12, అక్టోబర్ 2021, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*449వ నామ మంత్రము* 12.10.2021


*ఓం కాంత్యై నమః*


ఇచ్ఛాస్వరూపురాలు మరియు శక్తిస్వరూపురాలు (కాంతి శబ్దముచే) గా విశేషించి చెప్పబడు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కాంతిః* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం కాంత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులను స్ఫురద్రూపులుగాను, పరిపూర్ణత్వము నిండిన ముఖవర్చస్సుతో విరాజిల్లువారిగను అనుగ్రహించి సకల జనుల మధ్య ఆదరణగలవారిగ వర్ధిల్లజేయును.


*యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థితా|*


*నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః॥*


కాంతి రూపంలో సకల జగములందూ విరాజిల్లుచున్న పరమేశ్వరీ నమో నమః🙏🙏🙏


అనంతకోటి జీవరాశులలో ఆ పరమేశ్వరి తేజస్సుగా విరాజిల్లుచూ, ఆ జీవులకు జీవకళను ప్రసాదించుచున్నది. జీవులకు తేజస్సులేనిచో ఆ జీవులలో ప్రేతకళ ఉట్టి పడుచుండును. కాంతిస్వరూపిణియై, జీవులకు కాంతిప్రదాతయై విరాజిల్లుచూ, ఇచ్ఛాస్వరూపురాలుగను, శక్తిస్వరూపురాలుగను విలసిల్లుచున్నది ఆ పరమేశ్వరి గనుకనే జీవులకు శక్తిని ప్రసాదించుచున్నది, తేజస్సును ప్రసాదించుచున్నది. ఆ తల్లి *ఉద్యద్భానుసహస్రాభ* ఉదయించుచున్న వేయి (అనంతకోటి) సూర్యుల కాంతిని బోలియున్నది. అంతటి కాంతిగలిగి యుండుటచే జీవులకు తేజస్సును ప్రసాదించుచున్నది గనుకనే అమ్మవారు *కాంతిః* అని యనబడినది. కాంతిలో సంచరించు జీవులు కళకళలాడు కాంతివంతమైన శరీరచ్ఛాయతో విరాజిల్లుట జరుగును. నీడలో పెరిగే మొక్కకు, సూర్యకాంతిలో పెరిగే మొక్కకు ఎంత వ్యత్యాసముండునో కాంతితో విరాజిల్లు జీవులకు, కాంతివిహీన జీవులకు అంతటి వ్యత్యాసముండును. అందుకనే అమ్మవారు *యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థితా* అని కీర్తింపబడుచున్నది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కాంత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: