." అని అడిగారు.."వెళ్ళండి.." అన్నాను..


శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, మూడు ప్రదక్షిణాలు చేశారు..శ్రీ స్వామివారి పాదుకులను తన నెత్తిమీద పెట్టుకున్నారు..వాటిని మళ్లీ యధాస్థానం లో ఉంచి..సమాధికి మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చారు..


"నిన్న రాత్రి పల్లకీసేవ లో కూర్చున్న క్షణం నుంచీ..నాలో ఏదో తెలీని అంతర్మధనం మొదలైంది..నేను చేస్తున్న సాధనలో పొరపాటు ఉందేమో అని అనిపిస్తున్నది..ఇతమిద్ధంగా ఇదీ అని చెప్పలేను..అహంకరించొద్దు..అహంకరించొద్దు..అని పదే పదే అంతర్వాణి పలుకుతున్నది..రాత్రంతా అశాంతి గా వున్నాను..శ్రీ స్వామివారి సమాధి వద్ద పాదుకలు నా శిరస్సు కు ఆనించుకున్న మరుక్షణం..నాలోని ఆవేదన మాయం అయింది..నేను చేసే సాధనే గొప్పది అనే భావన విడవమని స్వామివారి ఆదేశం అనిపించింది..ఇలా దేశాలు పట్టి తిరగకుండా..ఒకచోట స్థిరంగా వుండి సాధన చేసుకోమని నాకు ఆజ్ఞ వచ్చినట్లు అనిపించింది..ఇక నాకు అనువైన ప్రదేశానికి వెళ్లి అక్కడే నేను సాధన చేసుకుంటాను..నాకు ఏ సందేహం వచ్చినా...ఇక్కడకు వచ్చి..ఈ స్వామివారి సమాధిని దర్శించుకుంటాను..మీ ఆదరణ కు నా ధన్యవాదములు.." అన్నారు..


తనని తాను గౌరవ వాచకం తో సంబోధించుకున్న ఆ సాధకుడు..శ్రీ స్వామివారి సమాధి దర్శనం అనంతరం అత్యంత వినయంగా తన గురించి చెప్పుకొచ్చారు..అదే పరివర్తన అనుకున్నాను నేను..


ఆ తరువాత ఆ సన్యాసి మరొక్కసారి మాత్రమే శ్రీ స్వామివారి సమాధి దర్సనానికి వచ్చారు..తనకు మార్గదర్శనం చేసిన స్వామివారికి ఆజన్మపర్యంతం ఋణపడిఉంటానని పదే పదే చెప్పుకొచ్చారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: