🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
(ఎడమభుజంపై ఉత్తరీయం వేసుకుని పూజచేయాలి)ఇపుడు చదవండి..
* ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు .
సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంక అంతకన్నా అన్యాయమైన విషయం ఏం ఉంటుంది? ఇంక దానిమీద వ్యాఖ్యానం చేయడం అనవసరం. కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చేయాలి.
పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం.
ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే ఉండాలి పురుషుడికి.
చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పక్కరలేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు.
యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు.
ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి.
మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి.
‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు.
దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు.
పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె
కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది. అదేం పెద్ద విశేషమా? అదేం బ్రహ్మవిద్యేం కాదు. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి