12, అక్టోబర్ 2021, మంగళవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

 *12.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*


*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*14.17 (పదిహేడవ శ్లోకము)*


*నిష్కించనా మయ్యనురక్తచేతసః శాంతా మహాంతోఽఖిలజీవవత్సలాః|*


*కామైరనాలబ్ధధియో జుషంతి యత్ తన్నైరపేక్ష్యం న విదుః సుఖం మమ ॥12745॥*


నా భక్తులు సర్వదా నాయందే అనురక్తులై నన్ను దప్ప మరి దేనీనీ అభిలషింపరు. వారు అంతఃకరణ శుద్ధిగలవారు (జితేంద్రియులు). సకల జీవులయందును వాత్సల్యము గలిగియుందురు. సాధుస్వభావముగలవారు. ఎట్టి కామవాసనలునూ లేనివారు. అట్టి సత్పురుషులకు లభించు ఏకాంతిక సుఖానుభవము (నిరతిశయానంద సుఖానుభవము) మఱి ఎవ్వరికిని ప్రాప్తింపదు.


*14.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*బాధ్యమానోఽపి మద్భక్తో విషయైరజితేంద్రియః|*


*ప్రాయః ప్రగల్భయా భక్త్యా విషయైర్నాభిభూయతే॥12746॥*


నా భక్తుడు జితేంద్రియుడు కానప్పటికి అతనిని శబ్దస్పర్శాది విషయములు బాధించుచున్నను (ఆకర్షించుచున్నను) అతనిలో దినదినాభివృద్ధి చెందుచున్న నా భక్తియోగ ప్రభావముచేత క్రమక్రమముగ విషయాసక్తి నశించిపోవును.


*14.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*యథాగ్నిః సుసమృద్ధార్చిః కరోత్యేధాంసి భస్మసాత్|*


*తథా మద్విషయా భక్తిరుద్ధవైనాంసి కృత్స్నశః॥12747॥*


ప్రచండాగ్ని (బాగుగా ప్రజ్వలించుచున్న అగ్ని) ఇంధనములను భస్మము చేయునట్లు, నా యందుగల భక్తియే పాపములను అన్నింటిని పూర్తిగా రూపుమాపును.


*14.20 (ఇరువదియవ శ్లోకము)*


*న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవ|*


*న స్వాధ్యాయస్తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జితా॥12748॥*


ఉద్ధవా! నన్ను చేరుటకు భక్తియే సులభమైన మార్గము. యోగసాధనము, సాంఖ్యము, ధర్మాచరణము, స్వాధ్యాయము, తపస్సు, త్యాగము మున్నగునవి ఏవియును భక్తివలె సులభోపాయములు గావు.


*14.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*భక్త్యాహమేకయా గ్రాహ్యః శ్రద్ధయాఽఽత్మా ప్రియః సతామ్|*


*భక్తిః పునాతి మన్నిష్ఠా శ్వపాకానపి సంభవాత్॥12749॥*


నేను సత్పురుషులకు ఇష్టుడను. వారికి నేను ఆత్మస్వరూపుడను. వారి భక్తిశ్రద్ధలవలన మాత్రమే (నేను) వారికి ప్రాప్యుడను. నా భక్తుడు పుట్టుకచే (జన్మతః) చండాలుడైనప్పటికిని, నాపైగల గాఢమైన భక్తియే అతనిని పవిత్రుని గావించును.


*14.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*ధర్మః సత్యదయోపేతో విద్యా వా తపసాఽన్వితా|*


*మద్భక్త్యాఽపేతమాత్మానం న సమ్యక్ ప్రపునాతి హి॥12750॥*

ఉద్ధవా! నాయందు భక్తిలేనివాడు ఎంతగా ధర్మాచరణ మొనర్చినను, సత్యనిష్ఠ గలిగియున్నను, ఎంతటి దయాళువైనను, ఎన్ని విద్యలను నేర్చినను, ఎట్టి తపస్సులను గావించినను అతడు పవిత్రుడు కాజాలడు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: